నితిన్‌ గడ్కరీ బాటకి.. బాసటగా..

‘గ్రీన్‌ హైడ్రోజన్‌ అందుబాటులోకి వస్తే భారత్‌లో రూ.15లకే లీటరు పెట్రోల్‌ సాధ్యం. ఇది నా కల’ అంటూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఈమధ్యే చెప్పిన మాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులూ వేస్తోంది.

Updated : 14 Oct 2023 07:52 IST

‘గ్రీన్‌ హైడ్రోజన్‌ అందుబాటులోకి వస్తే భారత్‌లో రూ.15లకే లీటరు పెట్రోల్‌ సాధ్యం. ఇది నా కల’ అంటూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఈమధ్యే చెప్పిన మాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులూ వేస్తోంది. అయితే దీని వాడకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటారు నిపుణులు. ముఖ్యంగా ఈ ఇంధనం లీకైనప్పుడు ప్రమాదం అధికంగా ఉంటుంది. ఆ తీవ్రత తగ్గించడానికి ఓ పరికరం రూపొందించారు టి.నానీ, కృష్ణవేణిలు. దానికి పేటెంట్‌ కూడా దక్కించుకున్నారు.

కాకినాడ, విజయనగరానికి చెందిన టి.నానీ, కృష్ణవేణిలు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్ర విభాగంలో పరిశోధనా స్కాలర్లు. విశాఖ నగరంలో వాహనాలు, పరిశ్రమల నుంచి విపరీతంగా వెలువడే కాలుష్యాన్ని ప్రత్యక్షంగా చూడటంతో.. దాన్ని తగ్గించే అంశాలపై పరిశోధన చేయాలనుకున్నారు. ఇదే సమయంలో కేంద్రం గ్రీన్‌ హైడ్రోజన్‌ బాట పట్టడంతో.. అటువైపు దృష్టి సారించారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ను క్లీన్‌ ఎనర్జీ అంటారు. సోలార్‌ పవర్‌లాంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లుగా విభజించి దీన్ని ఉత్పత్తి చేస్తారు. చాలా దేశాల్లో హైడ్రోజన్‌తో నడిచే ఇంజిన్లు తయారు చేసినా, ఆశించిన స్థాయిలో వాహనాలు వినియోగంలోకి రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఈ ఇంధనం లీకైతే నష్ట తీవ్రత అధికమవడం. ఈ ప్రమాదాన్ని పసిగట్టేలా మిత్ర ద్వయం ఒక పరికరాన్ని రూపొందించింది.

రూ.200లకే..

హైడ్రోజన్‌ గ్యాస్‌కు రంగు, రూపం, రుచి, వాసన ఉండవు. గ్యాస్‌ లీకైనప్పుడు వచ్చే మంట సైతం కంటికి కనిపించదు. దాంతో పక్కనున్న వస్తువు కాలిపోతుంది. వాహనం తగలబడిపోతుంది. ఈ కనిపించని మంటను గుర్తించి, వెంటనే అప్రమత్తం చేసేదే.. సెన్సర్లతో కూడిన పరికరం. సాధారణంగా హైడ్రోజన్‌ ఇంధనాన్ని ఉపయోగించే పరిశ్రమలు, వాహనాల్లో గ్యాస్‌ తీవ్రతను తెలియజేయడానికి పల్లాడియం, ప్లాటినంలాంటి ఖరీదైన లోహాలు ఉపయోగిస్తారు. వీటితో ఒక సెన్సర్‌ తయారీకి రూ.6వేల వరకు ఖర్చవుతుంది. పైగా వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా పాలీ వినైల్‌ ఆల్కహాల్‌ (పీవీఏ)ను సమర్థంగా ఉపయోగించవచ్చని పరిశోధనల ద్వారా గ్రహించారు నానీ, కృష్ణవేణిలు. పీవీఏ ద్రావణం, ఇంటర్‌ డిజిటేటెడ్‌ ఎలక్ట్రోడ్‌ను ఉపయోగించి సెన్సర్లు తయారు చేశారు. వీటిని చిన్న పరికరంలో బిగించి ఇంధన ట్యాంకు పక్కన అమర్చుతారు. లీకేజీ అయితే అది వెంటనే గ్రహించి అప్రమత్తం చేస్తుంది. పీవీఏ.. నాన్‌ టాక్సిక్‌, బయో డీగ్రేడబుల్‌, తక్కువ ధర కావడంతో కేవలం రూ.200లతో సెన్సర్‌ తయారైంది. ‘ఇది వంద శాతం కచ్చితత్వంతో పని చేస్తుంది. ప్రాథమిక సెన్సింగ్‌ మూలకం లోహం లేనిది కాబట్టి పర్యావరణ అనుకూలం కూడా’ అంటున్నారు ఇద్దరు. ఈ సరికొత్త ఆవిష్కరణపై పేటెంట్‌ కూడా దక్కించుకున్నారు. అయితే ఈ విజయం రోజుకి పది నుంచి పన్నెండు గంటల చొప్పున నాలుగు నెలలు కష్టపడితేనే దక్కిందంటున్నారు. ప్రొఫెసర్లు హనుమంతు పురుషోత్తం, కె.సురేష్‌బాబుల సహకారంతో సాధ్యమైందని చెబుతున్నారు నానీ, కృష్ణవేణిలు.

యడ్లపాటి బసవ సురేంద్ర, విశాఖపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని