Viral Video: విమానంలో గొడవ.. ఇది నెక్స్ట్‌ లెవల్‌.. ఈసారి చొక్కా విప్పేసి మరీ..!

విమాన ప్రయాణాల్లో ఇటీవలి సంఘటనలకు కొనసాగింపుగా మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు షర్ట్‌ విప్పేసి మరీ తోటి ప్రయాణికుడిపై పిడి గుద్దులు కురిపిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

Published : 10 Jan 2023 17:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమాన ప్రయాణంలో గొడవలు సర్వసాధారణంగా మారిపోయాయి. మద్యం మత్తులో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం, వారితో గొడవ పడడం, విమాన సిబ్బందిపై చిర్రుబుర్రలాడడం, వారిని అవమానించడం వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. తాజాగా ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో చొక్కా విప్పేసి మరీ గొడవ పడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఇది మన దేశంలో కాదులెండి. బంగ్లాదేశ్‌కు చెందిన బిమన్‌ బంగ్లాదేశ్‌ విమానంలో జరిగింది.

బిటంకో బిశ్వాస్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియో పోస్ట్‌ చేశారు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడితో గొడవ పడడం కనిపిస్తోంది. షర్ట్‌ లేకుండా ఉన్న వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులు గుద్దడం కనిపించింది. సీట్లో ఉన్న వ్యక్తి సైతం కొడుతుండడం కనిపించింది. వీరి గొడవను అడ్డుకొనేందుకు తోటి ప్రయాణికులు యత్నించడం అందులో కనిపించింది. అయితే, గొడవ ఎందుకనేది మాత్రం తెలియరాలేదు.

ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘‘ఇలాంటి వ్యక్తులను జీవితం కాలం విమానం ఎక్కకుండా నిషేధించాలి’’ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. విమాన ప్రయాణాల్లో నిత్యకృత్యంగా మారిన ఇలాంటి ఘటనలు ఆగాలంటే కఠిన శిక్షలు విధించాలని మరికొందరు రాసుకొచ్చారు. ‘విమాన ప్రయాణం రిస్కే’ అంటూ మరో యూజర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ‘ఇది బస్సా.. ఫ్లైటా అలా కొట్టుకుంటున్నారేంటి?’ అంటూ మరో వ్యక్తి కామెంట్‌ పెట్టాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని