హరీశ్‌.. మనసున్న డాక్టర్‌!

డాక్టరు పట్టా చేతికందితే లక్షల సంపాదనకి లైసెన్స్‌ దొరికినట్టే అని భావిస్తారు చాలామంది! ఏ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరినా ఐదారు అంకెల్లో జీతం ఖాయం. కానీ దీనికి భిన్నంగా ‘వైద్యో నారాయణ

Updated : 04 Dec 2021 05:24 IST

డాక్టరు పట్టా చేతికందితే లక్షల సంపాదనకి లైసెన్స్‌ దొరికినట్టే అని భావిస్తారు చాలామంది! ఏ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరినా ఐదారు అంకెల్లో జీతం ఖాయం. కానీ దీనికి భిన్నంగా ‘వైద్యో నారాయణ హరి:’ అన్న మాటల్ని నిజం చేయాలనుకున్నాడు బొర్రా హరీశ్‌. దానికోసం నగరాన్ని వదిలి, పల్లెబాట పట్టాడు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నాడు.

హరీశ్‌ది హైదరాబాద్‌. చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. చిరు వ్యాపారమే కుటుంబానికి ఆధారం. కష్టపడి చదివేవాడు. 2015లో గాంధీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తైంది. మంచి జీతంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అయినా ఏదో అసంతృప్తి. ఓసారి సోదరుడు, తల్లితోపాటు విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శోధన చారిటబుల్‌ ట్రస్టుకు వచ్చాడు. నాలుగు రోజులున్నాడు. ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగా నచ్చాయి. తను వెతుకుతున్న గమ్యస్థానం ఇదేననిపించింది. అక్కడే ఉండి పేదలకు సేవలందించాలనే నిర్ణయానికొచ్చాడు.

పల్లెబాట..

2016 నుంచి ట్రస్టు ఆధ్వర్యంలో చీపురుపల్లి, గరివిడి మండలాల్లోని గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాడు. గ్రామీణులకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో సాయంత్రాలు స్థానిక పాఠశాలలు, దేవాలయాల్లో వీటిని ఏర్పాటు చేయిస్తున్నాడు. రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి ఇండియన్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ సంస్థ సహకారంతో ఉచితంగా మందులు అందిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాడు. ఉచిత పరీక్షలు, మందులివ్వడమే కాదు.. అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా ఆరోగ్య కార్యకర్తలను నియమించుకొని రోగులు సమయానికి మందులు వేసుకుంటున్నారా? లేదా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు ఆరా తీస్తాడు హరీశ్‌. కేవలం 16 రకాల మందులతో 90 శాతం చిన్నచిన్న వ్యాధులు నయం చేసేలా ఆ కార్యకర్తలకు శిక్షణనిచ్చాడు. ఇలా ఏడాదికి దాదాపు నాలుగు వేల మందికి ఉచితంగా సేవలందిస్తూ యువ వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ చాలామంది బాధితులకు అండగా నిలిచాడు. ఏ సమయంలో, ఎవరు ఫోన్‌ చేసినా స్పందించి ఎలాంటి మందులు వాడాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నాడు. కొవిడ్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలేంటో వివరిస్తూ ప్లకార్డుల ప్రదర్శన చేశాడు.

- కె.మునీందర్‌, ఈనాడు, విజయనగరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని