Biggest Laptop: ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాప్‌టాప్‌.. దీన్ని మోయాలంటే కష్టమే!

ల్యాప్‌టాప్‌ (Laptop) అనగానే.. 11 అంగుళాల నుంచి 15 అంగుళాల డిస్‌ప్లేతో దర్శనమిస్తుంది. దాన్ని బ్యాక్‌పాక్‌ బ్యాగ్‌లో పెట్టుకుని ఎంచక్కా ఎక్కడి నుంచైనా పనిచేసుకోవచ్చు. కానీ, అమెరికాకు చెందిన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకులు తయారు చేసిన ల్యాప్‌టాప్‌ను తీసుకెళ్లాలంటే మాత్రం క్రేన్‌ కావాల్సిందే. 

Published : 01 Mar 2023 22:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంప్యూటర్ (Computer) అనగానే టేబుల్‌ మీద పెట్టుకునే ఎంచక్కా పనిచేసుకోవచ్చు. కంప్యూటర్ల విడుదలైన తొలినాళ్లలో అయితే పెద్ద డబ్బా ఆకారంలో దర్శనమిచ్చేవి. సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా డెస్క్‌టాప్‌ కంప్యూటర్ల డిజైన్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. క్రమంగా వాటి స్థానంలో ల్యాప్‌టాప్‌ (Laptop)లు వచ్చాయి. వీటిలో కూడా ర్యామ్‌, ప్రాసెసర్‌, డిస్‌ప్లే ఆధారంగా వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. సాధారణంగా ల్యాప్‌టాప్‌ డిస్‌ప్లే 11 అంగుళాల నుంచి 15 అంగుళాల మధ్య ఉంటుంది. 

ఇప్పటి వరకు విడుదలైన వాటిలో చైనాకు చెందిన మ్యాజిక్‌ బెన్‌ (Magic Ben) కంపెనీ విడుదల చేసిన మ్యాగ్‌ 1 (MAG 1) ల్యాప్‌టాప్‌ ఆకారంలో చిన్నది కాగా.. ఏసర్‌ (Acer) కంపెనీ విడుదల చేసిన ప్రిడేటర్‌ 21 (Predator 21) ల్యాప్‌టాప్‌ పెద్దది. వీటికి భిన్నంగా అమెరికాకు చెందిన ఈవాన్‌ (Evan), కేట్లిన్‌ (Katelyn) అనే జంట ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాప్‌టాప్‌ను తయారు చేసింది. మరి, ఆ ల్యాప్‌టాప్‌ నిజంగా పనిచేస్తుందా? అందులోని ఫీచర్ల ఏంటో చూద్దాం..?

ఈ ల్యాప్‌టాప్‌ డిస్‌ప్లే కోసం 43 అంగుళాల శాంసంగ్‌ ఎమ్‌70బీ టీవీని ఉపయోగించారు. డిస్‌ప్లేను అల్యూమినియం, వుడ్‌తో తయారు చేసిన ఫ్రేమ్‌లో.. కీబోర్డ్‌, ర్యామ్‌, స్టోరేజ్‌, ప్రాసెసర్‌ వంటి వాటి కోసం త్రీడీ టెక్నాలజీతో రూపొందించిన ప్లాస్టిక్ ఫ్రేమ్‌లో అమర్చారు. మరి, పెద్ద ల్యాప్‌టాప్‌ అంటే కీబోర్డు కూడా పెద్దగా ఉండాలి కదా.. అందుకే రెడ్రాగన్‌ కే605 మెకానికల్ కీబోర్డ్‌ (Redragon K605)ను, ఎల్‌టీసీ ట్యాబ్‌లెట్‌ను ఇందులో టచ్‌ప్యాడ్‌గా అమర్చారు. ప్రాసెసర్‌ విషయానికొస్తే.. 11 జనరేషన్‌ ఇంటెల్‌ కోర్ i7-1165G7 2.8 గిగాహెర్జ్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

గేమింగ్‌కు అనుకూలంగా ఉండేందుకు NVIDIA RTX 2060 గ్రాఫిక్‌ కార్డ్‌ను అమర్చారు. ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ కోసం మూడు 150 W బ్యాటరీలను ఉపయోగించారు. వీటిలో రెండు ల్యాప్‌టాప్‌కు పవర్‌ను అందిస్తాయి. మరో బ్యాటరీ ల్యాప్‌టాప్‌ ఫ్రేమ్‌ చుట్టూ అమర్చిన ఎల్‌ఈడీ లైటింగ్‌కు పవర్‌ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ర్యామ్‌, స్టోరేజ్‌ గురించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇది 45 కేజీల బరువు ఉన్నట్లు తెలిపారు. దీని తయారీకి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ ల్యాప్‌టాప్‌తో రిమోట్ వర్క్‌ చేయాలంటే.. కష్టమే అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే అతిపెద్ద ల్యాప్‌టాప్‌ అని ఈవాన్‌, కేట్లిన్ చెబుతున్నారు.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు