Updated : 17/11/2021 06:33 IST

TDP: ఒక్క రోజు అసెంబ్లీ భేటీ.. పలాయనవాదానికి నిదర్శనం

151 మంది ఎమ్మెల్యేలున్నా.. ప్రతిపక్షాన్ని చూసి వైకాపాకు భయం

తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో నేతల మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వం చట్ట సభలను అవమానిస్తోందని, 151 మంది ఎమ్మెల్యేలున్నా ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందని తెదేపా శాసనసభాపక్ష సమావేశం దుయ్యబట్టింది. అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహించడం సరికాదని, కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండు చేసింది. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో.. పెట్రోలు, డీజిల్‌ ధరలను కేంద్రం తగ్గించినా తాము తగ్గించబోమంటూ రాష్ట్రప్రభుత్వం మొండిపట్టు పట్టడాన్ని నేతలు ఖండించారు.

* 2021లో ఇప్పటివరకూ అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజే జరిగాయి. నానాటికీ పనిదినాలు తగ్గడం దారుణం. మే 20న ఒక్క రోజు బడ్జెట్‌ సమావేశం జరగ్గా.. నవంబరు 19తో ఆరు నెలలు పూర్తవుతున్నందున అనివార్యంగా ఒక్కరోజు సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ప్రభుత్వ పలాయనవాదానికి నిదర్శనం.

* ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దుచేస్తానని చెప్పారు. అది చేయకపోగా రెండున్నరేళ్లయినా పీఆర్‌సీనీ అమలు చేయలేదు. దీనిపై ఉద్యోగులు తమ నిరసన గళాన్ని వినిపించగానే.. ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టడం సిగ్గుచేటు.

* ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించిన విద్యుత్తుకు రూ.9వేల కోట్లు, సబ్సిడీల కోసం ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.16వేల కోట్లు కలిపి దాదాపు రూ.25 వేలకోట్లు బకాయిలు ఉండగా.. విద్యుత్తు పంపిణీ సంస్థలకు నష్టాలొచ్చాయనే సాకుతో ట్రూఅప్‌ పేరుతో విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం దారుణం.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు, ప్రతిపక్షాలపై పోలీసులతో ప్రభుత్వం దాడి చేయించడం, వారి అండతోనే దొంగ ఓట్లు వేయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.

* ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై కుట్రను నిరసిస్తూ విద్యార్థులు ప్రదర్శన చేసినా, మద్దతు ధర కావాలని రైతులు రోడ్లమీదకు వచ్చినా వారిపై పోలీసులతో దాడులు చేయించడాన్ని ఖండిస్తున్నాం.

* అమరావతి రైతులు.. మహిళల మహా పాదయాత్రను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులను ప్రయోగించడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనం. అమరావతి రైతుల న్యాయపోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాం. 

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, చెత్తపై పన్ను, ఆర్థిక సంక్షోభం, ఏపీపీఎస్సీ రీ నోటిఫికేషన్‌, మాదకద్రవ్యాలకు అడ్డాగా ఏపీ మారడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, జీవో 217, మత్స్యకారుల సమస్యలు, గనుల సీనరేజి వసూలు ప్రైవేటుసంస్థలకు అప్పగింత, అగ్రిగోల్డ్‌ బాధితుల ఇబ్బందులు, వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపు, అమరావతి ఉద్యమం, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం వంటి అంశాలపై సమావేశం చర్చించింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని