Published : 23 Jan 2021 01:24 IST

ఆరాధిస్తే.. ఆడుకున్నాడు!

ఆనంద్‌ నాకన్నా సీనియర్‌. అందగాడు, టాలెంటెడ్‌. ఆఫీసులో అమ్మాయిల కలల రాకుమారుడు. చాలామందిలాగే నాకూ తనంటే ఇష్టం. అతడి ప్రతి కదలికను ఆరాధించేదాన్ని. కానీ మొహమాటం, సిగ్గుతో ముందుకెళ్లేదాన్ని కాదు.
బాగా ఆలోచించాక ఎఫ్‌బీలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టా. మూడ్రోజులకు నా కల ఫలించింది. ‘హే.. హాయ్‌.. మీ ప్రొఫైల్‌ చూశా. మీరూ మా ఆఫీసేనా?’ నెలయ్యాక మెసేజ్‌ చేశాడు. నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. నాలుగైదుసార్లు చాట్లాటలయ్యాక ఫోన్‌ నెంబర్‌ అడిగాడు. నాక్కావల్సిందీ అదే. ఫేస్‌బుక్‌ నుంచి వాట్సాప్‌కి మారాం. కబుర్లతో రాత్రీపగళ్లూ కరిగిపోయేవి. అతడు నాపై చూపించే అభిమానం కట్టిపడేసేది. నా మనసులో మాట చెప్పే సమయం కోసం ఎదురుచూస్తుండగా ‘ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు’ అంటూ బాంబు పేల్చాడోరోజు. గుండెలదిరిపోయాయి. ‘కానీ.. నాక్కాబోయే అర్ధాంగి నువ్వే ఎందుకు కాకూడదు? ఓసారి కలుద్దామా?’ అన్నాడు. నా పాదాలు భూమ్మీద నిలవలేదు.
ఓ రెస్టరెంట్‌లో కలుసుకున్నాం. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నాం. ‘చిన్న రిక్వెస్ట్‌.. మా తమ్ముడు ఆర్నెళ్లయ్యాక యూఎస్‌ నుంచి వస్తాడు. అప్పటిదాకా ఆగగలవా?’ అనడిగాను. నీకోసం జీవితాంతం ఎదురుచూస్తానని భరోసా ఇచ్చాడు. బయట కలుసుకోవడాలు ఎక్కువైంది. ఓరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నా.. తనొచ్చాడు. కాసేపు కబుర్లయ్యాక అమాంతం కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. ‘ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా. ముందుకెళ్దామా?’ అన్నాడు. నేనూ అడ్డు చెప్పలేదు. ఇది జరిగాక అప్పుడప్పుడు మళ్లీ కావాలనేవాడు. ‘నో’ చెప్పేదాన్ని. ఆ తర్వాత నేను ఊహించని పరిణామాలు మొదలయ్యాయి. మెల్లమెల్లగా నన్ను దూరం పెట్టసాగాడు. ఫోన్లు తగ్గాయి. ఆఫీసులో కనిపిస్తే మొహం తిప్పుకునేవాడు. కొన్నాళ్లు చూసి గట్టిగానే అడిగా. ‘ఇంట్లో త్వరగా పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తెస్తున్నారు. ఆర్నెల్లు ఆగేలా లేరు’ అంటూ నీళ్లు నమిలాడు. నాలో టెన్షన్‌ మొదలైంది. వెంటనే తమ్ముడికి ఫోన్‌ చేశా. రమ్మని బతిమాలా. నెలరోజుల్లో వస్తానన్నాడు. ఈ శుభవార్త చెబుదామంటే ఫోన్‌ తీయలేదు. తర్వాత రెండ్రోజులు ఆఫీసుకే రాలేదు. కంగారు ఎక్కువైంది. మూడోరోజు వచ్చాడు. ‘సారీ డియర్‌.. ఎంత బతిమాలినా మావాళ్లు ఒప్పుకోలేదు. వాళ్ల ఒత్తిడితో మొన్ననే వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నా’ అన్నాడు. నా గుండె ముక్కలైంది. ఎంత దగా? మా తమ్ముడి విషయం చెబితే అంత త్వరగా వస్తాడనుకోలేదన్నాడు. నన్ను వదిలించుకోవడానికే తనలా చేశాడని అర్థమైంది. అలాంటి వ్యక్తిని అంతలా ఆరాధించినందుకు నామీద నాకే అసహ్యం వేసింది. అతణ్ని నలుగురిలో నిలబెట్టాలనుకున్నా.. కానీ బాగా ఆలోచించాక అలాంటి మోసగాడు నా జీవితంలోకి రాకపోవడమే మంచిదనిపించింది. జరిగింది ఒక పీడకలలా భావించి అంతా మర్చిపోవాలనుకుంటున్నా. అమ్మాయిలూ.. నా అనుభవంతో చెబుతున్నా.. వ్యక్తి ప్రవర్తన, అందం, తెలివితేటలు చూసి ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు.

- రష్మీ (పేర్లు మార్చాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని