Updated : 13/11/2021 05:13 IST

చేయి పట్టుకొని నడిపించరు

అన్న అర్జున్‌రెడ్డి... తమ్ముడిది మిడిల్‌క్లాస్‌ మెలోడీ! అన్న మాస్‌గా ఉండే డియర్‌ కామ్రేడ్‌... తమ్ముడిది క్లాస్‌ మనస్తత్వం ఉన్న పుష్పకవిమానం... ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పరిచయం ఆనంద్‌ దేవరకొండదే అని! అన్న చాటు తమ్ముడిగా ఒదిగిపోకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటంలో ఉన్న ఈ కుర్రాడు తన చదువు, సరదాలు, సినిమాల్లోకి వచ్చిన వైనం, వ్యక్తిగత వివరాలు, అన్నయ్యతో అనుబంధం.. అతడి మాటల్లోనే..

వారసత్వం కార్డు చూపిస్తే పరిశ్రమలోకి తేలిగ్గానే ఎంట్రీ దొరుకుతుంది. కానీ సత్తా చూపిస్తేనే మనుగడ. అందరికీ నచ్చే వ్యక్తిత్వం ఉంటేనే కెరీర్‌. ఆ విషయంలో పక్కాగా ఉంటానంటున్నాడు ఆనంద్‌. అందుకు తన నేపథ్యమూ తోడవుతోందంటున్నాడు. 

ఆ లైఫ్‌స్టైల్‌ నచ్చకే: ఇప్పుడంటే ఫర్వాలేదుగానీ మేమూ సినిమా కష్టాలు పడిన వాళ్లమే. నాన్న నటుడు కావాలని హైదరాబాద్‌ వచ్చారు. రెండు సీరియల్స్‌, ఒక టీవీ షో చేశారు. పెద్దగా విజయవంతం కాలేదు. ఆపై అన్నయ్య ప్రయత్నాలు మొదలయ్యాయి. నేనూ అదేబాటలో వెళ్తే కష్టమని చదువుపై దృష్టిపెట్టా. డిగ్రీ అయ్యాక అమెరికా వెళ్లి మాస్టర్స్‌ చేశా. అక్కడే మంచి జీతంతో ఏడాదిన్నర పనిచేశా. కానీ ఎందుకో నాకు ఆ లైఫ్‌స్టైల్‌ నచ్చలేదు. అప్పుడే అన్నయ్య ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌, నిర్మాణసంస్థ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. ఏదో ఒకదాని బాధ్యతలు తీసుకుందాం లేదా సొంత స్టార్టప్‌ పెట్టాలనుకున్నా. తర్వాత పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలతో విజయ్‌ ఫామ్‌లోకి వచ్చాడు. కుటుంబం కష్టాలు తీరాయి. నేను ఇండియా తిరిగొచ్చా.

అలా మొదలైంది: ఇక్కడికొచ్చాక కొన్ని నెలలు ఖాళీగానే ఉన్నా. ఆ సమయంలో థియేటర్‌ వర్క్‌షాప్స్‌కు వెళ్లేవాణ్ని. చిన్నప్పుడు స్కూల్‌లో థియేటర్‌ డ్రామాలు వేసేవాణ్ని. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాణ్ని. అలా నాలోనూ ఓ నటుడుండేవాడు. ఆ వర్క్‌షాప్స్‌కు వెళ్లినప్పుడే నేను విజయ్‌ తమ్ముడిననే విషయం సినీ పరిశ్రమలో తెలిసింది. కొందరు కొత్త దర్శకులు అవకాశాలిస్తామన్నారు. కానీ అటువైపు వెళ్లడం రిస్క్‌ అనిపించింది. ఓరోజు నాన్నకి చెప్పా. ‘నాకూ నటనపై ఇష్టం పెరుగుతోంది. కానీ సక్సెస్‌ అవుతానో, లేదో. నేను ఫెయిలైతే కష్టపడి పైకొచ్చిన విజయ్‌ పేరు చెడగొట్టిన వాడినవుతాను’ అన్నా. అప్పుడు ‘అవకాశం వచ్చినప్పుడే ఒడిసిపట్టుకోవాలి. నీమీద నీకు నమ్మకం ఉంటే ధైర్యంగా అడుగెయ్‌. అన్నయ్య గురించి ఆలోచించకు’ అన్నారు నాన్న. ముందుకెళ్లాలనుకున్నా. 

ఎవరికి వారే: నేను పూర్తి క్లారిటీతో వచ్చా. అన్నయ్య చేయి పట్టుకొని, తను ఏం చెబితే అది చేయడం ఇక్కడ కుదరదు. ప్రతి శుక్రవారం ఇక్కడ ఎవరు హీరోనో, ఎవరు జీరోనో తేలిపోతుంది. అందుకే నేను కథను నమ్ముకోవాలనుకున్నా. సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా. విజయ్‌ తమ్ముడిగా పరిశ్రమ నాకు తలుపులు తెరిచింది. నన్ను నేను నిరూపించుకోవాలి. నేను ఏ పని చేసినా విజయ్‌తో పోల్చి చూస్తారని తెలుసు. అయినా ఫర్వాలేదు.. నిజాయతీగా పని చేయాలనుకున్నా.

మొదటి సినిమా: దొరసాని సినిమా అన్న, నాన్న పరిచయాలతో వచ్చింది. ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ ఎంపిక నాదే. ఆ కథ చెప్పినప్పుడు చాలా మంది నిరాశ పరిచారు. ‘మీ అన్నేమో అర్జున్‌రెడ్డిలా చెలరేగిపోతుంటే.. నువ్వేమో బొంబాయి చట్నీ, టిఫిన్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతావా?’ అన్నారు. కానీ ఆ కథలో మధ్యతరగతి కుటుంబాల జీవితం ఉందని నమ్మి చేశా. ప్రేక్షకులకు బాగా నచ్చింది. నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు పుష్పక విమానం నిర్ణయమూ నాదే. 

కాలేజీ మెలోడీస్‌: నేను, అన్నయ్య పుట్టపర్తిలో చదువుకున్నాం. అక్కడ సినిమాలు చూడటం తక్కువ. అశ్లీలత, రొమాన్స్‌ లేని కొన్ని ఇంగ్లిష్‌, హిందీ సినిమాలు ఆదివారం చూపించేవాళ్లు.. అంతే. కాలేజీ రోజుల్లో మాత్రం బాగా ఎంజాయ్‌ చేశా. మా కాలేజీ వెనకాల ఓ రైల్వే ట్రాక్‌ ఉండేది. అక్కడ బైక్‌లు పార్క్‌ చేసి, గోడ దూకి సినిమాలకు వెళ్లేవాళ్లం. ఒక్కోసారి క్లాసులు బంక్‌ కొట్టి ఇరవై, ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉన్న థియేటర్లకు వెళ్లి చూసొచ్చేవాళ్లం.

అమ్మాయిలకు దూరం: చిన్నప్పట్నుంచీ హాస్టళ్లో ఉండి చదువుకోవడంతో  అమ్మాయిలతో అంత చనువు లేదు. హైదరాబాద్‌లో కాలేజీకి రాగానే కో-ఎడ్యుకేషన్‌. పూర్తిగా భిన్న వాతావరణం. అయినా వాళ్లతో మాట్లాడాలంటే జంకు. మాట కలపడానికే మూడేళ్లు పట్టింది. ఇంక ప్రేమ వ్యవహారాలు నడిపే అవకాశం ఎక్కడిది?


తనే బెస్ట్‌..

మా వాయిస్‌, పోలికలు మాత్రమే కాదు.. అభిరుచులూ కొన్ని దగ్గరగా ఉంటాయి. చాలా విషయాల్లో మాత్రం తను నాకన్నా బెస్ట్‌. సినిమాని భిన్న కోణాల్లో విమర్శనాత్మకంగా చూస్తాడు. బాగుంటే మెచ్చుకుంటాడు. లేదంటే మొహం మీద చెప్పేయడమే. తన సినిమానీ నేను ఓ ప్రేక్షకుడి కోణంలోనే చూస్తా. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నానితో కలిసి చేసిన ఎమోషన్‌ సీన్‌ చూసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లొచ్చాయి. అప్పుడే అర్థమైంది మా అన్న మంచి నటుడు అయ్యాడని.


దొరసాని, మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌లో నటన బాగుందని చాలామంది మెచ్చుకున్నారు.


చిరంజీవి, మహేశ్‌ బాబు లంటే ఇష్టం.


జర్సీలో నాని, రంగస్థలంలో రామ్‌చరణ్‌, పుష్పలో బన్నీ, లైగర్‌లో విజయ్‌.. నచ్చిన పాత్రలు.


విజయ్‌ తమ్ముడినని గర్వంగా చెప్పుకుంటా. కానీ తనని అనుకరించను.


సుకుమార్‌ దర్శకత్వంలో చేయాలని ఉంది.


భక్తి ఎక్కువే. అమ్మతో కలిసి పూజలు చేస్తా.


ఆటలంటే ఇష్టం. ఫుట్‌బాల్‌, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ ఆడతా.


తీరిక దొరికితే స్కూల్‌ ఫ్రెండ్స్‌తో కలిసి దూరప్రయాణాలు చేస్తా.

- సతీశ్‌ దండవేణి, ఈటీవీ హైదరాబాద్‌


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని