Updated : 03 Dec 2022 05:57 IST

గగనాన్ని చుంబించేలా..ఘనమైన విజయాలు

కఠిన సవాళ్లని ‘రాకెట్‌ సైన్స్‌’తో పోల్చుతుంటారు. వాటిని ఛేదించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే ఉద్దేశంతో! కానీ.. ఆసక్తి ఉండాలేగానీ ఆ రాకెట్‌ సైన్స్‌నీ గుప్పిట బంధించడం తేలికే అని నిరూపించారు కొందరు యువ తరంగాలు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ప్రఖ్యాత సంస్థలకే సాధ్యం అనదగ్గ ఉపగ్రహాలు, రాకెట్‌ల తయారీ, ప్రయోగాలను మేమూ చేయగలం అని నిరూపించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి మార్గదర్శకులుగా నిలిచారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఆ అంకుర సంస్థలు ‘స్కైరూట్‌’, ‘ధృవ స్పేస్‌’ వ్యవస్థాపకులతో మాట కలిపింది ఈతరం.


నాలుగైదేళ్లుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పేస్‌ టెక్నాలజీని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. గడిచిన అరవై ఏళ్లలో పదకొండు వేల ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్తే.. వచ్చే పదేళ్లలోనే లక్ష శాటిలైట్లు నింగిలోకి ఎగరనున్నాయంటే.. ఈ రంగంలో ఉన్న అవకాశాలు అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఎంతో నైపుణ్యం ఉన్న ఎకో సిస్టమ్‌ ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకునే సృజనాత్మక యువతకు ఎదగడానికి ఆకాశమే హద్దు’.

కళాశాల కల

కాలేజీలో మొదలైన ఆలోచన ఓ కుర్రాడిని కుదురుగా ఉండనీయలేదు. లక్షల జీతాన్ని వదిలేలా చేసింది. స్పేస్‌ టెక్నాలజీ అంకురానికి పురికొల్పింది. ఆ సంస్థే ధృవ స్పేస్‌. ఈమధ్యే రెండు బుల్లి ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోని అన్ని విభాగాల్లోనూ దూసుకెళ్తూ.. ‘నేషనల్‌ స్టార్టప్‌ అవార్డు’ అందుకుంది. జాతీయ స్థాయిలో ‘క్వాల్‌కామ్‌ డిజైన్‌ ఇన్‌ ఇండియా ఛాలెంజ్‌’ గెలిచింది. వ్యవస్థాపకులు సంజయ్‌ నెక్కంటి, కృష్ణతేజ పెనమకూరు, అభయ్‌ ఎగూర్‌, చైతన్యదొర సూరపురెడ్డిలు.

ధృవ స్పేస్‌.. ఉపగ్రహాల తయారీ, లాంచింగ్‌, గ్రౌండ్‌స్టేషన్లలో కీలకమైన శాటిలైట్‌ ప్లాట్‌ఫామ్స్‌, డిప్లాయర్ల తయారీ.. సాఫ్ట్‌వేర్‌ల రూపకల్పన చేస్తున్న అంకురసంస్థ. భారత సైన్యం, భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సహా పలు విదేశీ సంస్థలకూ ఉత్పత్తులు అందిస్తోంది. ‘ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. దీని వెనకాల మూడేళ్ల కష్టం ఉంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటూ ఉపగ్రహ ప్రయోగ విజయం వెనక ఉన్న ఇబ్బందులు వివరిస్తున్నారు వ్యవస్థాపకులు. ‘ఒక పరీక్ష పాస్‌ అయ్యామని తెలిసినప్పుడే సంతోషం కలుగుతుంది. కానీ విజయంలోని ప్రతి దశా మాకు పండగే. శ్రీహరికోటలో నాలుగు రోజులు కష్టపడి ఉపగ్రహం బిగించినప్పుడు.. పదిరోజులయ్యాక లాంచ్‌ చేసినప్పుడు.. రెండ్రోజులు పరీక్షించి, అది పూర్తిస్థాయిలో పని చేస్తుందని తేలిన సమయం... ఇలా ప్రతి సందర్భంలోనూ మేం గాల్లో తేలిపోతూనే ఉన్నాం’ అంటున్నారు విజయోత్సాహంతో. వీళ్లు నలుగురూ ఉన్నత విద్యావంతులే. విదేశాల్లో చదువుకొని ఉద్యోగాలు చేసినవాళ్లే. లక్షల్లో జీతం వస్తున్నా.. అంతరిక్షాన్ని అందుకోవాలనే ఆలోచనే అందరినీ ఒక్కటి చేసింది. సంజయ్‌ ఓసారి బీటెక్‌లో ఉన్నప్పుడు ఒక శాటిలైట్‌ ప్రాజెక్టుపై పని చేశాడు. అప్పుడే ఈ రంగంపై ఇష్టం పెంచుకున్నాడు. ఇందులో అపారమైన అవకాశాలు ఉన్నాయని గ్రహించాడు. మిగతా వాళ్లదీ అదే ఆలోచన. ఏళ్లుగా కూడబెట్టిన డబ్బులతో స్టార్టప్‌ ప్రారంభించారు. ఒక్కో అవాంతరాన్నీ దాటుకుంటూ ముందుకెళ్లారు. ‘ఉపగ్రహాలకు బిగించే సౌరపలకలు తయారు చేసే అతి తక్కువ సంస్థల్లో మాదొకటి. కేజీ నుంచి 300 కేజీల వరకు బరువుండే ఉపగ్రహాలు తయారు చేసే సామర్థ్యం మాకుంది. మేం తయారు చేసిన డిప్లాయర్‌లకు అమెరికా, యూరోప్‌ దేశాల ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి తీసుకెళ్లగలిగే సత్తా ఉంది’ అంటున్నారు కృష్ణతేజ, సంజయ్‌లు. నలుగురితో మొదలైన ధృవ స్పేస్‌లో ప్రస్తుతం ఉద్యోగులు, సలహాదారులు అంతా కలిపి దాదాపు అరవైమంది పని చేస్తున్నారు. రెండేళ్లలో వంద వరకు బుల్లి ఉపగ్రహాలు ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు.      

 వాణి బుద్ధవరపు, ఈటీవీ


అనుకోని వరంలా..

అందిపుచ్చుకోవాలేగానీ అంతరిక్ష రంగంలో ఆకాశాన్నంటే అవకాశాలు. అదే పవన్‌కుమార్‌ చందన, నాగభరత్‌ డాకాలలో నమ్మకాన్ని ప్రోది చేసింది. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అంకుర సంస్థ ప్రారంభించేలా చేసింది. నాలుగేళ్లయ్యాక ఆ స్టార్టప్‌ పేరు మార్మోగిపోతోంది.
భూ గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు, ఉపగ్రహాలను మచిలీపట్నం యువకుడు పవన్‌ చిన్నప్పట్నుంచీ అబ్బురంగా చూసేవాడు. ఆ ఉత్సుకత, ఆసక్తి రోజురోజుకీ పెరుగుతుండేది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి పట్టా అందుకోగానే తిరువనంతపురంలోని విక్రమ్‌సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో ఆరేళ్లపాటు శాస్త్రవేత్తగా పనిచేశాడు. అప్పుడే రాకెట్‌ పనితీరుపై పట్టు సాధించాడు. ఇస్రోలో రాకెట్ల అభివృద్ధి, అనుసంధానం, ప్రయోగం ఇష్టంగా చూసేవాడు. స్నేహితుడు, ఒంగోలు వాసి నాగభరత్‌కి సైతం ఈ విషయాలపై ఆసక్తి ఎక్కువే. తనూ ఐఐటీయనే. ఇద్దరూ కలిసి 2018లో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ను ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీతో, తక్కువ ఖర్చయ్యేలా.. మంచి నమ్మకమైన ఉపగ్రహ వాహక నౌకలను అభివృద్ధి చేయాలనుకున్నారు. కానీ రాకెట్లు, ఉపగ్రహాల టెక్నాలజీ చాలా క్లిష్టమైన, అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మొదట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అదృష్టవశాత్తు 2020లో ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతి ఇవ్వగానే కొందరు యువ పారిశ్రామికవేత్తలను ఒప్పించి అందులో భాగస్వాములు అయ్యేలా చేశారు. నాలుగేళ్లలో రూ.526కోట్ల పెట్టుబడులు రప్పించారు. ఇదొక రికార్డు. పెట్టుబడి సమస్య తీరిన తర్వాత రాకెట్‌ తయారీపై దృష్టి పెట్టి ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇస్రోలోని శాస్త్రవేత్తల అనుభవం, నైపుణ్యం, సౌకర్యాలు ఉపయోగించుకోవడానికి అవకాశం దొరకడంతో.. రెండేళ్లు కష్టపడి విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ తయారు చేశారు. మొదటి ప్రయోగానికి ‘ప్రారంభ’ అనే పేరు పెట్టారు నవంబరు 18న శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఓ ప్రైవేటు సంస్థ రాకెట్‌ అభివృద్ధి చేసి, నింగిలోకి విజయవంతంగా పంపడం అరుదైన విషయం. ఈ విజయంతో మిత్రులిద్దరికీ దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇదే ఉత్సాహంతో క్రయోజినిక్‌ ఇంజిన్‌ను సైతం అభివృద్ధి చేస్తామంటున్నారు. వచ్చే ఏడాది విక్రమ్‌-1 ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

 కల్లిపూడి దేవేంద్రరెడ్డి, శ్రీహరికోట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని