నిక్షిప్త నిధులు

అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు.

Published : 26 Apr 2024 00:09 IST

అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. ఆ విజయాన్ని ప్రపంచానికి సేవలందించేందుకు ఉపయోగిస్తే దాంట్లో ఓ అద్భుతమైన ప్రయోజనం చూడవచ్చు... ఎవరికి వారి పని సంతోషాన్ని, విజయాన్ని, ఉద్దేశాన్నీ కల్పించినప్పుడు అందులో భగవంతుడు కనిపిస్తాడు.

హనుమ వినయవంతుడు... గొప్ప భక్తుడు. రావణుడు అహంతో పెరిగిపోయాడు. అత్యంత శక్తిమంతమైన రాజుగా ఉండాలనుకున్నాడు. మంచి చెడులను మరచిపోయాడు. సీత సమర్పించిన విలువైన రత్నాలు పొదిగిన అమూల్యమైన హారాన్ని హనుమ తిరస్కరించాడు. ఎందుకు... రత్నాలు ‘రామ’ శబ్దంతో ప్రతిధ్వనించలేదని. ప్రపంచంలో ఏ మనిషికైనా అమూల్యమైన హారాన్ని తిరస్కరించడం మూర్ఖంగా అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా మేల్కొన్న ఆత్మ దాని పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. శాశ్వతమైనదానికి మాత్రమే విలువనిస్తుంది. హనుమ దృష్టిలో భౌతిక వస్తువులకు విలువలేదు. ‘రామ’ నామంలోని విలువను గ్రహించాడు కనుకే గొప్ప భక్తుడయ్యాడు.

జీవితం నిరంతరం ఒక పక్క ఆహ్లాదం, ఆకర్షణీయమైన వాటిని మరోపక్క ఉన్నతమైనవి, ముఖ్యమైన వాటిని ఉంచి- ఎంచుకునే అవకాశాలను కల్పిస్తూంటుంది. ముఖ్యమైనదాన్ని గ్రహించాలంటే నైతికశక్తి, అంతర్దృష్టి అవసరమవుతాయి. ప్రాపంచిక సంపద ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అది ఆనందానికి ప్రవేశద్వారం అయినప్పటికీ, ఎంత కూడబెట్టినప్పటికీ ఎవరికీ ఎప్పుడూ సంతృప్తి ఉండదు. ‘ఇంకా’... ‘ఇంకా’ అనిపించే తీరని దాహం అది.  ఆనందం కంటే ఎక్కువకాలం ఉండే దాన్ని కనుగొనే వరకు చక్రం ఎప్పుడూ ఆగదు. బాధను కూడా భరిం చగలిగే ఆనందంకంటే, ఎక్కువ కాలం ఉండేదాన్ని ఇవ్వండి అంటారు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.

అంతుచిక్కనిదాన్ని కనుగొనడానికి కేవలం ఒకరిని సంతోషపెట్టే దానికంటే మించి చూడవలసి ఉంటుంది. ఆత్మ లోతుల్లోకి వెళ్ళాలి. ఆ పరమానందం ఆత్మకు సంబంధించింది. మధురమైనది... శాశ్వతమైనది. ఆ స్థితిని చేరు కోవడానికి మొదటి మెట్టు- ‘ఆకర్షణ’కు లోను కాకుండా శాశ్వతమైనదాన్ని అన్వేషించడం. ఇది శ్రమతో చాలా దూరం ప్రయాణించాల్సిన మార్గం. సుసం పన్నత అనేది రెండు కోణాల్లో ఉంటుంది- బాహ్యంగా, అంతర్గతంగా. బాహ్య జీవితం బాగుండాలంటే డబ్బు, కృషి ఉంటే సరిపోతుంది. జీవితంలో మనిషి ప్రాథమిక అవసరాలైన గాలి, నీరు, వెలుతురు ఉచితంగానే లభ్యమవుతున్నాయి. అంతమాత్రాన వాటిని తేలికగా చూడకూడదు... ఎంతో విలువైనవిగా గుర్తించాలి. 

భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే బంగారం, వెండి, ఇతర విలువైనవి ఎలాగో- అదే విధంగా శాంతి, ఆనందం కూడా మనసు కుహరాల్లో దాగి ఉన్నాయి. ఈ గుప్త నిధులు పొందాలనుకునేవారు లోపలకు దూకాల్సి ఉంటుంది. ఈ అన్వేషణలో దక్కించుకునే అద్భుతమైన మనశ్శాంతే మనిషి సక్రమ మార్గంలో ఉన్నాడని వెల్లడించడానికి అవసరమైన రుజువని తెలుసుకోవాలి. వ్యామోహాల నుంచి బయటకు లాగి, శాశ్వతమైనదేదో తెలియజేసి మనిషిని స్వేచ్ఛాజీవిగా చేసేదే వేదాంతం. ధ్యానం వల్ల మనసు అణుగుతుంది. అంతర్ముఖం అవుతుంది. బయట తిరుగుళ్లకు బాగా అలవాటుపడిపోయిన ఇంద్రియాలన్నీ లోపలకు చూడటం మొదలుపెడతాయి.

 మంత్రవాది మహేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని