సహనానికీ హద్దుంటుంది...

సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు.

Published : 28 Apr 2024 01:44 IST

హనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. పెద్ద కొండ అద్దంలో చిన్నగా కనిపిస్తుంది. అంతమాత్రాన అది తక్కువ అని అంచనా వేయడం అవివేకం అన్నాడు వేమన. పదార్థాలు నిండుగా ఉన్న విస్తరి కదలకుండా ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని పెద్దలు చెబుతారు. నిజాన్ని, నిప్పును ఎప్పుడూ దాచలేరు. నివురుగప్పిన నిప్పులా ఉండవచ్చు... గాలి వీచి బూడిద తొలగితే నిప్పు రాజుకుని తన ప్రభావం చూపుతుంది. నిజం కూడా అంతే. సమయం రాగానే అబద్ధం తలవంచక తప్పదు. సముద్రం చెలియలి కట్ట దాటితే అంతా అల్లకల్లోలమే.

కౌరవుల ఆగడాలను సభలో పాండవులు తలవంచి సహించారు. అన్యాయంతో మాయాజూదంలో ఓడించినా, బానిసలుగా అవమానించినా, కులసతి ద్రౌపదిని వివస్త్రను చేయాలని చూసినా సహనంతో మౌనం వహించారు. సమయం రాగానే పగ తీర్చుకున్నారు. అది ధర్మబద్ధమైనదేనని మహాభారతం వివరించింది! అశోకవనంలో సీతాదేవి పది నెలలు ఎన్నో అవమానాలు, రాక్షస కృత్యాలను భరించి సహనంతో ఎదురు చూసింది. ఆమె మహా పతివ్రత. సీత తలచుకుంటే రావణుణ్ని భస్మం చేయగలదు. ధర్మబద్ధంగా ఎలా జరగాలో అదే జరిగేందుకు నిరీక్షించింది. సహనం, ఓపికతో కష్టాలను సహించింది. తన జాడను వెతుకుతూ హనుమ వచ్చినప్పుడు- శ్రీరాముడు వచ్చి యుద్ధంలో రావణుణ్ని గెలిచి తనను తీసుకెళ్ళాలని సీత కోరింది. అదీ సీతాదేవి పట్టుదల, ధర్మ దీక్ష. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే జయం!

కొందరికి అనుకోని అదృష్టం వరించి అఖండ ఐశ్వర్యం, అంతులేని అధికారం ప్రాప్తిస్తాయి. దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్లు వికృత చేష్టలతో విర్రవీగుతుంటారు. తమకు నచ్చనివారిపై అభాండాలు వేసి రాక్షసానందం పొందుతారు. అకృత్యాలు సాగిస్తారు. అవతలివారి సహనాన్ని బలహీనతగా అసమర్థతగా భావించి దమనకాండ కొనసాగిస్తారు. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలాగే వచ్చి, ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జు ఎలా మాయమైపోతుందో అదే విధంగా వచ్చిపోయేవి ఐశ్వర్య, అధికారాలు. ఉప్పెనలా ముంచుకొచ్చే జనాగ్రహానికి ఏదైనా తుడిచిపెట్టుకుని పోతుందని దురహంకార నేతలు గుర్తించరు.

చిన్న విత్తనంలో ఒక మహా వృక్షం దాగి ఉంటుంది. విత్తనం మొక్కగా మారేందుకు అనువైన సమయం కావాలి. వర్షం కురిసి భూమి తడవగానే విత్తనం తనలోని మొలకెత్తే శక్తిని తన పైభాగంలో ఉండే పొట్టు కింద కేంద్రీకృతం చేస్తుంది. తనను తాను చీల్చుకుని అంకురాన్ని పైకి తెస్తుంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్క క్రమంగా వృక్షంగా ఎదుగుతుంది. సమయం, ప్రకృతి సహకారం దాని ఎదుగుదలకు అవసరం. అందరికీ ఫలాలతో ఆహారం, నీడతో ఆశ్రయాన్ని అందించే మహావృక్షాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలని భావించడం ఉన్మాదమే. సహకారం, సమన్వయం లేకపోతే ఎంతటివారైనా శిక్షకు తలవంచక తప్పదు.

రావులపాటి వెంకట రామారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు