Janasena: హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రజల్లో ధైర్యం నింపింది: నాదెండ్ల మనోహర్‌

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ తీర్పు

Updated : 03 Mar 2022 17:31 IST

అమరావతి: రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపిందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పునాదులు వేసి, అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన సమయంలో హైకోర్టు తీర్పుతో ప్రజలకు ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో జరగాల్సిన పరిపాలన సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నిరంకుశ ధోరణిలో సాగుతోందని ఆక్షేపించారు. సీఎం జగన్ వెంటనే అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

‘‘రాజధానిపై సీఎం జగన్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.  అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు వచ్చేవి. రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేకుండా చేశారు. ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందనే విధంగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కించపరిచే విధంగా, మహిళలను అవమానపరిచే విధంగా సీఎం జగన్‌ పాలన సాగింది. ప్రజలు, రైతుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తే ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కంచెలు వేసి లాఠీఛార్జ్ చేసే పరిస్థితిని తీసుకువచ్చారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ అండగా నిలబడింది. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది. న్యాయం నిలబడుతుందన్న నమ్మకంతో 807 రోజుల నుంచి రైతులు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా కష్టాలుపడ్డారు. వారికి ధైర్యం నింపేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు.  అంతిమంగా న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వారు విజయం సాధిస్తారు. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రాంతం నుంచి వెనక్కి పంపేందుకు అంతా సిద్ధంగా ఉండాలి’’ అని నాదెండ్ల పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని