క్రిస్మస్‌కి... కోఫ్తా బిర్యానీ

ఓ గిన్నెలో మైదా, వంటసోడా, చక్కెర, గుడ్ల పచ్చసొన తీసుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చిక్కని దోశపిండిలా కలిపి... అరగంట నాననివ్వాలి. ఖర్జూరాల ముద్దను చిన్నచిన్న పట్టీల్లా ..

Published : 26 Jun 2021 15:31 IST

ఖర్జూరాల పాన్‌కేక్‌

కావలసినవి
మైదా: పావుకప్పు, వంటసోడా: మూడు చెంచాలు, నీళ్లు: కప్పు, గుడ్లు: నాలుగు (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి), చక్కెర: పెద్ద చెంచా, ఖర్జూరాలు: అరకప్పు (గింజలు తీసేసి, అరచెంచా నువ్వుల నూనె కలిపి... మెత్తగా చేసుకోవాలి), లేత చక్కెర పాకం: పెద్ద చెంచా.

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో మైదా, వంటసోడా, చక్కెర, గుడ్ల పచ్చసొన తీసుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చిక్కని దోశపిండిలా కలిపి... అరగంట నాననివ్వాలి. ఖర్జూరాల ముద్దను చిన్నచిన్న పట్టీల్లా చేసుకుని పెట్టుకోవాలి. పొయ్యిమీద పెనం పెట్టి... నానబెట్టుకున్న మైదా మిశ్రమాన్ని రెండు చిన్న పాన్‌కేకుల్లా వేసుకోవాలి. ఒకటి ఒకవైపు కాలాక... దానిపైన ఖర్జూరాల పట్టీ పెట్టి.. రెండో పాన్‌కేక్‌ని దానిపైన ఉంచి.. రెండింటినీ ఎర్రగా అయ్యేవరకూ కాల్చుకుని తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి. వీటిపైన కొద్దికొద్దిగా చక్కెరపాకం వేసుకుంటే చాలు.


బనానా కేక్‌

కావలసినవి
వెన్న: ముప్పావుకప్పు, నూనె: ముప్పావుకప్పు, బ్రౌన్‌ షుగర్‌: కప్పు, చక్కెర: అరకప్పు, బాగా పండిన అరటిపండ్లు: నాలుగు (వీటిని మెత్తని గుజ్జులా చేసుకోవాలి), గుడ్లు: రెండు (గిలకొట్టి పెట్టుకోవాలి), మజ్జిగ: పావుకప్పు, వెనిల్లా ఎసెన్స్‌: టేబుల్‌స్పూను, మైదా: రెండున్నర కప్పులు, వంటసోడా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు: చెంచా చొప్పున.

తయారుచేసే విధానం
* ఓవెన్‌ని ముందుగా 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి పెట్టుకోవాలి. వెన్న, బ్రౌన్‌షుగర్‌, చక్కెర ఓ గిన్నెలో తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఇందులో నూనె, అరటిపండు గుజ్జు, గుడ్ల సొనా, మజ్జిగా, వెనిల్లా ఎసెన్స్‌ వేసి కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో మైదా, వంటసోడా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు కలిపి.. అరటిపండు గుజ్జులో వేసి అన్నీంటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌పాన్‌లో తీసుకుని 45 నుంచి 55 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి.


సూజీ హనీ బర్ఫీ

కావలసినవి
బొంబాయిరవ్వ: ఒకటిన్నర కప్పు, వెన్న: అరకప్పు, చక్కెర: అరకప్పు, పెరుగు: కప్పు, వంటసోడా: చెంచా, వెనిల్లా ఎసెన్స్‌: చెంచా, బాదం: అలంకరణకోసం. సిరప్‌కోసం: తేనె: అరకప్పు, చక్కెర: ముప్పావుకప్పు, గులాబీనీరు: మూడు టేబుల్‌స్పూన్లు (లేదా గులాబీ ఎసెన్స్‌: చెంచా) నిమ్మరసం: రెండు చెంచాలు.

తయారుచేసే విధానం
* వెన్నను ఓ కప్పులోకి తీసుకుని గిలకొట్టి, అందులో చక్కెర కలపాలి. ఇది క్రీమ్‌లా తయారయ్యాక పెరుగు, వెనిల్లా ఎసెన్స్‌ వేసి... మరోసారి కలపాలి. ఇందులో బొంబాయిరవ్వ, వంటసోడా కూడా వేసి కలిపి... అరగంటసేపు నాననివ్వాలి. ఓవెన్‌ని 375 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. పిండిని వెడల్పాటి బేకింగ్‌ పాత్రలోకి తీసుకుని పరిచినట్లు చేసి ఓవెన్‌లో ఉంచాలి. ఇరవైనిమిషాల తరువాత ముక్కల్లా కోసి ఒక్కోదానిపైన ఒక్కో బాదం గింజను ఉంచి.. మరో పావుగంటసేపు బేక్‌ చేయాలి. ఈలోపు తేనె, చక్కెర, గులాబీనీటిని ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి లేత పాకంలా తయారవుతున్నప్పుడు దింపేసి నిమ్మరసం కలపాలి. బర్ఫీ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే ఈ పాకం వాటిపైన పోయాలి.


కోఫ్తా బిర్యానీ

కావలసినవి
కోఫ్తాలకోసం: చికెన్‌ లేదా మటన్‌: కేజీ (మెత్తగా చేసుకోవాలి), వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం ముద్ద: ఒక టేబుల్‌స్పూను, గరంమసాలా: రెండు టేబుల్‌స్పూన్లు, టొమాటో కెచెప్‌: మూడు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు: అరకప్పు, ఉప్పు: తగినంత. గ్రేవీకోసం: టొమాటోలు: నాలుగు, ధనియాలపొడి: రెండు చెంచాలు, జీలకర్రపొడి, కారం, గరంమసాలా: చెంచా చొప్పున, పసుపు: అరచెంచా, నూనె: అరకప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, బాస్మతీ బియ్యం: రెండుకప్పులు.

తయారుచేసే విధానం
* బియ్యాన్ని కడిగి గోరువెచ్చని నీటిలో అరగంటసేపు నానబెట్టుకుని పొడిపొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. ఇప్పుడు కోఫ్తాల కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరువాత చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి ముప్పావువంతు నూనె వేడిచేసి, అల్లంవెల్లుల్లి ముద్ద వేయాలి. తరువాత ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరంమసాలా, పసుపు వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాలయ్యాక టొమాటో ముక్కలూ వేసి మంట తగ్గించి మూత పెట్టాలి. టొమాటో ముక్కలు కాస్త వేగాయనుకున్నాక...కప్పు గోరువెచ్చని నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి... ముందుగా చేసి పెట్టుకున్న కోఫ్తా ఉండల్ని వేయాలి. కావాలనుకుంటే మరికాసిని నీళ్లు పోయాలి. గ్రేవీ చిక్కగా అయి... కోఫ్తా ఉండలు ఉడికాయానుకున్నాక దింపేయాలి. వెడల్పాటి గిన్నె తీసుకుని అడుగున నూనె రాయాలి. ముందుగా అన్నం పరిచి... దానిపైన కోఫ్తాలతోపాటు మసాలా వేసి... మళ్లీ పైన అన్నం వేయాలి. ఇలా ఒకదానిమీద మరొకటి వేసుకున్నాక మూత పెట్టాలి. పొయ్యిమీద పెనం పెట్టి... ఈ గిన్నె ఉంచి పావుగంటయ్యాక తీసేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని