Pawan Kalyan: కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధి: పవన్‌ కల్యాణ్‌

వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్‌ ఇవాళ

Updated : 12 Apr 2022 19:00 IST

అనంతపురం: వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్‌ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందజేసిన తర్వాత మన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పవన్‌ మాట్లాడారు.

‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అనేక బాధలు పడుతున్నారు. కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు. వారి కష్టం కళ్లారా చూశా. మరో దారి లేకపోతేనే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే. ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుంది. రైతు కష్టం తెలుసుగనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నా. కౌలు రైతుల కష్టాలను పంచుకుంటాం. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల బాధ్యత తీసుకుంటాం. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాం. పరామర్శకు వస్తున్నానని తెలిసి రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నారు. రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. వారి బాధ్యత తీసుకుంటాం. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టి ఏడుస్తుంటే... ఏసీ గదుల్లో కూర్చుని బతకాలంటే చాలా తప్పు చేసినట్టు అవుతుంది. చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి ప్రభుత్వంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదు. ఇప్పుడే.. ఈ క్షణమే ఏర్పాటు చేస్తున్నాం. సంక్షేమ నిధిలో సగం డబ్బు నేనిస్తాను, మిగిలిన సగం మా పార్టీ నేతలు ఇస్తామని మాట ఇచ్చారు.

కౌలు రైతుల ఆత్మహత్యలను రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు తొలుత మా దృష్టికి తీసుకొచ్చారు. ఎంతమంది చనిపోయారని మేం ఆర్టీఐ ద్వారా ఒక నివేదిక తెప్పించుకున్నాం. జనసేన కార్యకర్తల ద్వారా పూర్తి వివరాలు సేకరించాం. వీటన్నింటినీ క్రోడీకరించాం. ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులు ఎంతమంది చనిపోయారు అంటే.. ఆ జాబితా జనసేన వద్ద ఉంది. ప్రభుత్వం వద్ద కూడా లేదు. అధికారంలోకి వస్తే మీ కన్నీరు తుడుస్తాం. నన్ను సీబీఎన్‌ దత్తపుత్రుడు అంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడు అంటాం. వైకాపా నాయకులు చాలా మందిని సీబీఐ ప్రేమగా దత్తత తీసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేం ఎవరికీ బీ టీమ్‌ కాదు.. ఇంకోసారి అలా అంటే చర్లపల్లి షటిల్‌ టీమ్‌ అనాల్సి వస్తుంది. నేను ఎవరికీ భయపడను. నాకు స్వార్థం లేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని