జీవితానికి రాజ‘యోగం

‘ఊపిరి ఉన్నంత వరకూ శరీరం, మనసూ దృఢంగా, శక్తిమంతంగా ఉండాలి’ అన్నారు స్వామి వివేకానంద. ‘శరీరం, మెదడు, ఆత్మలకు అదనపు శక్తినీ, సౌందర్యాన్నీ ఇస్తుంది యోగా’ అన్నారు అమిత్‌ రే.

Updated : 15 Jun 2023 03:04 IST

జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం

‘ఊపిరి ఉన్నంత వరకూ శరీరం, మనసూ దృఢంగా, శక్తిమంతంగా ఉండాలి’ అన్నారు స్వామి వివేకానంద. ‘శరీరం, మెదడు, ఆత్మలకు అదనపు శక్తినీ, సౌందర్యాన్నీ ఇస్తుంది యోగా’ అన్నారు అమిత్‌ రే. ‘శీర్షాసనం వేసినంతలో యోగా కాదు, మెదడును ప్రశాంతపరచడం ముఖ్యం’ అన్నారు స్వామి సచ్చిదానంద. అంత విశిష్టమైంది కనుకనే మన యోగా ప్రపంచానికే ఆదర్శమైంది.
శరీరం పచ్చికుండ లాంటిది. సులభంగా శిథిలమయ్యే ఆ ఘటాన్ని యోగాగ్నిలో కాల్చినపుడు దృఢంగా మారుతుంది. ఆ భావనతోనే- బ్రహ్మదేవుడు చేసిన మన దేహాన్ని పూర్ణాయుర్దాయం కోసం యోగసాధన అనే అగ్నిలో తపింపచేయమన్నారు మహర్షులు. శరీరం, మనసు, శ్వాసల సమతుల్యత సాధించటమే యోగసాధన లక్ష్యం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల సమీకృతికి దోహదపడే సాధనం యోగా. అది ఆరోగ్యకర జీవనాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతినీ ప్రసాదిస్తుంది. పతంజలి మహర్షి ఈ లోకానికి ఇచ్చిన జ్ఞానప్రసాదమిది. ఆ యోగశాస్త్ర పితామహుడు యోగః చిత్తవృత్తి నిరోధః.. మనోసంకల్పాలను నిగ్రహించటమే యోగసాధన అని.. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి- యోగాంగాలని వివరించారు. ‘అష్టాంగ యోగం’గా ఇది జగత్ప్రసిద్ధం. నైతిక విలువలు, మానసిక నియంత్రణ, శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక దృక్పథం- ఇవన్నీ యోగాభ్యాసంలో భిన్న కోణాలు.


యమ నియమాలు

మనల్ని శారీరకంగా, మానసికంగా బలహీనపరిచే వాటిని పరిత్యజించడం యమం. యోగసాధకుడు తాను దూరంగా ఉండాల్సినవేవో తెలుసుకుని వాటిని తన జీవితం నుంచి నిషేధించాలి. అందుకే ‘యమం యోగాభ్యాసానికి ప్రథమ అర్హత’ అన్నాడు పతంజలి. అలాగే మన మానసిక, శారీరక దారుఢ్యానికి దోహదపడే సత్కర్మలను గ్రహించి ఆచరించడమే నియమం. ఈ ఎరుక వల్ల సాధకుడు దుఃఖ, ప్రమాద, నేర, అపరాధ, పాపాల నుంచి తప్పించుకోవచ్చని మహర్షి భావన.


ఆసన ప్రాణాయాయాలు

ఆసనం అనేది శారీరక భంగిమే కాదు.. మొత్తం శరీర స్థితిని సూచిస్తుంది. యెగాసనాలతో దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ధర్మాలను సక్రమంగా ఆచరించేందుకు పొందికైన శరీరమే సాధనం. సుశిక్షితులైన గురువుల పర్యవేక్షణలో ఆసనాలతో శరీరాన్ని చక్కగా మలచుకోవాలి. ఇక నియమబద్ధంగా శ్వాసించటమే పాణాయామం. క్రమబద్ధమైన ఉచ్చ్వాస నిశ్వాసాలు శారీరక, మానసిక రుగ్మతల నుంచి రక్షించి ప్రశాంతతను కలిగిస్తాయి.


ప్రత్యాహార ధారణలు

ఇంద్రియాలను అదుపుచేసే ప్రక్రియనే ప్రత్యాహారం అంటారు. మనసును విషయ వాసనల నుంచి మరల్చే సాధన ఇది. మనోభావాలను పరీక్షించటం, ఆలోచన లను విశ్లేషించటంవల్ల మానసిక స్థితిపై అవగాహన కలుగుతుంది. ఏకాగ్రచిత్తం అద్భుతశక్తిని కలిగుంటుంది. అలా మనసును నియంత్రించడమే ప్రత్యాహారం. అనుకున్నదానిపై మనసును లగ్నం చేయగలగడమే ధారణ. అదే జ్ఞానార్జనకు ఆధారం.


ధ్యాన సమాధిస్థితులు

ఆలోచనల వెనుక దాగి ఉన్న శక్తిని పరిశీలించటమే ధ్యానం. మనసును శోధించటం ద్వారా ఆలోచనలను పరిష్కరించటం, సమాధానపరచటం సాధ్యపడుతుంది. ఇదే ధ్యానానికి పరాకాష్ఠ. ఇలాంటి ధ్యానానికి క్రమశిక్షణతో కూడిన సరళ, సాత్విక జీవనవిధానం ప్రధానం. ఇలా మనసు పవిత్రమైనప్పుడు అది శుద్ధచైతన్యంలో లయమవుతుంది. అదే సమాధి. నిర్మల హృదయం ఉంటేనే ఈ శుద్ధచైతన్య ఉనికిని గుర్తించ గలం. యోగసాధనకు మతవిశ్వాసాలతో సంబంధం లేదు. ఇది విజయవంతమైన జీవనానికి రాజమార్గం.

 చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని