సు..దర్శన క్రియ ఆత్మశుద్ధి ప్రక్రియ

మనకు ఎన్ని ఉన్నా ఇంకేదో లేదనే అసంతృప్తి బాధిస్తుంటుంది. ఎవరి మీదో ఎందుకో కోపమొస్తుంది. ఏదో చింత, మరేదో వేదన, ఇంకేదో అశాంతి.

Updated : 06 Jul 2023 03:51 IST

మనకు ఎన్ని ఉన్నా ఇంకేదో లేదనే అసంతృప్తి బాధిస్తుంటుంది. ఎవరి మీదో ఎందుకో కోపమొస్తుంది. ఏదో చింత, మరేదో వేదన, ఇంకేదో అశాంతి. ఇలాంటి అస్థిమితాలూ ఆందోళనల నుంచి బయటపడేందుకు ఉపకరించే సాధన సుదర్శనక్రియ. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు గురూజీ రవిశంకర్‌ రూపొందించిన సరళమైన, శక్తివంతమైన శ్వాసప్రక్రియ ఇది.

భూమ్మీద పడగానే శిశువు చేసే తొలి జీవక్రియ శ్వాస. ఆద్యంతాల జీవనాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలే. ఆ శ్వాసే ప్రాణ శక్తికి కీలక ఇంధనమై శరీరాన్ని, మనసును, బుద్ధిని నడిపిస్తుంది. అనంత జీవన రహస్యమంతా అందులోనే దాగుంది. అలాంటి ప్రాణశక్తిని అనుక్షణం, కణకణంలో ఉత్తేజితం చేసే యోగప్రక్రియ సుదర్శనక్రియ!

ప్రత్యేకంగా శ్వాస తీసుకోవాలా?

శ్వాసకు మన ప్రమేయం ఉండదు కదా, దీన్ని ధ్యాసపెట్టి ప్రత్యేకంగా చేయాల్సిన పనేంటి అనిపించడం సహజం. నిజమే కానీ ఏ ప్రమేయం, ప్రయత్నం లేకుండా ఊపిరి పీల్చి వదిలే క్రమంలో సాధారణంగా ఊపిరితిత్తుల సామర్థ్యంలో 30శాతమే మనం వినియోగించుకుంటున్నాం. సెల్‌ఫోన్‌ను ఇలా కాస్త ఛార్జింగ్‌తో వాడుకోం కదా! ఎప్పటికప్పుడు రీఛార్జి చేస్తాం. దానికి మరకలు పడకుండా, పాడవకుండా కవర్లు, హంగులు అద్దుతాం. ఒకటి పోతే ఇంకోటి లభ్యమయ్యే ఓ చిన్న యంత్రం విషయంలోనే ఇంత జాగ్రత్త తీసుకునే మనం, మరో ప్రత్యామ్నాయమే లేని శరీరం, దానికి ప్రాణవాయువును అందించే శ్వాస గురించి ఎంత శ్రద్ధ, అవగాహన ఉండాలి? మనని నడిపించే మనసును ఎంత అపురూపంగా చూసు కోవాలి? అందుకు అనునిత్యం ఉపయోగపడే ఆధ్యాత్మిక సాధనమే సుదర్శన క్రియ.

ఆహారం, నిద్ర, శ్వాస, ధ్యానం.. ఇలా నాలుగు రకాలుగా ప్రాణశక్తి అందుతుంది. వీటిని సరైన పద్ధతుల్లో వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిలో ఆహారం గురించి ఏది తినాలో, ఎంత తినాలో బోలెడంత సమాచారం అందుబాటులో ఉంది. మరి జీవక్రియలో కీలకమైన శ్వాస మాటేమిటి? ఆహారం లేకుండా కొన్ని గంటలు ఉండగలం, కానీ శ్వాస తీసుకోకుండా ఉండలేం. రోజుకు పదివేల లీటర్ల ప్రాణ వాయువును లోపలికి పీల్చి వదులుతున్నాం. ఇంతకీ శ్వాసను ఎంత తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? తీసుకోవాల్సినంత పరిమాణంలో, రీతిలోనే తీసుకుంటున్నామా- అనేవి మనం వేసుకోవలసిన ప్రశ్నలు.

శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాణశక్తే ఆధారం. ఇది విస్తారంగా అందుబాటులో ఉంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. మనసు ఉత్తేజంగా ఉంటే ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. నకారాత్మక (నెగెటివ్‌) ఆలోచనల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు ఎదుటివారు తప్పుచేసినా పోనీలే, మళ్లీ చేయొద్దంటూ మందలించి వదిలేస్తారు. ఆ ఆనందం కరువై విసుగ్గా ఉంటే చిన్న తప్పును కూడా భూతద్దంలో చూసి అరిచి గోలచేస్తారు. ప్రాణశక్తిలో లోపం కారణంగానే మనలో వ్యతిరేక ఆలోచనలు పెరుగుతాయి. ఊపిరితిత్తులను పూర్తి స్థాయిలో ఉపయోగించకపోవటమే దానికి మూలకారణం.

అది అవినాభావ బంధం

  శ్వాసకు, ప్రకృతికి లయాత్మక బంధముంది. అది దెబ్బ తిన్నప్పుడు ఉద్వేగాలు మారుతుంటాయి. శ్వాస అన్నిసార్లూ ఒకేలా ఉండదు. కోపంలో ఒకలా, ఆనందంలో ఇంకోలా, ఆందోళనలో ఒకలా, సంబరంలో మరోలా ఉంటుంది. భావోద్వేగాలు మారేకొద్దీ ఉచ్ఛ్వాసనిశ్వాసలూ మారతాయి. ఇవి పరస్పర ఆధారితాలు. అంటే శ్వాస నియంత్రణతో ఉద్వేగాలనూ నియంత్రించవచ్చు. ఆధునిక జీవనశైలికి సైడ్‌ ఎఫెక్ట్‌గా చెబుతున్న ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి, బాధ, కోపం లాంటి వన్నీ నియంత్రించవచ్చు. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

శాంతి, సంతోషాల కోసం

మొక్కల్లో ఆకురాలడం, చిగురించి ఫలించడం, జీవుల్లో ఆకలి, నిద్ర ఇలా సృష్టిలో లయ ఉన్నట్టే శ్వాసలోనూ ఉంది. కానీ భావోద్వేగాలు, అహంవల్ల లయ మారి ప్రాణశక్తి తగ్గుతోంది. మెట్లెక్కినప్పుడో పరిగెత్తినప్పుడో తప్ప ఊపిరి తిత్తులను పూర్తిగా వినియోగించడం లేదు. శ్వాస లయాత్మకంగా ఉంటే ప్రాణశక్తి మెరుగై ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. మెదడు సేద తీరుతుంది. ప్రకృతితో లయబద్ధమవుతాం. సుదర్శనక్రియలో ‘సు’ అంటే సరైంది, శుభప్రదమైంది. ‘దర్శన’ అంటే దృష్టి. అంటే చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంతో పాటు తనలోకి తాను చూసుకుని, ఆత్మావలోకనం చేసుకోవటానికి వీలు కల్పించే ప్రక్రియ. ముందు మనతో మనం కనెక్ట్‌ అయితే ప్రపంచం తోనూ కనెక్ట్‌ అవుతాం. అందుకు మనం అనుసరించాల్సిన సులభ మార్గం సుదర్శనక్రియ.

శాంతి, సంతోషం ఎక్కడినుంచో వచ్చేవి కావు. అవి మన మనసు ఇచ్చే కానుకలే. శరీరం, మనసుల మధ్య సమతుల్యత ఉన్నప్పుడు అవి అందుతాయి. అందుకు దోహదం చేస్తుంది సుదర్శనక్రియ. ఈ పద్ధతిలో కాసేపు ధ్యానం చేస్తే చాలు వ్యవస్థ అంతా పునరుజ్జీవం పొందుతుంది. మూడు స్థాయిల్లో సాగే లయబద్ధమైన శ్వాసక్రియతో శరీరంలో సమతుల్యత, స్పష్టత, ప్రశాంతత ఏర్పడతాయి. వాటిని మనం గుర్తించగలుగుతాం. సుదర్శనక్రియను గురుముఖతః నేర్చుకుని చేయటం ఉత్తమం.

ఇవీ ప్రయోజనాలు

  •  ఆధునిక జీవనశైలిలో అనివార్యమైన ఒత్తిడి, ఆందోళన, భయాల కారణంగా మనలో చేరే మలినాలను (టాక్సిన్స్‌) సుదర్శనక్రియతో నిర్మూలించవచ్చని యోగ గురువులే కాదు వైద్యనిపుణులూ చెబుతున్నారు.
  • శారీరక, మానసిక సమతుల్యత వచ్చి ఆరోగ్యం మెరుగవుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
  • శరీరంలోని మలినాలు తొలగుతాయి. శ్వాస సంబంధ ఇబ్బందులుండవు. కుంగుబాటు, నిద్రలేమి ఉండవు.
  •  మానవ సంబంధాలు మెరుగుపడతాయి.

ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో కోట్లాదిమంది అనుసరిస్తున్న ఈ సుదర్శనక్రియను మీకు దగ్గరలో ఉన్న సెంటర్లో సుశిక్షితులైన శిక్షకుల ద్వారా నేర్చుకోవచ్చు.
వివరాలకు...

www.artofliving.org

డి.వి.రామకృష్ణ శాస్త్రి


ఆందోళన లేని మనసు, అనారోగ్యం లేని శరీరం, వణుకు లేని శ్వాస, ఒత్తిడి లేని మనసు, ఆటంకాలు లేని బుద్ధి, వ్యామోహం లేని జ్ఞాపకాలు, సంకుచితం కాని అహంకారం, బాధలు లేని ఆత్మ.. ఇవి ప్రతి ఒక్కరి జన్మహక్కులు.

గురూజీ రవిశంకర్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థాపకులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని