ఆ ఇద్దరు.. చెరపలేని జ్ఞాపకాలు..!

నేను కబీర్‌. ఊరు వైజాగ్‌. ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో వైషూ, నిషా, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. పక్క పక్క ఇళ్లే. నిషా నా క్లాస్‌మేట్‌. వైషూ నాకు జూనియర్‌.

Published : 05 Oct 2019 00:09 IST

అర్థం చేసుకోలేనప్పుడు ప్రేమించడమెందుకు? అర్ధాంతరంగా వెళ్లిపోయి నీడలా తోడుంటానన్నావెందుకు?

నేను కబీర్‌. ఊరు వైజాగ్‌. ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో వైషూ, నిషా, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. పక్క పక్క ఇళ్లే. నిషా నా క్లాస్‌మేట్‌. వైషూ నాకు జూనియర్‌. ఇద్దరూ నన్ను బాగా అర్థం చేసుకునేవారు. ముగ్గురం సినిమాకెళ్తే నేను మధ్యలోనే కూర్చోవాలి. లేదంటే.. థియేటర్‌లో మూడు సీట్లూ ఖాళీనే. త్రీ ఇడియట్స్‌లా మేం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అనుకోకుండా వైషూ లవ్‌ ప్రపోజల్‌ నన్ను అయోమయానికి గురిచేసింది. ఎందుకంటే.. నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. అందుకే ఒప్పుకోలేదు. కానీ, కొన్ని రోజులకి తన ప్రేమ నన్ను ఆలోచింపజేసింది. ఫ్రెండులా వైషూతో గడపడం అసహజంగా అనిపించింది. తనతో ఇంతకు ముందులా ఉండడం అసాధ్యం అనిపించింది. అంతే.. నా మనసులోనూ ప్రేమ కలువలు విచ్చుకున్నాయి. పక్క పక్క ఇళ్లే కావడంతో ఇద్దరం ఇంటి పనుల్లో సహకరించుకుంటూ మా ప్రేమ ప్రస్థానం మొదలెట్టాం. వైషూ మా ఇంట్లోనే ఎక్కువగా ఉండేది. కొన్ని సార్లు మా ఇంట్లోనే తినేది. ఇంత చనువు ఏంట్రా? అనుకుంటున్నారా? తను నా చెల్లికి బెస్టీ కూడా. దీంతో ఇంట్లో పెద్దవాళ్లకు ఎప్పుడూ అనుమానం రాలేదు.

ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోయాం. వైషూ నాకు జూనియర్‌గా మా కాలేజీలోనే చేరింది. ఇక క్యాంపస్‌ మొత్తం మా ఇద్దరి ప్రేమ కువకువలే. ‘నింగినైనా.. నేలనైనా అమూల్యమైనదీ మగువా..’ అంటూ మా ఇద్దరి డ్యూయెట్‌లే హైలైట్‌. ఇలా మా అనుబంధం సాగుతున్న తరుణంలో నేను మూడ్రోజులు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. వైషూకి చెప్పలేదు. వచ్చాక చెబుదాం అనుకున్నా. తిరిగి వచ్చాక చూస్తే.. వైషూలో నేను ఊహించని మార్ఫు తను ఏకంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని చెల్లి చెప్పింది. నాకు తెలియకుండా అంత కష్టం నన్ను దాటుకుని తనదాకా ఎలా వెళ్లిందో అర్థం కాలేదు. తనని అడిగే ప్రయత్నం చేస్తే నాతో మాట్లాడలేదు. ఎంత ట్రై చేశానో. ప్రాణంగా ప్రేమించిన వైషూ.. నన్నో విలన్‌లా చూడడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఏం జరిగిందో నాతో పంచుకోవాలని వైషూకి ఎందుకు అనిపించలేదు? అదే టైమ్‌లో బ్యాడ్‌లక్‌ మా మధ్య ప్రవేశించింది. మా ప్రేమ విషయం వైషూ వాళ్ల ఇంట్లో తెలిసింది. వాళ్ల నాన్న, మామయ్య నన్ను చంపేయాలన్న కసితో చితకబాదారు. ఎదురు తిరిగే సత్తా ఉన్నా కూడా వైషూ చేసిన గాయం కంటే ఆ దెబ్బలు చిన్నవిగా అనిపించాయి. అప్పుడే మరో షాకింగ్‌ వార్త నన్ను పూర్తిగా చంపేసింది. వాళ్ల మామయ్యతోనే వైషూ పెళ్లికి సిద్ధం అయ్యింది. వారంలో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయింది.

నా ప్రమేయం లేదు.. నేను ముందు ప్రేమించలేదు. తనే నాకు ప్రేమని అందమైన బీచ్‌లా చూపించి.. అర్ధాంతరంగానే నడి సముద్రంలో వదిలేసింది. ఆమె జ్ఞాపకాల్లో సంవత్సరం గడిపేశాను. నేను ఏమైపోతానో అని కంగారుపడిన మా అమ్మ హైదరాబాద్‌లోని అమ్మమ్మ వాళ్లింటి దగ్గర ఉంచింది. మూడు నెలల తర్వాత ఇంటికి వచ్ఛా ఇంత బాధని అనుభవిస్తున్న తరుణంలో నిషా స్నేహం కాస్త ఊరటగా అనిపించింది. నా గతాన్ని చెరిపే ప్రయత్నం చేస్తోందని నాకు తెలిసినా.. నేను వైషూని మర్చిపోలేకపోతున్నా. వైషూపై కోపం వచ్చేలా నిషా మాట్లాడినపుడు.. నాకెందుకో నచ్చేది కాదు. ఓ రోజు నిషా నన్ను ప్రేమిస్తున్నా అంది. జాలి చూపిస్తుందేమో అనుకున్నా. నాకు అంత ఓపిక లేదని చెప్ఫా అయినా తను ప్రయత్నిస్తూనే ఉంది. రోజులు.. వారాలు.. గడుస్తున్నాయి. నేను వైషూని మర్చిపోతాననే నమ్మకం మాత్రం కాలం నాకు ఇవ్వడం లేదు. మా అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదని చూసిరమ్మని అమ్మ చెబితే హైదరాబాద్‌ వెళ్లా. అనుకోకుండా వైషూ షాపింగ్‌ మాల్‌లో కనిపించింది. కోపమో.. ప్రేమో.. నన్ను నిలవనివ్వలేదు. తన చుట్టూ ఎవరున్నారో కూడా చూడలేదు. ఒక్కటే మాట అడిగేశా.. ‘నన్నో మోసగాడిలా ఎందుకు చూస్తున్నావ్‌?’ అని. తను మాత్రం ఒక్కమాటలో కాదు.. కన్నీళ్లు జత చేసి అడిగింది.. ‘నన్ను ప్రేమిస్తూ మీ మరదలితో పెళ్లికి ఎలా సిద్ధమయ్యావ్‌? ఎవరో చెబితే నేను నమ్మేదాన్ని కాదు.. నిషానే చెప్పింది. నువ్వు ఎలాంటి వాడివో ఇంకా చాలానే చెప్పింది’ అనే సరికి నాకు దిమ్మ తిరిగిపోయింది. నేను తేరుకునే లోపే.. తను కన్నీళ్లు తడుచుకుంటూ నన్ను దాటుకుని వెళ్లిపోయింది. తనని ఆగమని నిజం చెప్పినా.. ఉపయోగం లేదు. తను నిజం తెలుసుకున్నా.. అడుగులు వెనక్కి వేసి రాలేదు. తననే చూస్తూ మనసులో ఒక్కటే అనుకున్నా.. ‘తను మళ్లీ వెనక్కి తిరిగి నన్ను చూడకూడదని’. నేను అనుకున్నట్టుగానే చూడలేదు. నాపై ద్వేషం ఎప్పటికీ అలానే ఉండాలనుకున్నా. నా లవ్‌ స్టోరీలో విలన్‌ నిషానే అయ్యేసరికి జీవితం నరకంలా అనిపించింది. తనకి మా ప్రేమ మింగుడు పడలేదనీ... ఎలాగైనా విడగొట్టాలని నేను లేని టైమ్‌ చూసుకుని నా గురించి నెగెటివ్‌గా చెప్పిందని.. అర్థం చేసుకోవడానికి సెకన్ల టైమే పట్టింది. నాకంతా అయోమయం. నిషాపై పట్టలేనంత కోపం. అమ్మమ్మకి నయం అయ్యాక కొన్ని రోజులకు ఊరికి బయల్దేరా. బస్సులో మా ముగ్గురి మధ్య చోటు చేసుకున్న ఎన్నో సంఘటనలు, వేగంగా.. బస్సు ముందుకీ.. జ్ఞాపకాలన్నీ వెనక్కీ. నిషాని ‘ఎందుకిలా చేశావ్‌?’ అని అడగాలనుకున్నా. ఇంటికి వెళ్లే సరికి నిషాకి వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయమైందని తెలిసి షాక్‌ అవ్వలేదు. అప్పటికే నాకు అర్థమైంది. ఆడవాళ్ల మనసులు.. వాటిి వెనకున్న లోతులు. నా కథలో వాళ్లిద్దరూ ఓ చెరపలేని జ్ఞాపకాల్లా మిగిలిపోయారు.

- కబీర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని