సమస్యల నుంచి సాధకులుగా!

సమస్యలు చికాకు తెప్పించడమే కాదు.. ఒక్కోసారి అందలం ఎక్కించే ఆలోచనలనూ పురికొల్పుతాయి! ఇక్కట్లు.. ఇబ్బంది పెట్టడమే కాదు.. సరికొత్త ఆవిష్కరణలు చేసే కసినీ పెంచుతాయి!!

Updated : 29 Jul 2023 02:15 IST

సమస్యలు చికాకు తెప్పించడమే కాదు.. ఒక్కోసారి అందలం ఎక్కించే ఆలోచనలనూ పురికొల్పుతాయి! ఇక్కట్లు.. ఇబ్బంది పెట్టడమే కాదు.. సరికొత్త ఆవిష్కరణలు చేసే కసినీ పెంచుతాయి!! సెల్‌ఫోన్‌ సేవల్లో అలక్ష్యానికి గురైన కరీంనగర్‌ కుర్రాడు రోహిత్‌.. వినియోగదారులు, సంస్థల మధ్య వారధిలా ఉండే ‘వారెంటిమీ’ సంస్థ ప్రారంభించాడు. వరదల్లో కుటుంబం అతలాకుతలం అయితే అలాంటి బాధితుల్ని ఆదుకునేలా ‘రెస్క్యూ రేంజర్‌’ రూపొందించాడు అనూప్‌. ఆ ప్రతిభకు అవార్డులందాయి. లక్షల రూపాయల ప్రోత్సాహం దక్కింది. ఆ ఇద్దరి స్ఫూర్తిదాయక ప్రస్థానమిది..

ఇద్దరి మధ్యా వారధి

చెట్ల రోహిత్‌ ఓసారి ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌ కొన్నాడు. పగిలిపోయిన మొబైల్ఫ్‌ోన్‌ వచ్చింది. కస్టమర్‌ కేర్‌, సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు ఇబ్బంది పెట్టారే తప్ప, సమస్యను పరిష్కరించలేదు. వస్తువు కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుడి పట్ల చూపిన శ్రద్ధ సేవలు అందించడంలో లేదని అర్థమైంది. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేలా.. సంస్థ, వినియోగదారుడి మధ్య వారధిలా పని చేసే ‘వారెంటిమీ’ ప్రారంభించాడు. దానికి ఇండియన్‌ అఛీవర్స్‌ అవార్డూ అందుకున్నాడు.

ఈ చేదు అనుభవం రోహిత్‌కి బీటెక్‌లో ఎదురైంది. ఇలాంటప్పుడే తక్షణం సేవలు అందించేలా.. కొనుగోలుదారులు, సంస్థల మధ్య ఒక మధ్యవర్తి ఉంటే బాగుంటుంది కదా ఆలోచన వచ్చింది. నేనే ఆ స్టార్టప్‌ ఎందుకు ప్రారంభించకూడదు? అనుకున్నాడు. కొందరు సన్నిహితులతో చెబితే ‘హాయిగా చదువుకోకుండా ఎందుకీ రిస్క్‌’ అన్నారు. అమ్మ మాత్రం ప్రోత్సహించారు. మూడేళ్లు కష్టపడి 2021లో ‘వారెంటిమీ’ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాడు. ఇది ప్రస్తుతం హైదరాబాద్‌, ఖమ్మం, దిల్లీ, హరియాణా, చెన్నై, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో సేవలందిస్తోంది. త్వరలోనే దేశంలోని ఇతర నగరాలకు, అమెరికాలోనూ విస్తరించే ఆలోచనలో ఉన్నానంటున్నాడు రోహిత్‌.

ఎలా పని చేస్తుంది?: వారెంటిమీ.. దేశంలోనే ఈ తరహా సేవలందించే తొలి స్టార్టప్‌. వినియోగదారులు వివిధ దుకాణాలు, ఈ-వెబ్‌సైట్లలో గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు కొనుగోలు చేసిన తర్వాత వాటి బిల్లులు, వారెంటీ కార్డులు ఈ వెబ్‌సైట్‌, యాప్‌లో నమోదు చేసుకుంటే చాలు. వస్తువు పాడైనప్పుడు, వారెంటీకి సంబంధించి బిల్లులు అవసరం లేకుండానే ఆ యాప్‌లోకి వెళ్లి ఆప్షన్లను ఎంచుకొని బటన్‌ క్లిక్‌ చేయాలి. చరవాణి కొనుగోలు చేస్తే అది చెడిపోయిన సందర్భంలో ఆ యాప్‌లోకి వెళ్లి క్లెయిమ్‌ బటన్‌ నొక్కితే.. సమాచారం స్టార్టప్‌ నిర్వాహకులు, సర్వీసు సెంటర్లకు చేరుతుంది. సంబంధిత సర్వీస్‌ సెంటర్‌ వాళ్లే వచ్చి ఆ వస్తువులను బాగు చేస్తారు. వినియోగదారుల నుంచి కాకుండా నిర్వాహకుల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు. ఇలా చేయడానికి దేశవ్యాప్తంగా 200లకు పైగా ప్రముఖ షాపింగ్‌మాల్స్‌, ఈ-పోర్టళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో నమోదు చేయడం వల్ల వినియోగదారుడికి అనవసర వ్యయప్రయాసలు తప్పుతాయి. సమయం కలిసొస్తుంది అంటాడు రోహిత్‌.

అఛీవర్‌గా..: ఈ స్టార్టప్‌.. సృజనాత్మకంగా, వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండటంతో ‘రిటైలర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ వారెంటిమీకి టాప్‌ రేటింగ్‌ ఇచ్చింది. టైకాన్‌-2020 ప్రపంచస్థాయి అంకుర సంస్థల సదస్సులో ఈ సంస్థ బిజినెస్‌ మోడల్‌, కాన్సెప్ట్‌ గురించి వివరించాడు రోహిత్‌. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకి 25 స్టార్టప్‌లే అర్హత సాధించాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ కింద రూ.40 లక్షల గ్రాంట్‌ మంజూరు చేసింది. ఈమధ్యే ఇండియన్‌ అఛీవర్స్‌ ఫోరం ‘ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు గెల్చుకున్నాడు రోహిత్‌. ఇలా స్టార్టప్‌ని పరుగులు పెట్టిస్తూనే.. ‘యూ ఆర్‌ ఏ జీరో’ అనే పుస్తకాన్నీ రాశాడు. అందులో యువత ఎదుర్కొనే సమస్యలు, ఆలోచనలు, లక్ష్య సాధన మార్గాలు ఇతివృత్తంగా తీసుకున్నాడు.
తన్నీరు శ్రీనివాసరావు, కరీంనగర్‌


వరదల్లో ప్రాణాలు కాపాడేలా..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. జనం నానా అవస్థలు పడుతున్నారు. 2018లోనూ కేరళ ఇలాగే అతలాకుతలమైంది. ఆ సమయంలో కొచ్చి యువకుడు అనూప్‌ కుటుంబం, బంధువులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అలాంటి క్లిష్ట సమయాల్లో జనాలను ఆదుకునేలా ‘రెస్క్యూ రేంజర్‌’ అనే పరికరాన్ని తయారు చేశాడు తను.

ఆనాటి కేరళ వరదల్లో కనీవినీ ఎరగని నష్టం సంభవించింది. అప్పుడు రాష్ట్ర డ్రోన్స్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న అనూప్‌ని సాయం కోరింది ప్రభుత్వం. అప్పటికే ఒక డ్రోన్‌ కంపెనీ నిర్వహిస్తున్న అనూప్‌ బాధితుల్ని రక్షించడానికి 800 డ్రోన్లని రంగంలోకి దించాడు. ఆ సమయంలో దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు చూశాడు. నీళ్లలో తేలియాడుతున్న శవాలు.. వరదలో చిక్కుకుపోయిన మనుషులు.. అపార ఆస్తి నష్టం.. ఇవన్నీ చూసి చలించిపోయాడు. వీటన్నింటికీ పరిష్కారం చూపేలా.. తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ముఖ్యంగా ఆ సమయంలో తక్షణ సాయం అందక నష్టం తీవ్రత పెరిగిపోవడం గమనించాడు. ఇది తగ్గించేలా ఒక బోటులాంటి పరికరం రూపొందించాలనుకున్నాడు. స్నేహితుడు అఖిల్‌తో కలిసి ‘డెక్స్‌టర్‌ ఇన్నోవేషన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ప్రారంభించాడు. నాలుగేళ్లు కష్టపడి యూ ఆకారంలో ‘రెస్క్యూ రేంజర్‌’ తయారు చేశారు.

ఏం చేస్తుందిది?: ఈ బోటు నీటిలో శవాలను గుర్తిస్తుంది. నీటి అడుగున ఉండే నేల రకాలేంటో చెబుతుంది. లోతు, ఫ్లో వివరాలు అందిస్తుంది. వరదలో చిక్కుకున్న బాధితుల దగ్గరకు వేగంగా చేరుకొని వాళ్లను బోటులోకి ఎక్కిస్తుంది. దీనికి అమర్చిన కెమెరా 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ నీటి లోతు, నేల స్వభావం తెలియజేస్తుంది. చీకట్లోనూ పని చేయడానికి వీలుగా ఫ్లాష్‌లైట్లు అమర్చారు. ఇందులో ఉండే వాకీటాకీలు ఐదు కిలోమీటర్ల వరకూ పని చేస్తాయి. బాధితులకు ఆహార పొట్లాలు, ఇతర సామాగ్రి అందించేలా వందల కిలోలను బరువు మోసేలా దృఢంగా రూపొందించారు.

కష్టకాలంలో సమర్థంగా పని చేస్తున్న ఈ రెస్క్యూ రేంజర్‌ తయారీకి మిత్రులిద్దరూ నాలుగేళ్లు కష్టపడ్డారు. మొదట్లో రెండు మోటార్లతో నడిపించాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో నాలుగుకి పెంచారు. దాన్ని కన్నూర్‌లోని పజాసీ రిజర్వాయర్‌లో విజయవంతంగా పరీక్షించారు. జనాలకు మేలు చేసేలా ఉన్న ఈ ప్రాజెక్టు రూపకల్పనకు కేరళ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసింది. ‘దేశంలో ప్రతి ఏడాదీ ఏదో ఒక చోట వరదలు వస్తూనే ఉన్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. వాటిని తగ్గించే ఉద్దేశంతోనే రెస్క్యూ రేంజర్‌ తయారు చేశాం. ఎవరైనా పెట్టుబడి పెడితే వీటిని పెద్దఎత్తున తయారు చేస్తాం. లాభాపేక్ష కన్నా.. ప్రాణాలు కాపాడటమే మాకు ముఖ్యం’ అంటున్నారు మిత్రులిద్దరూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని