గరంగరం బన్‌ గయా

స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లలకి క్షణాల్లో ఆకలి తీర్చే మంత్రం ఏదైనా ఉందా? ఆఫీసు నుంచి వచ్చిన మీకు వేడివేడిగా.... చకచకా అయిపోయే వంటకం ఏదైనా ఉంటే బాగుండుననిపిస్తోంది కదూ! ఇవన్నీ కాకపోయినా వేడివేడి చిరుతిళ్లు తినడానికి జడివాన సాకు ఉండనే ఉందిగా! కాస్త కారంగా... కాస్త కొత్తగా తిందాం అనుకునేవారు ఈ బ్రెడ్‌ వంటకాలని ఓ చూపు చూడండి...

Published : 08 Jul 2018 01:51 IST

తడిపొడి చినుకుల్లో
గరంగరం బన్‌ గయా  

స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లలకి క్షణాల్లో ఆకలి తీర్చే మంత్రం ఏదైనా ఉందా?
ఆఫీసు నుంచి వచ్చిన మీకు వేడివేడిగా.... చకచకా అయిపోయే వంటకం ఏదైనా ఉంటే బాగుండుననిపిస్తోంది కదూ! ఇవన్నీ కాకపోయినా వేడివేడి చిరుతిళ్లు తినడానికి జడివాన సాకు ఉండనే ఉందిగా! కాస్త కారంగా... కాస్త కొత్తగా తిందాం అనుకునేవారు ఈ బ్రెడ్‌ వంటకాలని ఓ చూపు చూడండి...

ప్రపంచవ్యాప్తంగా కొన్నివేల రకాల బ్రెడ్‌(రొట్టెలు) తయారవుతుంటాయి. వాటిల్లో ఉపయోగించే పదార్థాల ఆధారంగా వాటి రుచి, ఆకృతి, పేర్లు కూడా మారుతుంటాయి. నెదర్లాండ్‌లో రొట్టెను ‘టైగర్‌' అంటారు. రొట్టెను బేక్‌ చేసిన తర్వాత దానిపై ఏర్పడే ప్రత్యేకమైన మచ్చల కారణంగానే దాన్ని టైగర్‌ అంటారు. ఈ మచ్చలు రావడానికి వరిపిండిని పైన ప్రత్యేకంగా అద్దుతారు. జమైకాలో రొట్టెను ‘బమ్మీ’ అంటారు. కర్రపెండలం, కొబ్బరినూనె వాడి ఈ రొట్టెలు తయారుచేస్తారు.

జపనీయుల అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో ముందు ఉండే వంటకం కరేపాన్‌ లేదా కర్రీబ్రెడ్‌. మటన్‌, అన్నిరకాల కాయగూరలు వేసి చేసే వంటకాన్ని చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు.

బ్రెడ్‌ బుర్జీ  

కావాల్సినవి: బ్రెడ్‌ స్లైసులు - పది, గుడ్లు- మూడు, ఉల్లిపాయ- ఒకటి, టమాటా- ఒకటి, పచ్చిమిర్చి- ఐదు, కారం- చెంచా, కొత్తిమీర- కట్ట, ఉప్పు, నూనె- తగినంత

తయారీ: బ్రెడ్‌ అంచులని తీసేసి వాటిని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇష్ట ముంటే క్యాప్సికమ్‌, క్యారెట్‌ వంటి కాయగూరలని కూడా చేర్చుకుని వేయించుకోవచ్చు. ఉప్పు, కారం వేసి బాగా కలిపి బ్రెడ్‌ ముక్కలు కూడా వేసుకుని ఉప్పు, కారం కలిసేటట్టు వేయించుకోవాలి. వీటిని కడాయిలో ఓ పక్కకు ఉంచి గుడ్లను కొట్టి వేసుకుని ఒక మూడు నిమిషాలు ఆగి తర్వాత బ్రెడ్‌తో కలిపి వేయించుకుంటే బ్రెడ్‌ బుర్జీ సిద్ధం.

కరకర.. చికెన్‌  

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌- పావుకిలో, బ్రెడ్‌క్రంబ్స్‌- కప్పు, మిరియాలపొడి- చెంచా, గుడ్లు- రెండు, వెన్న- రెండు చెంచాలు, ఉప్పు, నూనె- వేయించడానికి తగినంత, వెల్లుల్లిపొడి- చెంచా

తయారీ: బ్రెడ్‌క్రంబ్స్‌ మార్కెట్‌లో దొరుకుతాయి. లేదంటే మనం ఇంట్లోనే ఎండబెట్టిన బ్రెడ్స్‌ని మిక్సీలో వేసి పొడి చేసుకోవచ్చు. బ్రెడ్‌ క్రంబ్స్‌లో ఉప్పు, మిరియాలపొడి, వెల్లుల్లిపొడి వేసి కలుపుకోవాలి. ఒక పాత్రలో గుడ్లు కొట్టి , వెన్న కలిపి ఫోర్క్‌తో బాగా గిలక్కొట్టాలి. చికెన్‌ని కుక్కర్‌లో ఉడికించుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసుకోవాలి. చికెన్‌ ముక్కలని ముందుగా గుడ్డు సొనలో ముంచి, తర్వాత బ్రెడ్‌పొడిలో దొర్లించుకుని నూనెలో వేయించుకోవాలి. గ్రిల్‌పై కాల్చుకున్నా బాగానే  ఉంటాయి.

బ్రెడ్‌ పాకెట్స్‌

కావాల్సినవి: ఇన్‌స్టెంట్‌ నూడుల్‌ ప్యాకెట్‌- ఒకటి, బ్రెడ్‌ స్లైసులు- ఆరు, చీజ్‌- కప్పు, నూనె- వేయించడానికి సరిపడా, క్యారెట్‌ తురుము- చెంచా, బఠాణీలు- చెంచా

తయారీ: ముందుగా బఠాణీలు, క్యారెట్‌ ముక్కలు వేసుకుని ఇన్‌స్టెంట్‌ నూడుల్స్‌ని మసాలాతో ఉడికించుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ అంచులని తీసేసి అప్పడాల కర్రతో ఆ బ్రెడ్స్‌ని ఒత్తుకుంటే పల్చగా వంటకానికి వీలుగా ఉంటాయి. ఒత్తుకున్న బ్రెడ్స్‌పైన చల్లార్చుకున్న నూడుల్స్‌ని ఉంచి పైన కొద్దిగా చీజ్‌ తురుముని ఉంచాలి. అంచులను అతికించడానికి మైదాపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ పేస్ట్‌తో అన్నివైపులా అతికించుకోవాలి. వీటిని నూనెలో వేయించుకుంటే చీజ్‌ బ్రెడ్‌ పాకెట్స్‌ రెడీ.

దహీచాట్‌

కావాల్సినవి: బ్రెడ్‌ స్లైసులు- నాలుగు, సెనగపిండి- ఆరుచెంచాలు, నూనె- వేయించడానికి సరిపడా, పెరుగు- ఆరుచెంచాలు, చింతపండు గుజ్జు- పావుకప్పు, సన్నకారప్పూస- రెండు చెంచాలు, జీలకర్రపొడి- అరచెంచా, ఉప్పు, పంచదార- తగినంత, కారం- పావు చెంచాకంటే తక్కువ, నల్ల ఉప్పు- కొద్దిగా, కొత్తమీర- కట్ట

తయారీ:  కడాయిలో చింతపండుగుజ్జు వేసుకుని అందులో తగినంత పంచదార, ఉప్పు వేసుకుని చిక్కగా అయ్యేంతవరకూ ఉడికించుకోవాలి. దించేసే ముందు జీలకర్ర పొడి వేసుకోవాలి. బ్రెడ్‌ అంచులని తీసేసి మధ్యలోకి త్రికోణాకృతిలోకి వచ్చేట్టుగా చాక్‌తో కత్తిరించి పెట్టుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి తగినంత ఉప్పు వేసుకుని పకోడీపిండిలా జారుగా కలుపుకోవాలి. అందులో బ్రెడ్‌ ముక్కల్ని ముంచి నూనెలో వేయించుకోవాలి. ఒక పాత్రలో పెరుగు పోసుకుని అందులో ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. వెడల్పాటి పళ్లెంలో బ్రెడ్‌ పకోడీలను ఉంచి ఫోర్క్‌తో రెండు సార్లు గుచ్చాలి. దీనిపై పెరుగు పోసి ఆపై చింతపండు గుజ్జుని వేయాలి. దీనిపై కొత్తిమీర తరుగు, సన్నకారప్పూస చల్లుకుంటే బ్రెడ్‌దహీచాట్‌ సిద్ధం.

బ్రెడ్‌ పిజా

కావాల్సినవి: హోల్‌వీట్‌ బ్రెడ్‌- మూడు, చిన్న టమాటాలు- రెండు, ఉల్లిపాయ ముక్కలు- మూడు చెంచాలు, క్యాప్సికమ్‌ తరుగు- రెండు చెంచా(రెండు రంగుల్లో అయితే చూడ్డానికి బాగుంటుంది), స్వీట్‌కార్న్‌ గింజలు- నాలుగు చెంచాలు, మొజరెల్లా చీజ్‌- ఒకటిన్నర చెంచా, టమాట సాస్‌, పాస్తా సాస్‌- మూడు చెంచాలు, చాట్‌ మసాలా- పావుచెంచా, బటర్‌- పావుచెంచా, ఉప్పు- తగినంత

తయారీ: బ్రెడ్‌కి కొద్దిగా బటర్‌ రాసి పెనంపైన రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ఒకవైపు టమాటా కెచప్‌ రాసి దానిపై పాస్తా సాస్‌ కలిపిన కాయగూరముక్కలని పరుచుకోవాలి.  వీటిపై చీజ్‌ తురుము, ఉప్పు, చాట్‌మసాలా చల్లి అవెన్‌లో ఉంచాలి. చీజ్‌ కరిగిన తర్వాత పైన మిరియాలపొడి చల్లుకుంటే బ్రెడ్‌ పిజా రెడీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని