వాహ్‌ అనిపించే తూత్తుకుడి మాకరోనీలు!

బందరు వెళ్తే లడ్డూలూ.. కాకినాడ వెళ్తే కాజాలు కొన్నట్టు.. తమిళనాడులోని తూత్తుకుడి వెళ్తే తెల్లని మాకరోనీస్‌ కొంటారంతా. సాధారణంగా మాకరోనీస్‌ని విదేశాల్లోనే ఎక్కువ తింటారు. కానీ విదేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి మన తూత్తుకుడి

Updated : 14 Aug 2022 05:29 IST

బందరు వెళ్తే లడ్డూలూ.. కాకినాడ వెళ్తే కాజాలు కొన్నట్టు.. తమిళనాడులోని తూత్తుకుడి వెళ్తే తెల్లని మాకరోనీస్‌ కొంటారంతా. సాధారణంగా మాకరోనీస్‌ని విదేశాల్లోనే ఎక్కువ తింటారు. కానీ విదేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి మన తూత్తుకుడి మాకరోనీస్‌. వీటికి ఎందుకంత గిరాకీనో తెలుసుకుందాం...   

సాధారణంగా బాదం, పంచదార, గుడ్డులోని తెల్లసొనతో ఈ మాకరోనీలని తయారు చేస్తారు. ఇటలీ, పారిస్‌లు వీటికి పుట్టినిల్లే అయినా ప్రపంచమంతా వీటిని ఇదే పద్ధతిలో తయారుచేస్తారు. కానీ తూత్తుకుడిలో మాత్రం బాదంపప్పులకి బదులుగా స్థానికంగా దొరికే జీడిపప్పులని వాడి చేస్తారు. వీటి ఆకృతి కూడా కోన్‌ ఐస్‌క్రీం పైనుండే ఐస్‌క్రీం మాదిరిగా భిన్నంగా ఉంటుంది. వంద సంవత్సరాలుగా ఇలా రుచికరమైన జీడిపప్పు మాకరోనీలు చేస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు ఇక్కడి మాకరోనీ వ్యాపారులు. ఇవి మనకు పరిచయం అవ్వడానికి ఒక కారణం ఉంది. మన దేశంలో పోర్చుగీసు ప్రభుత్వం విస్తరిస్తున్న తొలినాళ్లలో అధికారుల కోసమని వీటిని తయారుచేసేవారు. కానీ బాదం గింజలు అందుబాటులో లేని సమయంలో జీడిపప్పుని ప్రత్యామ్నాయంగా వాడేవారు. అలా భారతీయ మాకరోనీల తయారీ మొదలయ్యింది. జీడిపప్పులని మెత్తగా పొడిగా చేసి, కోడిగుడ్డు తెల్లసొనతో పొంగువచ్చేవరకూ కలిపి... అప్పుడు వీటిని తయారుచేస్తారు. రుచిలో అద్భుతంగా ఉండే వీటికి చాలా గిరాకీ ఉండటంతో స్థానికంగానే కాదు విదేశాలకూ పెద్దఎత్తున ఎగుమతవుతున్నాయి.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని