నవాయత్‌ రుచుల నయామేళా!

బెంగళూరులో రద్దీగా ఉండే ఎమ్‌ఎమ్‌రోడ్‌లో ఉంటుంది అలీబాబా కేఫ్‌. పేరుకు తగ్గట్టు అరేబియన్‌ నైట్స్‌ కథల్లో అద్భుతమేదో ప్రాణం పోసుకున్నట్టుగా...

Published : 09 Sep 2018 01:30 IST

క్విజీన్‌ కథలు
నవాయత్‌ రుచుల నయామేళా!

బెంగళూరులో రద్దీగా ఉండే ఎమ్‌ఎమ్‌రోడ్‌లో ఉంటుంది అలీబాబా కేఫ్‌. పేరుకు తగ్గట్టు అరేబియన్‌ నైట్స్‌ కథల్లో అద్భుతమేదో ప్రాణం పోసుకున్నట్టుగా ఉంటుందీ కేఫ్‌. ముఖ్యంగా ఇక్కడ అమ్మే భత్కలీ వంటకాల రుచి దేశంలో మరెక్కడా లభించకపోవడమే ఈ కేఫ్‌ ప్రత్యేకత..

త్కలీ క్విజీన్‌ దీన్నే నవాయత్‌ క్విజీన్‌ అని కూడా అంటారు. ఈ పాకశాల సృష్టించిన అద్భుతాలే షియ్యో బిర్యానీ, భత్కలీ బిర్యానీ, షినోన్యానెవ్రీ, మిరియామహౌర్‌ వంటి అద్భుతమైన వంటకాలు. వేయించిన ఉల్లిపాయలు వేసి చేసే భత్కలీ బిర్యానీ, నూడుల్‌ బిర్యానీగా పేరొందిన షియ్యో బిర్యానీలని ఒక్కసారి రుచిచూస్తే చాలు.. మరిచిపోవడం మహాకష్టం.

ఇరానీ, జైన రుచుల సమ్మేళనంలో...
ఒకప్పుడు అరేబియా తీరంలో భత్కల్‌ ప్రముఖ రేవుపట్టణంగా రాణించింది. ఇరాన్‌, ఇరాక్‌, యెమన్‌పట్టణాల నుంచి వచ్చిన వ్యాపారులు బియ్యం, పంచదార, సుగంధద్రవ్యాలు, గుర్రాలను ఇక్కడకు తీసుకొచ్చి అమ్మేవారు. కాలక్రమేణా ఆ వ్యాపారులు ఇక్కడి జైన్‌ కుటుంబాలతో సంబంధాలు ఏర్పరుచుకుని నవాయత్‌ శాఖగా మారారు. ఇరు సంస్కృతుల సమ్మేళనంలోంచి పుట్టుకొచ్చిన భిన్నమైన రుచులే భత్కలీ లేదా నవాయత్‌ క్యుజీన్‌గా పేరొందాయి. బిర్యానీలతోపాటు ఘాటులేని మిర్చీతో చేసే మిరియామహౌర్‌, దిల్‌ ఆకులతో చేసే షౌఫాపనా మిఠాయి, కొబ్బరిపాలు, బెల్లంతో చేసే గోదన్‌ పాయసం వంటివి ఈ బత్కల్‌ క్విజీన్‌ ప్రత్యేకతలు. వీటిని రుచి చూడాలంటే సరైన స్థలం బెంగళూరులోని అలీబాబా క్విజీన్‌. నవాయత్‌ కమ్యునిటీకే చెందిన దామూదీ ఈ హోటల్‌ని ప్రారంభించారు.

భత్కలీ బిర్యానీ..
కావాల్సినవి: కొత్తిమీర, పుదీనా- అరకట్ట చొప్పున, టమాటాలు- రెండు, పచ్చిమిర్చి- ఎనిమిది, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, పసుపు- పావుచెంచా, ఉప్పు- తగినంత, ఉల్లిపాయ- ఒకటి, నూనె- నాలుగు చెంచాలు, చికెన్‌- అరకేజీ, కారం- చెంచా, బిర్యానీ దినుసులు, బాస్మతి బియ్యం- రెండు కప్పులు, నెయ్యి- చెంచాన్నర, కుంకుమ పువ్వు- చిటికెడు, నూనెలో కరకరలాడేలా వేయించిన ఉల్లిపాయలు- పావుకప్పు

తయారీ: బిర్యానీ హండీలో కొద్దిగా నూనె తీసుకుని అందులో లవంగాలు, దాల్చిని, బిర్యానీఆకు, యాలకులు వేసుకోవాలి. ఒక్క క్షణం ఆగి అందులో ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత టామటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర తరుగు, కారం, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇందులో చికెన్‌ వేసి కాస్త రంగు మారిన తర్వాత తగినన్ని నీళ్లు కూడా వేసి కుక్కర్‌మీద సన్న మంటపై ఉడకనివ్వాలి. మరొక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల నూనె, రెండు యాలకులు, ఒక దాల్చిని, స్టార్‌అనైస్‌ వేసి అన్నాన్ని మూడొంతుల వరకూ ఉడకనివ్వాలి. కొద్దిగా పలుకు ఉండాలిగా దించుకోవాలి. ఈ అన్నాన్ని చికెన్‌పై ఒక లేయర్‌లా వేయ్యాలి. దీనిపై నెయ్యి, కుంకుమపువ్వు, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. మూతపెట్టి అంచులనుంచి ఆవిరి బయటకు పోకుండా చూడాలి. సన్నమంట ఉడికించుకుని వేయించిన ఉల్లిపాయల్ని పైన చల్లుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని