Hyderabad: పోడియం వైపు చూస్తున్నారు

నగరంలోని ఒక ప్రముఖ సంస్థ కొండాపూర్‌లోని గృహ నిర్మాణ ప్రాజెక్టులో పార్కింగ్‌ కోసం మూడు బేస్‌మెంట్లు తవ్వింది.  వాహనాలు నిలిపేందుకు ఏకంగా 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్‌మెంట్లను భూగర్భంలో నిర్మించామని తెలిపింది. వ్యయం పెరిగింది. భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల్లో

Updated : 09 Jul 2022 10:36 IST

 బేస్‌మెంట్ల తవ్వకంలో పెరిగిన నిర్మాణ వ్యయం, ప్రమాదాలు
కొత్త ప్రాజెక్టుల్లో పైఅంతస్తుల్లో పార్కింగ్‌ నిర్మాణంపై బిల్డర్ల కసరత్తు

* నగరంలోని ఒక ప్రముఖ సంస్థ కొండాపూర్‌లోని గృహ నిర్మాణ ప్రాజెక్టులో పార్కింగ్‌ కోసం మూడు బేస్‌మెంట్లు తవ్వింది.  వాహనాలు నిలిపేందుకు ఏకంగా 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్‌మెంట్లను భూగర్భంలో నిర్మించామని తెలిపింది. వ్యయం పెరిగింది. భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల్లో పోడియం పార్కింగ్‌కు వెళ్లాలని చూస్తున్నామని సదరు బిల్డర్‌ తెలిపారు.

* మరో పెద్ద సంస్థ మాదాపూర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గృహ నిర్మాణ ప్రాజెక్టులో మూడు బేస్‌మెంట్లు ఉన్నాయి. సెల్లార్లు కావడంతో పగలూ రాత్రి విద్యుత్తు దీపాలు తప్పనిసరి. వీటి కరెంట్‌ బిల్లే నెలకు రూ.లక్షల్లో వస్తుందని సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధి తెలిపారు. భవిష్యత్తు ప్రాజెక్టుల్లో నిర్వహణ వ్యయం తగ్గించేలా పార్కింగ్‌ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.

పార్కింగ్‌ కోసం సెల్లార్లు తవ్వడమా? పై అంతస్తుల్లో పోడియా పార్కింగ్‌కు వెళ్లడమా?  నిర్మాణ సంఘాలు పట్టుబట్టి రెండోదానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నా..  ఏడాదికాలంగా పెద్దగా నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం మూడు, నాలుగు బేస్‌మెంట్ల కోసం భూగర్భంలో తవ్వకం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారడంతో కొత్త ప్రాజెక్టుల్లో పోడియం పార్కింగ్‌ దిశగా బిల్డర్లు ఆర్కిటెక్చర్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చాలావరకు నిర్మాణ, నిర్వహణ వ్యయం తగ్గుతుందని అంటున్నారు. నగరంలో బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు పార్కింగ్‌ కోసం ఎక్కువగా సెల్లార్లు(బేస్‌మెంట్లు) తవ్వుతున్నారు. వానాకాలంలో సెల్లార్ల తవ్వకంతో  ఏటా ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇటీవల కూడా తవ్వకాల్లో ప్రమాదం జరిగింది. వీటి నివారణకు వానాకాలంలో తవ్వకాలపై జీహెచ్‌ఎంసీ ఆంక్షలు విధిస్తుంది. హైదరాబాద్‌లో ఉన్నవి రాతినేలలు కావడంతో వీటి బ్లాస్టింగ్‌ పెద్ద సవాల్‌. సెల్లార్లలో మట్టి తరలింపు మరో సమస్య. తవ్విన మట్టిన ఎక్కడికి తరలిస్తున్నారనేది పర్యవేక్షణ లేకపోవడంతో చెరువులు, వరద కాలువల సమీపంలో పోస్తున్నారు. దీంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. అయినా ఇప్పటివరకు సెల్లార్ల వైపే బిల్డర్లు మొగ్గుచూపారు. ఆకాశహర్మ్య ప్రాజెక్టులన్నీ 3 బేస్‌మెంట్లతో కడుతున్నాయి. నాలుగైదువేల కార్లకు పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తున్నారు. మూడు అంతకంటే ఎక్కువ పడక గదుల ఇళ్ళకు రెండు కారు పార్కింగ్‌లు తప్పనిసరి కావడంతో  భూమి లోపల ఒకటి, రెండు, మూడు అంతస్తులు తవ్వుతూ వెళుతున్నారు.


50 శాతం ఖర్చు తగ్గుతుందని..
పై అంతస్తుల్లో పోడియం పార్కింగా? సెల్లార్లలో బేస్‌మెంటా అనేది బిల్డర్లకు ఐచ్ఛికంగా ఉంది. భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం వీటి లాభనష్టాలను బేరీజు వేస్తున్నారు. పై అంతస్తుల్లో పార్కింగ్‌తో 50 శాతం వరకు నిర్మాణ వ్యయం తగ్గుతుందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ మాజీ అధ్యక్షుడు ఎస్‌.రాంరెడ్డి అన్నారు. బహుళ అంతస్తుల భవనాలకు పోడియం పార్కింగ్‌ మేలని అన్నారు. ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవో ప్రకారం భూమి నుంచి అవసరాన్ని బట్టి నాలుగు నుంచి ఐదు అంతస్తుల వరకు పార్కింగ్‌ ఫ్లోర్లు నిర్మించుకోవచ్చు. ఆపైన నివాస అంతస్తులు మొదలవుతాయి. అవసరం అనుకుంటే ఒక బేస్‌మెంట్‌ వరకు కిందకు వెళ్లొచ్చు అంటున్నారు నిర్మాణదారులు. స్టిల్ట్‌ను ఏ విధంగా భవనం ఎత్తులో పరిగణించరో పోడియం పార్కింగ్‌ అంతస్తులను సైతం ఎత్తు లెక్కల్లోకి తీసుకోరు.


 

సమస్యలివీ..
* మూడు, నాలుగు బేస్‌మెంట్లు అంటే 40 అడుగుల లోతు వరకు తవ్వాలి.
లోతుకు వెళ్లేకొద్దీ రాళ్లు వస్తున్నాయి.
* వీటి బ్లాస్టింగ్‌కు అనుమతి లేదు. పక్క భవనాల పునాదులు కదిలే ప్రమాదం ఉంది.
* ఒకేసారి కాకుండా దశలవారీగా రసాయనాలతో బ్లాస్టింగ్‌  చేయాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
తవ్విన మట్టిని, రాళ్లను ఎక్కడికి తరలించాలనేది పెద్ద సమస్య.
* తరలింపు సమయంలో రహదారులపై మట్టి పడుతోంది. రహదారులు దెబ్బతినడమే కాదు చిన్నవాహనాలు జారి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
* పునాది స్తంభాలు నిర్మించడం పెద్ద సవాల్‌. రాళ్లు, వాటి పగుళ్లలో వీటిని నిర్మించలేదు.
* భూగర్భం లోపల మూడు అంతస్తుల కింద నుంచి పైదాకా కాంక్రీట్‌తో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పెద్ద సవాల్‌.
* ఈ దశలన్నీ పూర్తిచేశాక పోడియంగా నిర్మించే స్లాబ్‌ చాలా ధృఢంగా ఉండాల్సి ఉంటుంది. వీటిపై భారీ వాహనాలు సైతం తిరుగుతుంటాయి. 3రెట్ల కాంక్రీట్‌ అదనంగా వాడాల్సి వస్తోంది.
* సహజ వెలుతురు సరిపోదు. కృత్రిమంగా మెకానికల్‌ వెంటిలేషన్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాల భయం పొంచి ఉంటుంది.
* ఇవన్నీ పూర్తయ్యేవరకు ఆరు నెలల నుంచి 9 నెలల సమయం పడుతుంది. వర్షాకాలం వస్తే ఏడాది పడుతుంది.
* ఇంత పని చేసినా.. భారీగా ఖర్చు చేసినా...మొదటి అంతస్తు పడేవరకు బ్యాంకుల నుంచి రుణాలు రావు. కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు కూడా రావని ఏ విధంగా చూసినా బేస్‌మెంట్ల నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్నదని బిల్డర్లు అంటున్నారు.

నిబంధనలు ఇలా..
* ఎకరంపైన స్థలంలో నిర్మించే బహుళ అంతస్తుల గృహ సముదాయాలు రెండు సెల్లార్లకు మించి వెళ్లడానికి వీల్లేదు. వీరు 15 మీటర్ల ఎత్తు వరకు అంటే ఐదు అంతస్తుల వరకు పోడియం పార్కింగ్‌కు కేటాయించుకోవచ్చు. వాణిజ్య భవనాలకు మూడు సెల్లార్ల వరకు అనుమతిస్తారు.
* పది ఎకరాల విస్తీర్ణంలో 4 టవర్లు కట్టినా ఒకటే పోడియం నిర్మించుకోవచ్చు. పది ఎకరాలు దాటితే మాత్రం మరో పోడియం ఉండాల్సిందే.
* అప్రోచ్‌ రోడ్డును బట్టి భవనం ఎత్తుకు అనుమతి ఇస్తారు. పోడియం పార్కింగ్‌ ఎత్తు ఇందులోంచి మినహాయిస్తారు.
* 18 అంతస్తుల లోపు భవనమైతే (55 మీటర్ల వరకు) పోడియం అంతస్తుల చుట్టూ 7మీటర్ల సెట్‌బ్యాక్‌ తప్పనిసరి. ఫైర్‌ ఇంజిన్లు చుట్టూ తిరిగేందుకు వీలుగా మూలల్లో 12 మీటర్ల సెట్‌బ్యాక్‌ వదలాలి.
* 55 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించే భవనాల్లో పోడియం అంతస్తుల చుట్టూ 9 మీటర్ల సెట్‌బ్యాక్‌ ఉండాలి. మూలల్లో 14 మీటర్లు ఖాళీ స్థలం వదలాలి. ఈ మేరకు పోడియం ఫ్లోర్‌ డిజైన్‌ రూపొందించుకోవాలి.
* పోడియంపైన నిర్మించే టవర్లకు బిల్డింగ్‌ నిబంధనల మేరకే సెట్‌బ్యాక్‌ వదలాలి. ప్రహరీ నుంచి టవర్ల వరకు 43 అడుగులు వదలాల్సి ఉంటుంది.
* పోడియం అంతస్తులను పూర్తిగా పార్కింగ్‌కే ఉపయోగించాలి. సందర్శకుల లాబీ, డ్రైవర్ల గదులు, మరుగుదొడ్ల వరకు నిర్మించుకోవచ్చు. ఫ్లోర్‌ ఏరియాలో నిర్దిష్ట శాతం వరకు మాత్రమే వీటికి అనుమతి ఉంది.

చిన్న బిల్డర్ల డిమాండ్‌ ఇదీ : తక్కువ విస్తీర్ణంలో కట్టే అపార్ట్‌మెంట్లలోనూ పోడియం పార్కింగ్‌కు ముందుకు రావడం లేదు. నిర్మాణ వ్యయం పెరుగుతుందని చిన్న బిల్డర్లు అంటున్నారు. సాధారణంగా భవనం చుట్టూ 3 నుంచి 3.5. మీటర్ల సెట్‌బ్యాక్‌ వదిలి కడుతుంటారు. సెల్లారులో పార్కింగ్‌తో ఈ మేరకు కింద స్థలం కలిసి వస్తుంది. అదే పోడియం పార్కింగ్‌ అయితే నిర్మాణం చేపట్టిన మేరకే పార్కింగ్‌ స్థలం వస్తుంది. ఇందులో కొంత ర్యాంపులకు పోతుంది. రెండు సెల్లార్లకు బదులు రెండున్నర నుంచి మూడు స్టిల్ట్‌ల మేర పార్కింగ్‌కు కేటాయించాల్సి వస్తుంది. దీంతో భవనం ఎత్తు 18 మీటర్లు దాటుతుంది. ఈ సందర్భంలో అగ్నిమాపకశాఖ అనుమతి తప్పనిసరి. ఎత్తు పరిమితిని 21 మీటర్లకు పెంచితే చిన్న బిల్డర్లు సైతం సెల్లార్లకు వెళ్లకుండా స్టిల్ట్‌ ఆపైన ఒకటి రెండు అంతస్తులతో పోడియం పార్కింగ్‌ చేపట్టేందుకు అవకాశం ఉంటుందని బిల్డర్లు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని