చేర్యాలకి చేరువయ్యేలా..

కుటుంబ నేపథ్యం నుంచి అందిపుచ్చుకున్న కళ.. చేర్యాల పెయింటింగ్స్‌.. వాటిని మిలీనియల్స్‌ మెచ్చేలా తీర్చిదిద్దుతున్నాడు ధనాలకోట సాయికిరణ్‌.. సరికొత్త డిజైన్లతో అందరి మనసులు గెలుచుకుంటోన్న కిరణ్‌ని ‘ఈతరం’ పలకరిస్తే.. తరాల నుంచి కాపాడుకుంటున్న చేర్యాల తనకెలా దగ్గరయ్యిందో పంచుకున్నాడిలా...

Published : 28 Sep 2019 01:14 IST

‘కళా’కిరణాలు

కుటుంబ నేపథ్యం నుంచి అందిపుచ్చుకున్న కళ.. చేర్యాల పెయింటింగ్స్‌.. వాటిని మిలీనియల్స్‌ మెచ్చేలా తీర్చిదిద్దుతున్నాడు ధనాలకోట సాయికిరణ్‌.. సరికొత్త డిజైన్లతో అందరి మనసులు గెలుచుకుంటోన్న కిరణ్‌ని ‘ఈతరం’ పలకరిస్తే.. తరాల నుంచి కాపాడుకుంటున్న చేర్యాల తనకెలా దగ్గరయ్యిందో పంచుకున్నాడిలా...
పొడవైన వస్త్రంపై చేర్యాల ఆర్ట్‌ ఫామ్‌ ఉంటుంది. కాకతీయుల కంటే ముందు నుంచీ ఉన్న ఈ ప్రాచీన కళను యువతకు చేరువ చేయాలని ఆలోచించా. ఆర్ట్‌ తీరులో మునుపటి నైపుణ్యం చెక్కు చెదరకుండా.. కొత్త సొబగులద్దడంలో నైపుణ్యం సంపాదించా. నేను సానపెట్టుకున్న స్కిల్స్‌ని కుటుంబం మొత్తానికి పరిచయం చేశా. దీంతో యువత మెచ్చేలా భిన్నమైన డిజైన్స్‌ని తయారు చేయడం సాధ్యం అయ్యింది. కీ చైన్‌,  స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ పౌచ్‌లు, కళ్లద్దాల స్టాండ్‌లు, బ్యాగులు, టీ షర్ట్‌లు, టిష్యూ బాక్సులు, ఆహ్వాన పత్రికలు, డైరీల అట్టలు, జంతువుల బొమ్మలు చేస్తున్నాం. పెన్నులు పెట్టుకునే స్టాండ్‌, అమ్మాయిలకు జ్యువెలరీ బాక్సులు, హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ బాక్సులపైన చేర్యాల ఆర్ట్‌ వేస్తున్నాం. ఇటీవలే అమ్మాయిల కోసం ఇయర్‌ రింగ్స్‌ తయారు చేశా. పలు ప్రదర్శనల్లో చేర్యాల నూతన ఆర్ట్‌ఫామ్‌ చూసి యువత కొంటున్నారు. ఒకవైపు అందమైన చేర్యాల కళ.. మరో వైపు ఫ్యాషన్‌ ట్రెండీ..లుక్‌ ఉండటంతో వాళ్లు ఇష్టపడుతున్నారు. బొమ్మలు తయారు చేయడానికి చింత గింజలపొడి, చెక్కపొట్టు ఉపయోగిస్తాం. సహజమైన రంగులు వాడతాం.

ఐదేళ్ల చదువు ఎంతో నేర్పింది
మేం సాలార్జంగ్‌ మ్యూజియం (2010) దగ్గర ఓ ప్రదర్శనకు వెళ్లాం. అక్కడ శ్రీవెంకటేశ్వర కాలేజీ యజమాని వాణీదేవిగారు మా వర్క్‌షాప్‌ చూశారు. నా పని చూశాక ఉచితంగా ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’లో సీటు ఇచ్చారామె. ఈ ఐదేళ్ల చదువు నాకెంతో ఉపయోగపడింది. కొత్త వ్యక్తులతో పాటు సరికొత్త ఆర్ట్‌ఫామ్స్‌ చూశా. మామూలు కాన్వాస్‌ మీద పెయింటింగ్‌ వేయడం, వాటర్‌ కలర్‌, ఆయిల్‌ పెయింటింగ్‌ నేర్చుకున్నా. సరికొత్తగా చేర్యాల ఆర్ట్‌ను చేయమనేవాళ్లు. ప్రొఫెసర్లు క్రియేటివ్‌గా ఆలోచించమనేవాళ్లు. వాళ్ల ప్రోత్సాహంతోనే చేర్యాల ఆర్ట్‌ను యువతకు దగ్గరచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. పాత చేర్యాల ఆర్ట్‌ఫామ్‌ను బాగా పరిశోధించాను. నా చదువు మా కళను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతోంది. ఇంగ్లిషు నేర్చుకోవటం వల్ల ఎక్కడికైనా వెళ్లి అక్కడ మా గురించి చెబుతున్నా. మా ప్రాచీన కళను బతికించుకుంటూనే..గ్లోబలైజేషన్‌కు అనుకూలంగా సరికొత్త రూపాన్ని సంతరించుకోవాలన్నదే మా ఆశ. చేర్యాల పెయింటింగ్‌ స్టోర్‌ పెట్టాలన్నదే నా కల.

 

నాన్నపేరు ధనాలకోట నాగేశ్వర్‌, అమ్మ పద్మ. ఇద్దరూ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలే. చీరపై చేర్యాల ఆర్ట్‌ను వేసింది అమ్మ. చెల్లి, తమ్ముడు అందరం ఈ పని చేస్తాం. ఇరవై రోజులకు ముందు ఆర్డర్‌ ఇస్తే ఇంటిల్లిపాదీ కలిసి మోడర్న్‌ ఆర్ట్‌ఫామ్స్‌ తయారు చేసిస్తాం. మాకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో మా ప్రదర్శనలు, వర్క్‌షాప్స్‌ తేదీలను ఉంచితే యువత వస్తున్నారు. మా పేజీకి వచ్చి యువత చేర్యాల డాల్స్‌, పెయింటింగ్స్‌ కొంటున్నారు.

 

 

 

మా చేర్యాల కళాకృతులకోసం..    
https://cherial-paintings.business.site/?whatsapp


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని