జిహ్వ చేపల్యం తీరేలా...

గోదావరి చేప, సముద్ర చేప, చెరువు చేప... దేనికదే ప్రత్యేకమైన రుచి! అందులోనూ వర్షాకాలం కదా ఇంకా బాగుంటాయి. అలాంటి చేపరుచిని ఒక్కరకంగా కాకుండా ఇలా నాలుగు రకాలుగా తిని ఆస్వాదించండి...

Updated : 03 Jul 2022 10:53 IST

గోదావరి చేప, సముద్ర చేప, చెరువు చేప... దేనికదే ప్రత్యేకమైన రుచి! అందులోనూ వర్షాకాలం కదా ఇంకా బాగుంటాయి. అలాంటి చేపరుచిని ఒక్కరకంగా కాకుండా ఇలా నాలుగు రకాలుగా తిని ఆస్వాదించండి...


వేపుడు

కావాల్సినవి: చేప ముక్కలు (ముళ్లు ఎక్కువగా ఉండని రకానివి ఎంచుకోవాలి)- 5, పసుపు- తగినంత, కారం- చెంచాన్నర, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- చెంచా, ధనియాలపొడి- చెంచా, సోంపు పొడి- పావుచెంచా, గరంమసాలా- చెంచా, జీలకర్రపొడి- పావుచెంచా, కరివేపాకు- ఒక రెబ్బ, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి తగినంత, చిల్లీఫ్లేక్స్‌- అరచెంచా 

తయారీ: వెడల్పాటి పాత్రలో చేపలు ముక్కలు తీసుకుని... అందులో పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపుపొడి, గరం మసాలా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి బాగా కలిపి చేపముక్కలకి బాగా పట్టించాలి. ఈ ముక్కలని ఫ్రిజ్‌లో ఇరవై నిమిషాలు  ఉంచితే మసాలా బాగా పడుతుంది. వెడల్పాటి పాన్‌లో తగినంత నూనె తీసుకుని అందులో కరివేపాకు వేసి ఈ ముక్కలని రెండు వైపులా నూనెలో వేయించుకుంటే చేపల ఫ్రై సిద్ధం.


పకోడి

కావాల్సినవి: సెనగపిండి- కప్పున్నర, ముళ్లు తీసి అంగుళం ముక్కలుగా తరిగిన చేప ముక్కలు- అరకిలో, వెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు, అల్లంపేస్ట్‌- చెంచా, పసుపు- చెంచా, ధనియాల పొడి- చెంచా, జీలకర్రపొడి- చెంచా, వాము- చెంచా, కారం- చెంచా, ఉప్పు- తగినంత, నిమ్మరసం- రెండు చెంచాలు, నూనె- వేయించడానికి సరిపడా, నిమ్మకాయ ముక్కలు- అలంకరణ కోసం 

తయారీ: ఒక పాత్రలో సెనగపిండి, కారం, ఉప్పు, ధనియాలపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, వాము, నిమ్మరసం, పసుపు, తగినన్ని నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో శుభ్రం చేసిన చేపముక్కల్ని వేసి అరగంటపాటు ఉంచుకోవాలి. తర్వాత ఒక పాన్‌లో వేయించడానికి తగినంత నూనె తీసుకుని పకోడీలా చేపముక్కల్ని వేయించుకోవడమే. ఫిష్‌ పకోడీ సిద్ధం.  


మామిడికాయచేపలు

కావాల్సినవి: నూనె- రెండు చెంచాలు, ఆవాలు- పావుచెంచా, మెంతులు- పావుచెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, అల్లంముక్క- చిన్నది ఒకటి, పచ్చిమిర్చి- రెండు, ఉల్లిపాయ- ఒకటి, పసుపు- పావుచెంచా, ధనియాలపొడి- రెండు చెంచాలు, కారం- మూడుచెంచాలు, ఉప్పు- తగినంత, టొమాటో- ఒకటి, పచ్చిమామిడికాయ- ఒకటి(ముక్కలు చేసుకోవాలి), కొబ్బరి కోరు- రెండు చెంచాలు, చేప ముక్కలు- అరకిలో 

తయారీ: వెడల్పాటి పాత్రలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, మెంతులు వేసుకోవాలి. అవి కూడా చిటపటమన్నాక అప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఓ అరనిమిషం పాటు వేయించాక అందులో ఉల్లిపాయముక్కలు వేసి పూర్తిగా వేగనివ్వాలి. ఇందులో పసుపు, కారం, ధనియాలపొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాతే మామిడికాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లుపోసి వాటిని ఉడకనివ్వాలి. ఈలోపు కొబ్బరి కోరు నుంచి కొబ్బరి పాలు తీసిపెట్టుకుని వాటిని ఈ కూరలో కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఉడుకుతూ ఉన్నప్పుడు చేపముక్కల్ని వేసుకుని పావుగంట ఉడకనిస్తే రుచికరమైన చేపల కూర సిద్ధం.


బెసార

కావాల్సినవి: కట్టె పరిగెలు లేదా కవలలు(చిన్నచేపలు)-ఆరు, ఆవాలు- మూడు చెంచాలు, ఆవనూనె- తగినంత, పసుపు- అరచెంచా, టొమాటో గుజ్జు- కప్పు, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, ఎండుమిర్చి- రెండు 

తయారీ: చేపల్ని శుభ్రం చేసి పసుపు, ఆవనూనె, ఉప్పు పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆవనూనె తీసుకుని అందులో చేపల్ని వేయించుకుని జాగ్రత్తగా చెదిరిపోకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఎక్కువగా ఉన్న నూనె తీసేసి రెండు చెంచాల నూనె ఉంచుకుంటే తితిచాలు. ఇందులో టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు వేసి మూతపెట్టేయాలి. మరోపక్క ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తీసుకుని వీటిలో కాసిని నీళ్లు పోసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న టొమాటో గుజ్జులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేయించిన చేపలు, సన్నగా చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఐదు నుంచి పదినిమిషాల పాటు ఉడికించుకుంటే బెసార సిద్ధం. వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.


పత్రాని మచ్చి

కావాల్సినవి: చందువ చేప ముక్కలు- ఆరు, ఉప్పు- తగినంత, అరటాకు ముక్కలు- ఆరు, కొత్తిమీర- కప్పు, పుదీనా- కప్పు, పచ్చిమిర్చి- ఆరు, వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది, జీలకర్ర- చెంచాన్నర, కొబ్బరి కోరు- పావుకప్పు, పంచదార- అరచెంచా, నిమ్మరసం- చెంచా, ఉప్పు- తగినంత 

తయారీ: చేపముక్కలు, అరిటాకుల్ని తప్పించి తక్కిన అన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమం గట్టిగా ఉంటే అలానే ఉండనివ్వండి. అందులో నీళ్లు కలపొద్దు. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు రెండు వైపులా పట్టించండి. ఇప్పుడు ఇడ్లీలు వండే పాత్రలోకానీ లేదంటే ఒక వెడల్పాటి పాత్రని కానీ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఆవిరి వచ్చేంతవరకూ ఉండాలి. ఈ ఆవిరిపై ముందుగా అరిటాకులని ఉంచితే అవి చేపల్ని చుట్టడానికి వీలుగా మెత్త బడతాయి. ఆ తర్వాత ఆ ఆవిరి మీద నుంచి ఆకుల్ని తీసి... ఒక్కో ఆకులో కొత్తిమీర మిశ్రమం పట్టించిన చేపల్ని ఉంచి విడిపోకుండా దారంతో చుట్టేయాలి. ఇలా అన్ని చేపముక్కల్ని చుట్టిన తర్వాత వీటిని ఆ పాత్రలోనే ఆవిరిమీద పదినిమిషాలు ఉడికించుకోవాలి. ఆకుల నుంచి చేపల్ని జాగ్రత్తగా చెదిరిపోకుండా వేరుచేసి వడ్డించుకోవాలి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని