పూలూపండ్లుగా మారిన మాంసం

రాఘవేంద్రస్వామివారి ఆరాధనోత్సవాలు శ్రావణ బహుళ పాడ్యమికి మొదలై మూడు రోజులు కొనసాగుతాయి. పూర్వ, మధ్యమ, ఉత్తర ఆరాధనల్లో భక్తులు విశేషంగా పాలుపంచుకుంటారు.

Updated : 31 Aug 2023 01:01 IST

రాఘవేంద్రస్వామివారి ఆరాధనోత్సవాలు శ్రావణ బహుళ పాడ్యమికి మొదలై మూడు రోజులు కొనసాగుతాయి. పూర్వ, మధ్యమ, ఉత్తర ఆరాధనల్లో భక్తులు విశేషంగా పాలుపంచుకుంటారు. మంత్రాలయంలో పెద్ద ఎత్తున ఆరాధనలు నిర్వహిస్తారు. భువనగిరిలో 1595లో వీణా తిమ్మణ్ణభట్టు, గోపమ్మ దంపతులకు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో జన్మించిన స్వామికి వెంకటనాథ అని నామకరణం చేశారు. కుంభకోణంలో సుచీంద్ర తీర్థుల వద్ద విద్యాభ్యాసం చేశారు. శ్రీమఠంలో దైవాజ్ఞగా భావించి సన్యాసం స్వీకరించారు. అనేక మహిమలతో భక్తుల పాలిట కామధేనువు, కల్ప వృక్షంగా దేశ సంచారం సాగించారు. ఆదోని నవాబు సిద్ది మసూద్‌ఖాన్‌ రాఘవేంద్రస్వామిని పరీక్షించడానికి పళ్లెంలో మాంసం పెట్టి స్వీకరించమన్నాడు. అది చూసి ఆయన నివ్వెరపోలేదు. ప్రోక్షణ చేసి పళ్లెంలోని మాంసాన్ని పూలూ పండ్లుగా మార్చేశారు. ఆ అద్భుతానికి ముగ్ధుడైన నవాబు రాఘవేంద్రస్వామి కోరిక ప్రకారం మంత్రాలయంలో స్థావరం ఏర్పరచుకోవడానికి అనుమతించారు. స్వామివారు శంఖుతీర్థులు, ప్రహ్లాదుల అవతారమని ప్రతీతి. మంత్రాలయం భూ వివాదంలో వారికి దర్శనం ఇచ్చి, పత్రాల ద్వారా పరిష్కారమార్గం చూపినట్లు మద్రాసు గెజిట్‌లో వార్త నమోదయ్యింది.

శ్రీరాఘవేంద్రులు 1671లో ఓ బృందావనం నిర్మించుకుని సజీవ సమాధి అయ్యారు. ఆ సమయంలో దూరదేశం వెళ్లొచ్చిన ప్రియ శిష్యుడు ఆ విషాదాన్ని తట్టుకోలేకపోయాడు. అతడి భక్తికి మెచ్చి సమాధిలోంచి చేయి చాపి దుఃఖాన్ని ఉపశమింపచేశారు స్వామి.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని