త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు గుడి లేదు.. పూజ లేదు.. కారణం

బ్రహ్మదేవుడికి ఒకటి రెండు ఆలయాలు ఉన్నప్పటికీ పూజలు మాత్రం ఎక్కడా లేవు. బ్రహ్మ వైవర్త పురాణంలో దీనికి గల కారణాన్ని వివరించారు...

Updated : 12 Mar 2023 13:46 IST

బ్రహ్మదేవుడికి ఒకటి రెండు ఆలయాలు ఉన్నప్పటికీ పూజలు మాత్రం ఎక్కడా లేవు. బ్రహ్మ వైవర్త పురాణంలో దీనికి గల కారణాన్ని వివరించారు. సృష్టిలో మొదట బ్రహ్మ మానస పుత్రులుగా సనకసనందాదులు పుట్టారు. సృష్టికార్యంలో తోడ్పడమని బ్రహ్మ అడిగితే వారు నిరాకరించి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. అనంతరం దక్షుడు మున్నగు ప్రజాపతులు పుట్టి తండ్రికి సృష్టి కార్యంలో తోడ్పడ్డారు. నారదుడు కూడా బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించాడు. తనను సంసార కూపంలో దించవద్దని, తన హరినామ స్మరణకు, తపస్సుకు తోడ్పడమని తండ్రిని కోరాడు. కొడుకుపై తండ్రికి కోపం వచ్చి నారదుడిని.. ‘నువ్వు మొదటగా గంధర్వుడిగా, తరువాత జన్మలో హీనుడిగా జన్మించాలని.. ఆ తర్వాతే దేవరుషిగా పేరు తెచ్చుకొని విష్ణు భక్తుడివి కాగలవు. అప్పుడే నీ హరినామ స్మరణ వాంఛ నెరవేరుతుంది’ అని శపించాడు బ్రహ్మ. తండ్రి శపించడంతో కోపోద్రిక్తుడైన నారదుడు.. ‘హరి భక్తుడినయ్యే అవకాశం నాకు లేకుండా చేశావు. కాబట్టి, మూడు కల్పముల కాలం నీకు లోకంలో ఎక్కడా ఆలయాలు, పూజలు ఉండవు’ అని బ్రహ్మకు ప్రతిశాపం ఇచ్చాడు. తుంబురుడు కూడా నారదుడితోపాటు గంధర్వుడై గాయకుడు అయ్యాడు. కానీ నారదుడిలా ప్రసిద్ధి కాలేదు. నారదుడు దేవర్షి అయి, జ్ఞాన భక్తులలో వశిష్టుడై, ధర్మాధర్మములకు కలహాలు పెట్టి, ధర్మమే జయించేలా చేస్తూ త్రిలోక సంచారిగా పేరుగాంచాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని