గుండెకు అండగా..

చిన్న వయసు. వ్యాయామం చేస్తున్నా.. వైద్య పరీక్షలు చేయించుకుంటున్నా.. ఉన్నట్టుండి కబళించే హార్ట్‌ ఎటాక్‌ల గురించి వింటూనే విన్నాం.

Published : 11 Jun 2023 00:47 IST

చిన్న వయసు. వ్యాయామం చేస్తున్నా.. వైద్య పరీక్షలు చేయించుకుంటున్నా.. ఉన్నట్టుండి కబళించే హార్ట్‌ ఎటాక్‌ల గురించి వింటూనే విన్నాం. ఆహారంతో దీనికి ఏదైనా సమాధానం దొరుకుతుందా? ఎందుకు లేదు.. కొన్ని ఆహారాలు గుండెకు రక్షగా నిలుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి..

వెల్లుల్లి: రక్తపోటుని నియంత్రించి.. రక్తనాళాల్లో ప్లేక్‌ పేరుకుపోకుండా చూస్తుంది. దాంతో గుండెజబ్బు సమస్యలు రావు. దీనిలోని ప్రత్యేక ఎంజైమ్స్‌ నాళాలు కుచించుకుపోకుండా చేస్తాయి. వాసన పడదు, తినలేం అంటారా? వైద్యుల సలహాతో సప్లిమెంట్‌ల రూపంలో తీసుకోవచ్చు.

కొకొవా: చాక్లెట్‌ ప్రేమికులకు ఇంతకుమించిన తీపి కబురు ఏముంటుంది? చాక్లెట్‌ మన మూడ్‌ని సరిచేయడం మాత్రమే కాదు.. రక్తపోటుని తగ్గిస్తుంది. డార్క్‌ చాక్లెట్‌లోని ఫ్లెవనాల్స్‌ గుండెజబ్బుల నుంచి రక్షణగా నిలుస్తాయి. అలాగని చాక్లెట్‌ అంటే పంచదార ఎక్కువ వేసి చేసే క్యాండీలు కాదు.. కొకొవో అధికంగా ఉండే డార్క్‌ చాక్లెట్‌. రోజూ ఓ చిన్న డార్క్‌ చాక్లెట్‌ని తింటే మంచి ఫలితాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

పప్పు ధాన్యాలు: ఇవి కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె నాళాల్లో ప్లేక్‌ అంటే పాచిలాంటి పదార్థం పేరుకోకుండా అడ్డుకుంటాయి. గుండెజబ్బులు రాకుండా చూస్తాయి.

బాదం: ఈ పప్పులు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. బాదంలో పుష్కలంగా ఉండే ప్లాంట్‌స్టెరాల్స్‌ ఆహారం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ తీసుకోకుండా అడ్డుకుని హార్ట్‌ఎటాక్‌ నుంచి రక్షిస్తాయి.

దానిమ్మ గింజలు: స్మూథీలు, సలాడ్లు..విడిగా ఎలా అయినా సరే గుప్పెడు దానిమ్మ గింజలని ఆహారంలో చేర్చుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే సూపర్‌ఫుడ్‌ ఇది. చెడు కొలెస్ట్రాల్‌ని చేరకుండా చేసి రక్తనాళాలు పూడుకుపోకుండా చేస్తుంది దానిమ్మ. స్ట్రోక్స్‌, అల్జీమర్స్‌, కీళ్లనొప్పులు రాకుండా చేస్తుంది. దంతాలని ఆరోగ్యంగా ఉంచుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని