అసలైన గురుదక్షిణ

ఒక శిష్యుడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత.. ‘గురుదేవా! నేను తమరికేదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైంది ఏమిటో చెప్పండి’ అన్నాడు. తనకేమీ వద్దన్నాడు గురువు.

Published : 07 Dec 2023 00:04 IST

క శిష్యుడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత.. ‘గురుదేవా! నేను తమరికేదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైంది ఏమిటో చెప్పండి’ అన్నాడు. తనకేమీ వద్దన్నాడు గురువు. ‘దయచేసి అలా అనకండి. తప్పనిసరిగా తీసుకోవాల్సిందే’ అన్నాడు శిష్యుడు. ‘అయితే ఈ సృష్టిలో నిరుపయోగం అనుకున్న వస్తువును ఇవ్వు’ అన్నారాయన. శిష్యుడు వెంటనే కొంత మట్టి తీసుకొచ్చి గురువుకు ఇవ్వాలనుకున్నాడు. తీరా మట్టిని తవ్వుతుంటే.. ‘నేను పనికిరాని దాన్ని ఎలా అవుతాను? పంటలు పండించి జీవరాశులన్నిటికీ ఆకలి తీర్చేది నేను కాదా?!’ అంది మట్టి. బిత్తరపోయాడతను. ఈసారి ఒక రాతిని తీసుకుని గురువు వద్దకు వెళ్తుంటే.. ‘నేనెలా పనికిరానిదాన్నవుతాను? గుడిలో దేవుడి విగ్రహానికి, ఇళ్లు, నిర్మాణాలు.. దేనికైనా నన్నే కదా ఉపయోగిస్తారు’ అంది రాయి ఉక్రోషంగా.

శిష్యుడు ఎంత ఆలోచించి, ఏది ఇద్దామనుకున్నా.. ప్రతిదీ తనవల్ల ఎంత ప్రయోజనమో తెలియజేసింది. ఇక అతడికి దిక్కు తోచలేదు. చివరికి దేహం మీద అభిమానమే సృష్టిలో పనికిమాలినదని స్ఫురించింది. దాంతో ఈ శరీరానికి సంబంధించిన భయాలూ, భ్రాంతులూ లేకుండా ఉదాత్త జీవనమే గురువు తన నుంచి ఆశిస్తున్నారని అర్థమైంది. వెంటనే ఆయన వద్దకు వెళ్లి.. తాను అలాగే జీవిస్తానని మాటిచ్చాడు. సంతోషించిన గురువు ‘చదువుల సారం ఇదే. నీకు విద్యాబుద్ధులు నేర్పడం వల్ల నేను, వాటిని అర్థం చేసుకోవడం వల్ల నువ్వు.. ఇద్దరమూ కృతార్థులం అయ్యాం’ అంటూ ఆత్మీయంగా ఆశీర్వదించారు.

బాలకుమారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని