బొజ్జ గణపయా... ఆరగించవయ్యా!

గణేశ నవరాత్రుల సమయంలో రకరకాల ప్రసాదాలతో బొజ్జగణపయ్యకి సంతుష్టిపరుస్తుంటారు భక్తులు. అలా నివేదించే వాటిల్లో కొన్ని...

Published : 26 Jun 2021 16:37 IST

గణేశ నవరాత్రుల సమయంలో రకరకాల ప్రసాదాలతో బొజ్జగణపయ్యకి సంతుష్టిపరుస్తుంటారు భక్తులు. అలా నివేదించే వాటిల్లో కొన్ని...

ఆవ పులిహోర

కావలసినవి
బియ్యం: కప్పు, చింతపండు: నిమ్మకాయంత, బెల్లంతురుము: 2 టీస్పూన్లు, ఆవాలు: టీస్పూను, ఉప్పు: తగినంత, నువ్వులనూనె: టేబుల్‌స్పూను, తాలింపు కోసం: ఆవాలు: టీస్పూను, పల్లీలు: 4 టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: 2 టీస్పూన్లు, ఎండుమిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: ఆరు, పసుపు: అరటీస్పూను, కరివేపాకు: 3 రెబ్బలు, ఇంగువ: చిటికెడు, నూనె: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
* బియ్యం కడిగి పది నిమిషాలు నానబెట్టి ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించి దించి వెడల్పాటి ప్లేటులో పరిచినట్లు వేయాలి. అందులోనే నువ్వుల నూనె వేసి కలిపి ఉంచాలి.
* చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన ఉంచాలి.
* ఆవాలు వేయించి తీసి పొడి చేసి ఉంచాలి.
* మందపాటి బాణలిలో తాలింపుకోసం తీసుకున్న నూనె వేసి కాగాక ఆవాలు, పల్లీలు వేసి వేగాక సెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరవాత కరివేపాకు, నువ్వులు, ఇంగువ, పసుపు వేసి ఓ నిమిషం వేగాక చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. బెల్లంకూడా వేసి నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించి చల్లారనివ్వాలి. ఇప్పుడు అన్నంలో ఆవపొడి, ఉప్పువేసి కలిపాక చింతపండు మిశ్రమం వేసి బాగా కలిపితే సరి.

పాల తాలికలు

కావలసినవి
తాలికల కోసం: బియ్యప్పిండి: ముప్పావుకప్పు, మంచినీళ్లు: అరకప్పు, పాలు: పావుకప్పు, పంచదార: టేబుల్‌స్పూను, నెయ్యి: టేబుల్‌స్పూను, పాయసం కోసం: నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష: 2 టేబుల్‌స్పూన్లు, ఎండు కొబ్బరిముక్కలు: 2 టేబుల్‌స్పూన్లు, చిక్కని పాలు: 3 కప్పులు, బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, మంచినీళ్లు: పావుకప్పు, యాలకులపొడి: అరటీస్పూను, బెల్లంపాకం కోసం: బెల్లం తురుము: ముప్పావు కప్పు

తయారుచేసే విధానం
* బెల్లం తురుములో కొద్దిగా నీళ్లు పోసి మరిగించి దించి పక్కన ఉంచాలి.
* తాలికలకోసం పాన్‌లో నీళ్లు, పాలు పోసి, చక్కెర, నెయ్యి వేసి మరిగించాలి. తరవాత స్టవ్‌ ఆఫ్‌ చేసి బియ్యప్పిండి వేసి కలుపుతూ ఉండలు కట్టకుండా కలపాలి. ఇందులో టేబుల్‌స్పూను పిండిని విడిగా తీసుకుని అందులో పావుకప్పు నీళ్లు పోసి కలిపి పక్కన ఉంచాలి. మిగిలిన మిశ్రమాన్ని చక్కిడాల గిద్దలో పెట్టాలి.
* బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించి తీయాలి. తరవాత పాలు పోసి మరిగించాలి. ఇప్పుడు చక్కిడాల గిద్దతో పిండిని పాలల్లోకి తాలికల్లా వత్తాలి. అవి కాస్త గట్టిపడ్డాయి అనుకున్నాక మెల్లగా కలుపుతూ ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తరవాత పక్కన ఉంచిన బియ్యపుపిండి నీళ్లను పోసి మరోసారి కలిపి వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌, యాలకులపొడి వేసి కలపాలి. చివరగా కరిగించిన బెల్లం పాకాన్ని పోసి కలిపి దించాలి.

అన్నం పాయసం

కావలసినవి
బియ్యం: కప్పు, కొబ్బరిపాలు: 4 కప్పులు, యాలకులపొడి: అరటీస్పూను, నల్ల బెల్లం: రెండు కప్పులు, జాజికాయ పొడి: చిటికెడు, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు: పది

తయారుచేసే విధానం
* ప్రెషర్‌కుక్కర్‌లో కడిగిన బియ్యం వేసి మూడు కప్పుల కొబ్బరి పాలు పోసి ఉడికించాలి. తరవాత తరిగిన బెల్లం వేసి కలపాలి. ఇప్పుడు మిగిలిన కొబ్బరి పాలు పోసి సిమ్‌లో రెండుమూడు నిమిషాలు ఉడికించాలి. విడిగా ఓ బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు వేయించాలి. తరవాత జాజికాయ పొడి కూడా వేసి రెండూ కలిపి పాయసంలో వేసి కలపాలి. చివరగా యాలకులపొడి కూడా వేసి కలిపి దించాలి.

రవ్వ పొంగలి

కావలసినవి
బొంబాయిరవ్వ: అరకప్పు, పెసరపప్పు: పావుకప్పు, జీలకర్ర: అరటీస్పూను, మిరియాలు: టీస్పూను, అల్లంతురుము: టీస్పూను, కరివేపాకు: రెబ్బ, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, మంచినీళ్లు: రెండు కప్పులు

తయారుచేసే విధానం
* పెసరపప్పు కడిగి కుక్కర్‌లో వేసి అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో టేబుల్‌స్పూను నెయ్యి వేసి రవ్వ వేసి వేయించాలి. మంచి వాసన వచ్చాక తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసి వేగాక అల్లం తురుము కూడా వేసి వేయించాలి. ఇప్పుడు మిగిలిన నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరవాత రవ్వవేసి కలుపుతూ ఉడికించాలి. ఉడికించిన పెసరపప్పు కూడా వేసి బాగా కలిపి సిమ్‌లో కాసేపు ఉడికించి, వేయించిన జీడిపప్పు చల్లి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని