ఎవరనేది తేల్చుకోలేకపోతున్నా!

నా పేరు సంధ్య. బ్యాంకు ఉద్యోగంలో కొత్తగా జాయిన్‌ అయ్యాను. ఆఫీసులో సహోద్యోగి నాపై ఇష్టంతో నేనే తన జీవితమంటూ వెంటపడుతున్నాడు. పెళ్లి చేసుకుందాం అంటున్నాడు.  ఎన్నడూ చెడుగా ప్రవర్తించింది లేదు. అతనిపై నాకున్నది కేవలం స్నేహభావమే....

Published : 16 Nov 2019 00:48 IST

మనలో మనం

ప్రశ్న: నా పేరు సంధ్య. బ్యాంకు ఉద్యోగంలో కొత్తగా జాయిన్‌ అయ్యాను. ఆఫీసులో సహోద్యోగి నాపై ఇష్టంతో నేనే తన జీవితమంటూ వెంటపడుతున్నాడు. పెళ్లి చేసుకుందాం అంటున్నాడు.  ఎన్నడూ చెడుగా ప్రవర్తించింది లేదు. అతనిపై నాకున్నది కేవలం స్నేహభావమే. మరో విషయం ఏంటంటే.. నేను నాతోపాటు చదువుకున్న మరో అబ్బాయిని ఇష్టపడుతున్నా. నేనంటే తనకూ ఇష్టమే. వాళ్ల ఇంట్లో ఒప్పుకొంటారో లేదో అనే భయం ఇద్దరికీ ఉంది. నన్ను ఇష్టపడే వ్యక్తి.. నేను ప్రేమించే అతను.. ఎవరితో నా జీవితం బాగుంటుందో తేల్చుకోలేకపోతున్నా. ఈ మానసిక సంఘర్షణ నుంచి బయటపడేదెలా?
సమాధానం: సంధ్యగారు.. మీరు మొదటి వ్యక్తి విషయంలో కేవలం స్నేహభావంతోనే ఉన్నారు. అతనితో మీకెలాంటి సమస్య లేదు కనుక  మీరో మంచి స్నేహితురాలిగా ఉంటానని స్పష్టంగా చెప్పండి. అంతేకాదు.. మీరొక వ్యక్తిని ఇష్టపడుతున్నానని, ఇరువైపులా ఒప్పించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పండి. మీ నిర్ణయం ఏంటనేది త్వరగా చెప్పకుంటే అతను మీపై మరింత ఇష్టం పెంచుకునే అవకాశం ఉంది. మీపై ఆశని పెంచుకునేలా ప్రవర్తించొద్దు. పెళ్లి అనేది జీవితకాలపు బాధ్యత. అందులో ఇద్దరూ ప్రేమించుకోగలిగితేనే దాంపత్య జీవితం బాగుంటుంది. అందుకు మీ   ఇరు కుటుంబాల సహకారం ఉండాలి. మీ ప్రేమ విషయాన్ని ఇరువురి కుటుంబాల్లో చెప్పి ఒప్పించండి. ‘ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం.. ఒకరిపై మరొకరికి ప్రేముంది.. గౌరవం ఉంది.. పెళ్లైన తర్వాత కలసిమెలసి లైఫ్‌ని ప్లాన్‌ చేసుకుంటాం’ అని ఆత్మవిశ్వాసంతో మీ కలల్ని వారికి చెప్పండి. అలాగే, మీ ఇద్దరూ జీవితంలో ఎలా ముందుకెళ్లాలో మాట్లాడుకోండి. మీరు కలిసి తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మరింత అందంగా, ఆనందంగా మార్చుతుంది. మానసిక సంఘర్షణను పక్కనపెట్టి యాక్షన్‌ ప్లాన్‌ని ప్రారంభించండి.

- డాక్టర్‌ టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని