మానవ జీవితంతో మమేకం శ్రీరామాయణం

‘‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’’.. ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా, చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథినాడు మధ్యాహ్నం వేళ రాముడు జన్మించాడు.

Updated : 30 Mar 2023 06:49 IST

‘‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’’.. ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా, చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథినాడు మధ్యాహ్నం వేళ రాముడు జన్మించాడు. మన అందరికీ ధర్మానుసారంగా మనిషి ఎలా ప్రవర్తించాడో నేర్పాడు. శ్రీరామనవమి నాడు అందరూ తప్పకుండా ఉపవాసం చేస్తారు. ఉదయాన్నే రామచంద్రమూర్తిని ఆరాధించి, బాలకాండలోని శ్రీరామచంద్రుడి అవతారం ఆవిర్భవించిన సర్గను పారాయణ చేస్తారు. దేవాలయానికి వెళ్లి రాముడిని పూజిస్తారు. కనులారా సీతారాముల కల్యాణం వీక్షిస్తారు. ఆ సుందర, సుమనోహర కళ్యాణాన్ని వీక్షించి, అక్షితలను తలపై వేసుకుంటే, మూడు రకాల అనుగ్రహాలు కలుగుతాయని నమ్మకం. యజ్ఞం చేయాలని బుద్ధి కలిగి, దేవతల అనుగ్రహం పొందుతారు. ఐశ్వర్యం పెరుగుతుంది. సంతానం కలుగుతుంది.

శ్రీరామాయణం ఆది కావ్యం. మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. రామాయణం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తులందరూ సజీవంగా కదులుతున్నట్లు అనిపించే అద్భుతరచన. శ్రీరామాయణం ఇతిహాసం. యథార్థమైన గాథ. రామచంద్రమూర్తి అవతారం పరమసత్యం. రామ స్పర్శలేని విషయం ఉండదు. ఏదైనా రాస్తే ‘శ్రీరామా’ అని రాసి మొదలు పెడతాం. చంటి పిల్లాడికి స్నానం చేయిస్తే, పాత్రలో మిగిలిన నీళ్లతో ‘శ్రీరామరక్ష.. నూరేళ్ల ఆయుష్షు’ అని తల్లి అంటుంది. గోరుముద్దలు తినిపిస్తూ రామకథ చెబుతుంది. ఇంట్లో ఎవరైనా వృద్ధిలోకి రావాలనుకుంటే రామచంద్రమూర్తి అంతటి వాడివి కావాలని ఆశీర్వదిస్తారు. ఎవరైనా అసూయతో ప్రవర్తిస్తే ‘శూర్పణఖ’ బుద్ధి అంటారు. అహంకారంతో ప్రవర్తిస్తే, ‘రావణ అహంకారం పనికిరాదు’ అంటారు. ఎక్కువగా నిద్రపోతే ‘కుంభకర్ణుడిలా ఆ నిద్ర ఏంటి’ అంటారు. ఇలా సమాజం నుంచి విడదీయరాని బంధం శ్రీరామాయణంతో ఏర్పడింది.

రామాయణాన్ని చదివితే మనిషి ఉత్థాన పతానాల్లో ఎలా ఉండాలో అవగతమవుతుంది. మనుషులు పొందే కష్టాల్లోకెల్లా పెద్ద కష్టం ఏంటంటే ‘తన కష్టం చెప్పుకోవడానికి ఒక వ్యక్తి పక్కన లేకపోవడం’. సీతమ్మ తాను అంత కష్టంలో ఉండీ, తనకు కలిగిన కష్టాన్ని పక్కన ఒక వ్యక్తి లేకుండా అన్ని రోజులు రావణాసురుడి లంకా పట్టణంలో ఉంది. ‘ఆమె పడిన కష్టంతో పోలిస్తే, తాను పడిన కష్టం ఏ పాటిది’ అని భావిస్తే, మనిషి ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండటానికి కావాల్సిన ప్రజ్ఞ సంపాదించుకుంటాడు. రామరాజ్యం అంటే రాముడి పరిపాలించిన రాజ్యం అనుకోకూడదు. రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం వస్తుందంటే, మళ్లీ ఆయన పరిపాలించాలని కాదు. రాముడు పరిపాలన చేసినప్పుడు లోకంలో ఉన్న వాళ్లందరూ సుఖశాంతులు పొందారు. ఆయన పరిపాలనకు శాస్త్రాన్ని ప్రమాణం తీసుకున్నాడు. తన స్వబుద్ధిని ఎప్పుడూ ప్రదర్శించలేదు. పరిపాలకులు కూడా రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని అంటారు. అలాంటి శ్రీరాముడు ఆవిర్భవించిన పరమపవిత్రమైన రోజు శ్రీరామనవమి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని