Ganesh Chaturthi: వినాయకుడి రూపాలెన్ని? పూజ ఎలా చేయాలి?

విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకొంటారు. ....

Updated : 14 Mar 2023 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పర్వదినాన్ని కన్నుల పండువగా జరుపుకొంటారు. భారతీయ సమాజంలో వినాయకచవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది. ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. జ్యోతిషశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి ఆరాధనలో కుజుడు, బుధుడు, కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది. విఘ్నేశ్వరుడు ధూమకేతు గణాధ్యక్షుడు, మోక్ష కారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని, బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞానప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని, అలాగే, కుజ గ్రహం అనుగ్రహం వివాహ, అన్యోన్య దాంపత్యానికి చిహ్నం. ఒక్క పార్వతీ తనయుడిని ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందవచ్చని జ్యోతిషశాస్త్రం పేర్కొంటోంది.

వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి? 

విఘ్నేశ్వరుడంటేనే విఘ్నములను తొలగించువాడు అని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషములు పోవాలన్నా, ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి ప్రాప్తి కలగాలన్నా, బుద్ధి వికాసానికి, వ్యాపారాభివృద్ధికి, మోక్ష ప్రాప్తికి విఘ్నేశ్వరుడి ఆరాధన కచ్చితంగా చేయాలని పురాణాలు చెబుతున్నాయి. 

పూజకు ఎలాంటి విగ్రహాన్ని వాడాలి?

మన ఇంట్లో నిత్యం చేసుకొనే పూజలకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి వంటి వ్రతములు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది. ఎంతపెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూపదీప నైవేద్యములు జరగాలి గనక సాధారణంగా ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది. సిద్ధివినాయక పూజలో వాడే విగ్రహం మట్టితో చేసినదైతే శ్రేష్ఠం. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వంటి విగ్రహాలు వాడకూడదు. పూజలో మట్టి విగ్రహం గానీ, పంచలోహములతో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి. 

పూజ ఎలా చేసుకోవాలి? 

ప్రతి ఒక్కరూ వినాయకచవితి కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. ఆ పర్వదినాన తెల్లవారు జామునే లేచి ఇంటిని, పూజగదిని శుభ్రపరిచి తలస్నానమాచరించాలి. కొత్త బట్టలు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని పసుపు, కుంకుమ, తోరణాలతో అలంకరించాలి. విఘ్నేశ్వరుడిని పెద్దలందరితో కుటుంబమంతా కలిసి కూర్చొని పూజామందిరంలోగానీ, తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగాలలో విగ్రహాన్ని ఉంచి దానిపైన పాలవెల్లి కట్టి ఆపై వినాయకుడికి ఇష్టమైన ఎనిమిది లేదా 16 రకాల పండ్లను కట్టి ఆయన్ను షోడశ లేదా అష్టోత్తర శత నామాలతో  21 రకాల పత్రాలతో పూజించాలి. వినాయక పూజ అనంతరం కుడుములు, ఉండ్రాళ్లు, కజ్జికాయలు, పండ్లు, ఇతర ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలి. కుటుంబమంతా వినాయక చవితి వ్రతకల్పంలో చెప్పిన విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఐదు కథలను చేతిలో అక్షింతలు తీసుకొని భక్తి శ్రద్ధలతో ఆలకించాలి. అనంతరం కథా అక్షింతలు తలపై చల్లుకొని ఇంటి పెద్దల ఆశీర్వచనం పొందాలి. 

వినాయక పూజకు వాడే పత్రిలో దాగి ఉన్న రహస్యమేంటి?

భాద్రపదమాసం వర్షరుతువులో వస్తుంది. ఈ మాసంలో రోగాలు అధికంగా వ్యాప్తి చెందుతాయి. అలాంటి ఈ మాసంలో వినాయకవ్రతాన్ని11 రోజులు లేదా 21 రోజుల పాటు చేస్తుంటారు. ఈ వ్రతం సందర్భంగా ప్రతి ఇంటినీ శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమతో గుమ్మాలను అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకోవడం వల్ల వాతావరణం శుభ్రపడుతుందని వినాయక పూజలో 21 రకాల పత్రాలు వాడతారు. ఈ పత్రాలు ఆయుర్వేద, ఔషధ గుణాలతో ఉంటాయి. వీటిని కలిపి వినాయకుడిని పూజించడం వల్ల ఆ పత్రాల నుంచి వచ్చే వాసనకు క్రిమికీటకాలు ఇళ్లలోకి ప్రవేశించవని, ఆ గాలి వాసనకు అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.


నిమజ్జనం  ఎప్పుడు? ఎలా చేయాలి?

వినాయకుడిని 3, 5, 7, 9, 11, 21 రోజుల్లో నిమజ్జనం చేయడం ఉత్తమం. విఘ్నేశ్వరుడి పూజ కనీసం మూడు రోజుల పాటు చేయాలి. మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి. పత్రి, ఫలాలు నిమజ్జనం చేయొద్దు. ఫలాలను దానం చేయడం ఉత్తమం. నిమజ్జనోత్సవం నదులు, సముద్రాల్లో చేయాలి. అలా కుదరని పక్షంలో కుండలో గానీ, బిందెలో గానీ నీళ్లలో నిమజ్జనం చేసి ఆ నీటిని తులసి, మామిడి వంటి మొక్కల్లో పోయాలి. విఘ్నేశ్వరుడి నిమజ్జనంలో దాగి ఉన్న రహస్యమేమిటంటే.. మట్టిలోంచి వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి.. దాన్ని శుద్ధిచేసి  మంత్రాల ద్వారా దైవత్వాన్ని స్థాపన చేసి ధూపదీపాలతో, సుగంధ ద్రవ్యాలతో ఆహ్వానం పలుకుతాం. అష్టోత్తర శతనామాలతో పూజించి.. నైవేద్యాలు సమర్పించి ఉద్వాసన పలికి ఆఖరిగా విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేస్తూ తిరిగి మట్టిలోనే కలుపుతాం. ఇదే విధంగా మనిషి కూడా తన జీవితంలో ఈ శరీరం మట్టిలోంచే వచ్చింది.. తిరిగి అదే మట్టిలో కలుస్తుందని భావించి తన జీవిత ప్రయాణంలో శరీరంలో దాగి ఉన్న అరిషడ్వర్గాలను తొలగించుకొని భక్తిమార్గాన్ని పెంచుకొని ధర్మమార్గంలో నడుస్తూ ఆధ్యాత్మికచింతనను అలవర్చుకొని మోక్షం వైపు అడుగులు వేసి ముక్తిని పొందాలనే సారాంశం వినాయక వ్రతంలో స్పష్టంగా కనబడుతుంది. 

వినాయకుడి ముఖ్యమైన రూపాలెన్ని? 

విఘ్నేశ్వరుడికి మొత్తం 32 రూపాలు ఉన్నాయి. వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా తాంత్రికులు పూజిస్తారని చెబుతారు. అందువల్ల ఈ 16 రూపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
1. బాలగణపతి 2. తరుణ గణపతి 3. భక్త గణపతి 4. వీర గణపతి 5. శక్తిగణపతి 6. ద్విజ గణపతి 7. సిద్ధి గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విష్ణు గణపతి 10.క్షిప్త గణపతి, 11. హేరంభ గణపతి 12. లక్ష్మీగణపతి 13. మహాగణపతి 14. విజయ గణపతి 15. రుత్య గణపతి 16. ఊర్ధ్వ గణపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు