కొంటాం.. కానీ కాస్త తగ్గించరూ!

ఇళ్ల ధరలు పెరిగాయి.. ఎక్కువ మంది కొనుగోలుదారుల బడ్జెట్‌ను మించి ఇవి ఉన్నాయి.. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని కొందామంటే వడ్డీ రేట్లు భారంగా మారాయి.. జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి..

Updated : 23 Sep 2023 07:02 IST

పెరిగిన ఇళ్ల ధరలు.. వడ్డీరేట్లతో కొనుగోలుదారుడు సతమతం
జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో మినహాయింపులు ఇవ్వాలంటున్న నరెడ్కో

ఇళ్ల ధరలు పెరిగాయి.. ఎక్కువ మంది కొనుగోలుదారుల బడ్జెట్‌ను మించి ఇవి ఉన్నాయి.. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని కొందామంటే వడ్డీ రేట్లు భారంగా మారాయి.. జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి.. సరే కొన్నాళ్లు వేచిచూద్దామంటే ఏడాది తిరిగేసరికి ధరలు పైచూపు చూస్తున్నాయే తప్ప దిగి రావడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలుదారులు.. బిల్డర్లు, ప్రభుత్వం వైపు చూస్తున్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో వెలుసుబాటు కల్పిస్తే.. నిర్మాణదారులు రాయితీలిస్తే.. తమకు కొంతభారం తగ్గుతుందని స్థిరాస్తి సంస్థ సర్వేల్లో కొనుగోలుదారులు వెల్లడిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ప్రాంతాలను బట్టి ఇళ్ల ధరలు ఉన్నాయి. అవుటర్‌ బయట వ్యక్తిగత ఇళ్లకే రూ.50 లక్షలపైగా చెబుతున్నారు. అవుటర్‌ లోపల కొన్ని ప్రాంతాల్లో 150 గజాల వ్యక్తిగత ఇళ్లను రూ.80 లక్షలకు కట్టి ఇస్తామంటున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో విల్లాల ధరలు రూ.కోటిపైనే ఉన్నాయి. సిటీ లోపల రూ.4 కోట్ల నుంచి రూ.12 కోట్ల ధరలు పలుకుతున్నాయి. ఇక ఎక్కువ మంది కొంటున్న అపార్ట్‌మెంట్లలో రూ.40 లక్షలు మొదలు రూ.8 కోట్ల వరకు ఉన్నాయి. విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. మధ్య తరగతి వారు నివాసం ఉండే ప్రాంతాల్లో, పని ప్రదేశానికి దగ్గరలో ఇల్లు కావాలంటే స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లలో రెండు పడకల ఫ్లాట్‌కు రూ.50 లక్షలపైగా అవుతోంది. అదే గేటెడ్‌ కమ్యూనిటీల్లో రూ.70-80 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఎక్కువమంది మూడు పడకల ఫ్లాట్ల కోసం చూస్తున్నారు. కోటి రూపాయలు అవుతోంది. ఐటీ కారిడార్‌లో దీనికి రెండింతలు చెబుతున్నారు. సామాన్య, మధ్య తరగతి వారి కోరికలకు తగ్గట్టుగా కలల గృహం కొనుగోలు తలకుమించిన భారంగా మారింది. ఏడాది కాలంలో గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో సగటున 6 శాతం పైగా స్థిరాస్తుల ధరలు పెరిగాయి.

రుణమే ఆధారం..  

ఇల్లు కొనుగోలు చేసేవారిలో అత్యధిక శాతం మందికి గృహ రుణాలే ఆధారం. వడ్డీరేట్లు ప్రస్తుతం గరిష్ఠ స్థాయికి చేరాయి. వడ్డీరేట్లు 9 శాతంపైనే ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో 6.50 శాతానికి దిగి వచ్చిన వడ్డీరేట్లు.. ఏడాది కాలంగా పెరుగుతూ తొమ్మిది శాతం దాటేశాయి. దీంతో రుణ లభ్యత తగ్గిపోయింది. ఒకవైపు ఇళ్ల ధరలు పెరిగి.. మరోవైపు వడ్డీరేట్ల మోతతో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ధైర్యం చేసి కొంటే ఈఎంఐ చెల్లింపు భారం అయ్యే పరిస్థితి తప్పట్లేదు.

కేంద్ర పథకం కోసం ఎదురుచూపు..

2022 నాటికి అందరికి ఇళ్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వం ఇదివరకు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికీ ఎంతోమంది సొంతింటి భాగ్యానికి నోచుకోలేదు. నగరాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు.. బ్యాంకు రుణాల్లో ఉపశమనం కల్గించే పథకాన్ని త్వరలో ప్రకటిస్తామని ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇది వస్తే కొంత ఉపసమనం ఉంటుంది. ఇదివరకు పీఎంఏవై-క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ పథకంతో ఈఎంఐ భారం తగ్గింది.

48 శాతం మంది పెట్టుబడిగా చూస్తున్నారు..  : గృహ కొనుగోలుదారులతో ప్రాప్‌టెక్‌, నరెడ్కోతో కలిసి జనవరి నుంచి జూన్‌ మధ్య సర్వే చేయగా...

  • రియల్‌ ఎస్టేట్‌ను పెట్టుబడి సాధనంగా 48 శాతం మంది చూస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌, బంగారం, ఫిక్సెడ్‌ డిపాజిట్ల చేసేవారి శాతం కంటే గణనీయంగా స్థిరాస్తికే మొగ్గుచూపుతున్నారు. 18 శాతం స్టాక్‌ మార్కెట్‌ను, 19 శాతం ఫిక్సెడ్‌ డిపాజిట్ల, 15 శాతం మంది బంగరాన్ని పెట్టుబడి పెట్టేందుకే ఎంచుకుంటున్నట్లు వెల్లడించారు.  
  • నిర్మాణంలో ఉన్న వాటి కంటే సిద్ధంగా ఉన్న ఇళ్లకు కొనుగోలుదారుల నుంచి ఎక్కువ డిమాండ్‌ ఉంది.
  • గేటెడ్‌ కమ్యూనిటీలవైపు ఈ ఏడాది ద్వితీయార్థంలో మొగ్గు 64 శాతంగా ఉండనుందని అంచనా. ప్రథమార్థంలో ఇది 60 శాతంగా ఉంది.
  • సరైన ప్రాంతంలో సరైన బడ్జెట్‌లో ఇల్లు కొనుగోలు చేయడం పెద్ద సవాల్‌గా ఉందని 52 శాతం మంది చెప్పారు.
  • చెల్లింపుల్లో వెసులుబాటు ఉండేలా ఫ్లెక్సిబుల్‌ పేమెంట్‌ ప్లాన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు.
  • కొంతకాలం మెయింటినెన్స్‌ ఉచితంగా అందించాలని కోరుకుంటున్నారు.
  • అద్దెలు గ్యారెంటీగా వచ్చేలా ఉండాలని చూసేవారు ఎక్కువగా ఉన్నారు.
  • మాడ్యులర్‌ కిచెన్స్‌, ఇంటీరియర్స్‌ ఉచితంగా లేదంటే రాయితీపై చేయించడం వంటి ప్రోత్సాహకాలు కొనుగోలుదారులు నిర్ణయం తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలని చెబుతున్నారు. క్లబ్‌లో ఉచితంగా జీవితకాల సభ్యత్వం, వాటర్‌ఫ్యూరీఫైయర్‌, మైక్రోఓవెన్‌, హోమ్‌ ఆటోమేషన్‌ వంటి ఉచితాలు ఎక్కువ మంది ఆకర్షిస్తున్నాయి.

సిటీలో కొన్ని సంస్థలిలా..

  • నగరంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొన్ని సంస్థలు ఇప్పటికే కొన్ని ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
  • నిర్మాణంలో ఉన్న స్థిరాస్తులకు 5 శాతం జీఎస్‌టీ కేంద్రం వసూలు చేస్తుంది. దీంట్లో సగం తాము భరిస్తామని కొన్ని సంస్థలు అంటుంటే.. సున్నా శాతం అని మరికొన్ని నిర్మాణదారులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
  • నిర్మాణంలో ఉన్న ఆస్తి కొనుగోలు చేస్తే.. నిర్మాణం పూర్తయ్యేవరకు ఈఎంఐ మొత్తాన్ని తాము చెల్లిస్తామని ఆఫర్‌ ఇస్తున్నాయి. ఇది ఇరువురికీ ప్రయోజనకరంగా ఉంది. నిర్మాణ సంస్థలకు బ్యాంకులు పదిశాతం పైనే వడ్డీకి రుణాలు ఇస్తుంటాయి. అదే గృహ కొనుగోలుదారులకు అటుఇటుగా ప్రస్తుతం 9 శాతానికే ఇస్తున్నాయి. కాబట్టి ఆయా సంస్థలకు వడ్డీ భారం కొంత తగ్గుతుంది. కొనుగోలుదారుడికి ఇల్లు పూర్తయ్యేవరకు ఈఎంఐ భారం తప్పుతుంది. లేకపోతే ఉంటున్న ఇంటికి అద్దె, కొన్న ఇంటికి ఈఎంఐ మోయలేని భారం అవుతుంది. దీన్నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు.
  • ఆకాశహర్మ్యాల్లో ఐదు అంతస్తులు దాటిన తర్వాత ఫ్లోర్‌రైజ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్ని సంస్థలు వీటిని మినహాయిస్తున్నాయి.

అందుబాటులో ఉండేందుకు..

పెరుగుతున్న స్థిరాస్తి ధరలు, వడ్డీరేట్ల కారణంగా ప్రోత్సాహకాలు, స్టాంపుడ్యూటీ, జీఎస్‌టీ మినహాయింపులు వంటివి సమీప భవిష్యత్తులో గృహ కొనుగోళ్లలో కీలక ప్రభావం చూపుతాయి. ఇవి కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటులో ఉండేలా చేస్తాయి.

రాజన్‌ బండేల్కర్‌, అధ్యక్షుడు, నరెడ్కో


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని