వేయిపూలు వికసించనీ...

పరమాత్మ సృష్టి చాలా విచిత్రమైంది. సముద్రాలు, నదులు, పర్వతాలు, పచ్చని చెట్టు చేమలతో అనంత వైవిధ్యంతో అందమైన సృష్టి. కోట్ల జీవరాశులు. విభిన్న గుణాలు కలిగిన జంతుజాలం.

Published : 06 Feb 2023 00:20 IST

రమాత్మ సృష్టి చాలా విచిత్రమైంది. సముద్రాలు, నదులు, పర్వతాలు, పచ్చని చెట్టు చేమలతో అనంత వైవిధ్యంతో అందమైన సృష్టి. కోట్ల జీవరాశులు. విభిన్న గుణాలు కలిగిన జంతుజాలం. మనిషికి హాని చేసేవేగాక మేలు చేసే జంతువులు, కీటకాలు. ఆకాశంలో విహరిస్తూ చెట్లపై నివసిస్తూ భిన్న స్వరాలు వినిపించే పక్షులు. చిన్న గడ్డిపోచ నుంచి పెద్ద వటవృక్షం వరకు నాలుగు లక్షల రకాల చెట్లు భూమ్మీద పెరుగుతున్నాయని వృక్ష శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పూలుపూస్తూ, పళ్లనిస్తూ మానవ జాతికి మహోపకారం చేస్తున్నాయి ఈ వృక్షాలు.

భగవంతుడి సృష్టిలో భారతావని మహోన్నతమైన నేలగా మన రుషులు కొనియాడారు. సృష్టిలోని వైచిత్రిలాగే ఈ భారత భూమిలోనూ గొప్ప వైవిధ్యం అబ్బురపరుస్తుంది. సహజ సిద్ధమైన ఎల్లలతో ఏర్పడింది భారతదేశం. ప్రకృతిలో ఔన్నత్యానికి, ధైర్యానికి సంకేతం పర్వతం. గాంభీర్యానికి, ఆర్ద్రతకు ప్రతిబింబం సముద్రం. ఒకవైపున ప్రపంచంలోకెల్లా ఎత్తయిన హిమాలయాలు, మూడు వైపులా సముద్రాలు హద్దులుగా ఉండి ఈ దేశ భౌగోళిక సమైక్యతను చాటి చెబుతున్నాయి. దేశంలో ఒక వైపున ఎడారి, భూభాగం మధ్య పీఠభూములు, మైదానాలు, నదీపరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఈ దేశంలో విభిన్న జాతులు, మతాల వారు, పలు భాషలు మాట్లాడేవారు ఉన్నారు. విభిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు చక్కని తార్కాణంగా భారతదేశం నిలుస్తోంది. అనేకత్వంలోని ఏకత్వానికి నిదర్శనంగా పూసల్లో దారంలా అంతర్లీనంగా సాంస్కృతిక సమైక్యత నెలకొని ఉంది. వివిధ ప్రాంతాల మనుషుల శరీర నిర్మాణం భిన్నంగా ఉండి జాతుల వైవిధ్యమూ ఏర్పడిందని మానవ శరీర శాస్త్రజ్ఞులంటున్నారు.

వేదకాలం నుంచి నేటి వరకు ఈ నేలమీద ఎన్నో సిద్ధాంతాలు, భావనలు ఆవిర్భవించాయి. వేదధర్మం ప్రసిద్ధంగా వ్యాప్తిలో ఉండగానే జైన బౌద్ధాలు, నాస్తిక దర్శనమైన చార్వాకం మనుగడ సాగించాయి. ఇవి నేటికీ నిలిచే ఉన్నాయి. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, వీరశైవం, శాక్తేయం, రాధాకృష్ణతత్వం, కృష్ణచైతన్య సంప్రదాయం- ఇంకా ఎన్నో తాత్విక చింతనాశాఖలు భారతీయ ఆధ్యాత్మిక రంగాన్ని సుసంపన్నం చేశాయి. గౌతమబుద్ధుణ్ని మొదట అవహేళన చేసివారే తరవాత ఆయన శిష్యులయ్యారు. ఆదిశంకరులు ఇతర ఆధ్యాత్మికవేత్తలతో వాదనలు సాగించి తన ధర్మాన్ని ప్రతిష్ఠించారు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్‌ వంటి సంస్థలు సామాజిక సంస్కరణలకు దోహదం చేశాయి.

పరాయి గడ్డపై వేళ్లూనుకొన్న మతాలూ దేశంలో వ్యాపించాయి. చారిత్రక సామాజిక కారణాలవల్ల ఈ దేశవాసులు ఆయా ధర్మాలను స్వీకరించారు. ఈ ధర్మబాహుళ్యం ఆధ్యాత్మిక సమైక్యతకు చిహ్నమైంది. జాతీయోద్యమంలో విభిన్న మతాల వారూ దేశ విముక్తి కోసం పోరాడారు. వేదాలు, ఉపనిషత్తుల కాలం నుంచి నిర్మాణాత్మకమైన ధార్మిక చర్చలు భరత ఖండంలో జరుగుతూనే ఉన్నాయి. భారతీయుల సహనశీలత వల్లనే ఎన్నో మతాలు, దర్శనాలు, ధర్మాలు ఇక్కడ నిలదొక్కుకోగలిగాయి. ‘క్షమయా ధరిత్రి’ అని చెప్పినవారు భారతీయ రుషులే. భూదేవి మనందరినీ భరిస్తోంది. ‘సహనమే సంస్కృతి’ అన్నారు రాధాకృష్ణన్‌. సహనం, క్షమాగుణం భారతీయ సంస్కృతి వైశిష్ట్యం. ఒకరికి తన అభిప్రాయం వ్యక్తం చేయడానికి హక్కు ఉన్నట్టుగానే ఇతరుల మాటల్ని వినడం, వారి మనోభిప్రాయాన్ని మన్నించడం కర్తవ్యం, విజ్ఞత. ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు బతుకుతూ, ఇతరుల జీవన వైఖరుల్నీ సహించగలగడం భారతీయ సంస్కారం. జాతీయ సమైక్యతకు ప్రోదిచేసే ఆచరణాత్మక దృక్పథం అదే.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు