తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై చట్ట సవరణ

తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ చేయనున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్ణయం తీసుకున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు

Published : 22 Jan 2022 04:35 IST

హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ చేయనున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్ణయం తీసుకున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోరింది. ఈ వాదనపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పీవీజీ ఉమేశ్‌చంద్ర, బాలాజీ వడేరా అభ్యంతరం తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి ఇప్పటికే జీవోలిచ్చి ఇప్పుడు చట్ట సవరణ చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. దేవాదాయ చట్టంలో ‘ప్రత్యేక ఆహ్వానితుల’ ప్రస్తావనే లేదని తెలిపారు. ఇప్పటికే తితిదే బోర్డు సభ్యులుగా 29 మంది ఉన్నారని, సవరణ చేయడం చట్ట విరుద్ధమేనని అన్నారు. మరోవైపు గతంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో తనపై ప్రభావం పడినందున తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. నాలుగో ప్రతివాదిగా చేర్చింది. స్టే ఎత్తివేయాలన్న ఎమ్మెల్యే అనుబంధ పిటిషన్‌పై కౌంటర్లు వేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ప్రధాన వ్యాజ్యంలోనూ కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని, తితిదేను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశించింది. తితిదేకు 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోలను నిలిపివేస్తూ గత సెప్టెంబరు 22న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చాయి. నచ్చిన వాళ్లను ఆహ్వానితులుగా నియమించుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదించారు. కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని తితిదే తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ కోరారు. న్యాయవాది ఉమేశ్‌చంద్ర వాదనలు కొనసాగిస్తుండటంతో ధర్మాసనం స్పందిస్తూ.. కౌంటర్‌ వేసేందుకు సమయం కోరినప్పుడు వాదనలు ఎందుకని ప్రశ్నించింది. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని