ప్రశాంతతకు మార్గం

సాధకుల భావనలను బట్టి భక్తి పలువిధాలు. భేద దృష్టి, క్రోధం, హింస, దంభం, అసూయలుంటే అది తామస భక్తి. విషయ వాంఛలు, కీర్తి, ఐశ్వర్యాలపై అభిలాషతో సేవిస్తే రాజస భక్తి.

Updated : 05 Oct 2023 01:40 IST

సాధకుల భావనలను బట్టి భక్తి పలువిధాలు. భేద దృష్టి, క్రోధం, హింస, దంభం, అసూయలుంటే అది తామస భక్తి. విషయ వాంఛలు, కీర్తి, ఐశ్వర్యాలపై అభిలాషతో సేవిస్తే రాజస భక్తి. పాపక్షయం కోసం కర్మఫలాలను భగవంతుడికి అర్పించటమే కర్తవ్యమని భావిస్తూ, ప్రతిఫలాపేక్ష లేక సేవిస్తే సాత్త్విక భక్తి. పరవశంతో ప్రపంచాన్ని మర్చిపోయి పరమాత్మ యందు మనసు లయమైతే.. అది నిర్గుణ భక్తి. అలాంటి భక్తి యోగాన్ని సాధించిన వారు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య మోక్షాలను కోరరు. దేవుడి సేవలో నిమగ్నమై, ఏమివ్వబోయినా తిరస్కరిస్తే.. ఆత్యంతిక భక్తి. ఇదే పరమోత్తమ పురుషార్థం. ఈ యోగంతో జీవులు త్రిగుణాతీతులై భగవత్స్వరూపంగా భాసిస్తారు. ఇదే సర్వశ్రేష్ఠ భక్తియోగం. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేక.. నిష్కామభావంతో స్వధర్మాలను ఆచరించేవారు శ్రేష్ఠులు. విద్యుక్తకర్మఫలాలు భగవదర్పణం చేసేవారు వారి కంటే గొప్పవారు. దేహాభిమానం త్యజించి, ఉపాసించేవారు అంత కంటే ఉత్తములు. ఇలా భక్తుల్లో భేదాలు ఉన్నప్పటికీ.. సర్వం భగవంతుడికి సమర్పించి, తాము దేనికీ కర్తలు కాదని భావిస్తూ, సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసేవారు ఉత్తమ ఉపాసకులన్నది సారం. ఉపనిషత్తుల మార్గంలో నడుస్తూ, ఈశ్వర అంశే ప్రాణుల్లో ఉందని గ్రహించి.. సకల ప్రాణులనూ ఆదరిస్తే.. అంతటా శాంతి విలసిల్లుతుంది.

టి.వి.యెల్‌.గాయత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని