మా బావ కళ్లలో ఆనందం కోసం

ఏరా.. ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉంటున్నావ్‌.. ఎవరితో కలవవా? కాలేజీ లైఫ్‌ అంటే కొంచెం ఎంజాయ్‌మెంటూ ఉండాలి బామ్మర్దీ’ అంటూ మొదటి పలకరింపులోనే అంత చొరవ తీసుకుంటున్న క్లాస్‌మేట్‌ వైపు ఆశ్చర్యంతో చూశా

Updated : 07 May 2022 05:23 IST

‘ఏరా.. ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉంటున్నావ్‌.. ఎవరితో కలవవా? కాలేజీ లైఫ్‌ అంటే కొంచెం ఎంజాయ్‌మెంటూ ఉండాలి బామ్మర్దీ’ అంటూ మొదటి పలకరింపులోనే అంత చొరవ తీసుకుంటున్న క్లాస్‌మేట్‌ వైపు ఆశ్చర్యంతో చూశా. ‘హాయ్‌.. అయామ్‌ మోహన్‌.. నీ పేరేంటి?’ మళ్లీ తనే చేయందించాడు. మాటల్లో తెలిసింది తను నాకన్నా రెండేళ్లు పెద్ద అని. నాకు అమ్మ తప్ప మరో ప్రపంచం లేదు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడను. డిగ్రీ వరకూ అంతే. మరెందుకో తెలియదుగానీ కొద్దిరోజులకే మోహన్‌ ప్రాణ స్నేహితుడయ్యాడు.

వాడితో ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో వెలితి. కానీ తనేమో తరచూ కాలేజీకి డుమ్మా కొట్టి ఊరెళ్లిపోయేవాడు. వారం, పది రోజులయ్యాక తిరిగొచ్చేవాడు. నాకప్పుడు నరకంలా అనిపించేది. ఎందుకిలా చేస్తున్నావని అడిగానోసారి. ‘మాది చాలా పేద కుటుంబం. ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించి అమ్మకిచ్చి వస్తుంటా’ అన్నాడు. నాకు చాలా బాధేసింది. అప్పట్నుంచి తను ఊరెళ్లి వచ్చేటప్పటికి వాడికోసం ఏదో గిఫ్ట్‌ కొని ఉంచేవాణ్ని. ఓసారిలాగే వెళ్లేప్పుడు నన్ను కలిశాడు. ‘రేయ్‌ బామ్మర్దీ.. ఇంట్లో పరిస్థితి అస్సలేం బాగాలేదు. అర్జెంటుగా రూ.2లక్షలు కావాలి. సర్దగలవా?’ అన్నాడు. అంత పెద్దమొత్తం ఎక్కడిని నుంచి తేగలను? అయినా నా ప్రయత్నాలన్నీ చేశా. రెండ్రోజుల తర్వాత మళ్లీ అడిగాడు. ‘సారీ బావా.. సర్దుబాటు చేయలేకపోయా’ అన్నా. ఫర్వాలేదంటూ వెళ్లిపోయాడు. అప్పట్నుంచి తనలో మార్పు.

ఊరి నుంచి రాగానే నా దగ్గరికి పరుగెత్తుకొచ్చేవాడు వారమైనా రాలేదు. నాలుగుసార్లు ఫోన్‌ చేసినా తీయలేదు. కాలేజీకొచ్చినా చూసీ చూడనట్టే ఉండేవాడు. ఏడుపొచ్చేది. క్లాసులో ఓసారి మాట్లాడమని కాళ్లు కూడా పట్టుకున్నా. ‘రెండు లక్షలు ఇవ్వకపోవడమే నా తప్పా?’ అని వేడుకున్నా. అయినా నోరు తెరవలేదు.

అలా పది రోజులు గడిచాయి. తర్వాత కాలేజీలో కనపడలేదు. తన స్నేహితుల్ని అడిగా. ‘వాడికి కరోనా వచ్చింది. ప్రాణస్నేహితుడు అని వెళ్లి ఓదార్చేవూ.. నీకు అంటుకుంటుంది జాగ్రత్త’ అన్నారు. నాకు గుండె ఆగినంత పనైంది. అప్పుడు ఫస్ట్‌ వేవ్‌. కరోనా పేరెత్తితేనే అంతా హడలిపోతున్నారు. అయినా నా బావ కోసం ఏదైనా చేయాలనిపించింది. వెంటనే తన రూమ్‌కి వెళ్లా. నన్ను చూడగానే గాబరా పడిపోయాడు. ‘రేయ్‌.. ఎందుకొచ్చావ్‌రా.. దూరంగా వెళ్లు’ అని గట్టిగా అరిచాడు. ‘నువ్వు ప్రాణంరా.. నీకేమైనా తట్టుకోలేను..’ అంటూ గట్టిగా పట్టుకొని ఏడ్చేశా. ‘బంధువులు పట్టించుకోవడం లేదు.. ఫ్రెండ్స్‌ దగ్గరికి రావడం లేదు. నీకెందుకురా నాపై ఇంత ఇష్టం’ అని వాడూ ఏడ్చాడు. తర్వాత నేనూ తనతోపాటు క్వారంటైన్‌లో ఉన్నా. అప్పటికే వాడు చాలా నీరసంగా ఉన్నాడు. బయటికి వెళ్లి మందులు తెచ్చా. వంట చేసి పెట్టా. నాలుగు రోజుల్లో కోలుకున్నాడు. ‘అవసరాల్లోనే కాదు.. ఆపదల్లోనూ అండగా ఉండే నీలాంటి ఫ్రెండ్‌ అందరికీ ఉండాలిరా’ అంటుంటే నా కళ్లు చెమర్చాయి. అప్పట్నుంచి మా బావాబామ్మర్దుల బంధంలో మళ్లీ పొరపొచ్చాలు రాలేదు.

- వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని