గుండెల్లో గుడి కడితే..

కనిపించని దేవుడి కంటే ప్రత్యక్షంగా కనిపించే గురువును దైవంగా ఆరాధిస్తాం. మామూలుగా ఉన్న మనల్ని మహోన్నతంగా తీర్చిదిద్దేది ఆయనే మరి.

Updated : 31 Aug 2023 01:05 IST

సెప్టెంబరు 5 గురుపూజోత్సవం

కనిపించని దేవుడి కంటే ప్రత్యక్షంగా కనిపించే గురువును దైవంగా ఆరాధిస్తాం. మామూలుగా ఉన్న మనల్ని మహోన్నతంగా తీర్చిదిద్దేది ఆయనే మరి. గురువు అనగానే బ్రైత్‌ వైట్‌ రాసిన ‘టు సర్‌ విత్‌ లవ్‌’లో ఓ సన్నివేశం గుర్తొస్తుంది.. ఒక మాస్టారు పాఠం చెప్పడం ముగించారు. పిల్లలకు కాస్త విరామం, వినోదం ఇవ్వాలని- తోచిన బొమ్మ గీయమన్నారు. ఎవరికి వారే.. ఆనందోత్సాహంతో కొమ్మారెమ్మా, కొండాగుట్టా, వాగూవంకా, సూర్యుడు, చంద్రుడు- ఇలా తలో విధంగా బొమ్మలేస్తున్నారు. వారిలో ఒకరేసిన హస్తం బొమ్మ ఆయన్ని ఎంతగానో ఆకర్షించింది. దాన్ని పిల్లలందరికీ చూపి- అదేంటో వివరించమన్నారు. ఆ చెయ్యి తమను సృష్టించిన దేవుడిదని, ధాన్యం పండించే రైతుదని, అన్నంపెట్టే మాతృమూర్తిదని, కాపాడే తండ్రిదని- రకరకాలుగా చెప్పారు.

బొమ్మ వేసిన పిల్లవాడు- అవేమీ కాదంటూ లేచాడు. కొంచెం సిగ్గు, కాస్త తత్తరపాటుతో గురువుకు నమస్కరించి ‘ఆ చెయ్యి మీదే మాష్టారూ!’ అన్నాడు. ఆ బాలుణ్ణి ఆయనంతగా ప్రభావితం చేశారన్నమాట. అందుకే చంద్రగుప్తుడి వెనుక చాణక్యుడు, వివేకానందుడి వెనుక రామకృష్ణపరమహంసల్లా ఉపాధ్యాయుల ప్రభావం తరగనిది, చెరగనిది, తిరుగులేనిది. పిల్లలు తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకు గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు. కానీ అలా చేయాలంటే.. ఆ గురువులు కూడా విద్యతో బాటు విజ్ఞత, వినమ్రత, విధినిర్వహణలో అకుంఠిత దీక్ష సంతరించు కుని ఉండాలి. మానవత్వాన్ని, ధార్మికతను పెంచని పక్షంలో విద్యకు విలువే లేదు. అలాంటి ఆదర్శనీయుడు కనుకనే సర్వేపల్లి రాధాకృష్ణను మనమంతా ఆరాధిస్తున్నాం.  

పరిమి శ్యామలా రాధాకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని