గౌరమ్మకు నేనిస్తి.. ఉండ్రాళ్ల వాయనం
భాద్రపద మాసం కృష్ణ పక్షాన వచ్చే బహుళ తదియే ఉండ్రాళ్ల తద్ది. సర్వాభీష్ట సిద్ధిని కలిగించే ఈ నోముకు మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది.
అక్టోబరు 1 ఉండ్రాళ్ల తద్దె
శ్రావణ, భాద్రపద మాసాలు వచ్చాయంటే.. తెలుగునాట ప్రతి ఇంటా ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు. వీటిల్లో ప్రధాన భూమిక మహిళలదే. అవన్నీ కుటుంబ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆచరించేవే. స్త్రీ స్వరూపమంటేనే త్యాగానికి ప్రతీక.. జగజ్జనని స్వరూపం. ఆ తల్లి లోకంలోని సర్వ జీవజాలాన్నీ సంతానంగా భావించి కాపాడినట్లే.. ప్రతి మహిళా తన కుటుంబం ఉజ్వలంగా ప్రకాశించాలని ఆశించి తపిస్తుంది. అందులో భాగమే వ్రతాలు.
భాద్రపద మాసం కృష్ణ పక్షాన వచ్చే బహుళ తదియే ఉండ్రాళ్ల తద్ది. సర్వాభీష్ట సిద్ధిని కలిగించే ఈ నోముకు మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది. పెళ్లయిన స్త్రీలు తమ సాంసారిక జీవనం చక్కగా సాగాలని, వివాహం కాని కన్నెలు సుగుణాల భర్త లభించాలని తదియ నోము ఆచరిస్తారు.
శ్రద్ధ, పట్టుదలతో విజయాలు
దక్ష యజ్ఞంలో సతిగా తనువు చాలించిన విశ్వేశ్వరి తిరిగి హిమవంతుని పుత్రికగా జన్మించి మహేశ్వరుణ్ణే భర్తగా పొందాలని కఠోర దీక్ష పూనింది. కొంతకాలం ఆకులు కందమూలాలే తింది. అనంతరం నిరాహారంగా పంచాగ్ని మధ్యలో తపస్సు చేసింది. బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివుడు ఆమెను పరీక్షించదలచి.. ‘ఎందుకు ఆ బైరాగిని కోరుకుంటున్నావు? విషసర్పాలు ధరించి, జంతుచర్మం కప్పుకునేవాడికోసం తపస్సు అవసరమా?’ అంటూ ఆమె మనసు మార్చేందుకు యత్నించాడు. ‘ఆ దేవాధిదేవుడి గురించి నీకు తెలిసింది ఇంతేనా?’ అంటూ శివ తత్వాన్ని, ఆయన బాహ్య రూపంలోని అంతరార్థాన్నీ వివరిస్తుందామె. అలా పరమేశ్వరుడు ప్రసన్నుడౌతాడు. ఆయన్నే పతిగా పొందుతుంది. ఉమాదేవి తపస్సు ఫలించింది భాద్రపద బహుళ తదియ రోజునే. అందుకే తదియ నోము నోచుకుని గౌరీదేవిని పూజిస్తారు. శ్రద్ధ, పట్టుదల, అంకితభావాలతో చేస్తే ఫలితం సిద్ధిస్తుందని ఉమాదేవి తపస్సు ఉద్బోధిస్తుంది.
‘మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి’ అన్నారు ‘సౌందర్య లహరి’లో జగద్గురు శంకరాచార్యులు. జగదంబ- నిత్య చైతన్య స్వరూపిణి. తనను నమ్ముకున్నవారికి పరబ్రహ్మ తత్వం తెలిసేలా చేస్తుంది. మరో జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా తనలో ఐక్యం చేసుకుని ముక్తిని ప్రసాదిస్తుందని భావం.
తారతమ్యాలు కూడదంటూ..
ఓ రాజుకు ఏడుగురు భార్యలు. వారంతా తదియ నోము ఆచరించాలనుకున్నారు. రాజనర్తకిగా ఉన్న వేశ్యకి విషయం తెలిసింది. రాజుతో.. తాను కూడా ఆ నోము ఆచరిస్తానని, అందుకు కావాల్సినవన్నీ తెప్పించమని అడిగింది. రాజు అన్నీ సమకూర్చాడు. పుణ్య స్త్రీల మాదిరిగానే భక్తిశ్రద్ధలతో ఐదేళ్ల పాటు నోమును ఆచరించి ముత్తయిదువుల చేతులకు తోరణాలు కట్టి, ఉండ్రాళ్ల వాయనాలు, వస్త్రాలు మొదలైనవి కానుకగా ఇచ్చి, వారి ఆశీర్వాదాన్ని తీసుకుంది. ఆమె ఈ పుణ్య ఫలం కారణంగా మరణానంతరం గౌరీదేవిలో ఐక్యమైంది. శ్రద్ధాభక్తులే తప్ప భగవంతుడికి తారతమ్యాలు ఉండవన్నది అంతరార్థం. ఎవరి పట్లా భేదభావాలు, రాగద్వేషాలు లేకుండా సమభావంతో మెలిగితేనే.. నోములు, వ్రతాలకు ఫలితం దక్కుతుందని తదియ నాడు వినే ఈ వ్రత కథ సారాంశం.
సాత్వికాహారం.. ప్రశాంతత
ఆత్మ జ్ఞానాన్ని అందించే శక్తి మనసుకే ఉంటుంది. మనసు స్థిరంగా భగవంతుడి వైపు నిలవాలంటే శరీరం సహకరించాలి. అప్పుడే మనసును నియంత్రించుకోవడం సాధ్యం అవుతుంది. కాలమాన పరిస్థితులను బట్టి ఏయే కాలాల్లో ఎలాంటి ఆహారం మంచిదో మన పూర్వీకులు నిర్దేశించారు. పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువ ఉండే వర్షాకాలంలో నూనె పదార్థాలు తీసుకుంటే జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే ఈ కాలంలో వచ్చే నోములు, వ్రతాలకు సులభంగా జీర్ణమయ్యే కుడుములను నైవేద్యంగా సమర్పిస్తారు. తదియరోజు తెల్లవారుజామునే పెరుగు, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి తినడం సంప్రదాయం. ఇవి సాత్వికాహార ప్రాధాన్యతను తెలియజేయడమే కాకుండా వర్షాకాలంలో వచ్చే జలుబు, వాతాలను నివారిస్తాయి. పగలంతా చేసే ఉపవాసం.. అభోజనంగా ఉండాల్సివస్తే.. ఆకలిని నియంత్రించుకోగలగటం నేర్పుతుంది. వాయనాలు, కానుకలు ఇవ్వడం- తనకున్నదానిలో ఎంతో కొంత ఇతరులతో పంచుకోవడాన్ని, బంధుమిత్రులతో సంఘటిత జీవన పరమార్థాన్ని సూచిస్తుంది. పండుగలు, వ్రతాల అంతరార్థాన్ని తెలుసుకుని భక్తితో ఆచరిస్తే జీవితం సార్థకమౌతుంది.
ఎం.ఎస్.వి.త్రిమూర్తులు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Animal: ‘యానిమల్’ కోసం రణ్బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనాల్సిందే!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Israel-Hamas: 16 రోజులు చీకటి గదిలో బంధించి.. బాలుడిని హింసించిన హమాస్
-
Btech Ravi: తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు
-
కౌన్బనేగా కరోడ్పతి సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?
-
Ts Elections: ఓటు వేసేందుకు స్వగ్రామాలకు పయనమైన జనం.. బస్ స్టేషన్లలో రద్దీ