AP 3 Capitals: మూడు రాజధానుల చట్టాల ఉపసంహరణ.. జగన్నాటకం

రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు, వైకాపాపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల చట్టాలను....

Updated : 23 Nov 2021 06:03 IST

వైకాపాపై వ్యతిరేకత నుంచి... ప్రజల దృష్టి మరల్చేందుకే
తెదేపా వ్యూహకమిటీ సమావేశంలో చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు, వైకాపాపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు నాటకమాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప.. ఈ రెండున్నరేళ్లలో ఆ మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి పైసా అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ వ్యూహాత్మక కమిటీ సోమవారం సమావేశమైంది. అందులో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు మెజార్టీ స్థానాల్లో వైకాపాను గెలిపించారు. నేడు వరదలతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా.. పక్క రాష్ట్రాల్లో పెళ్లి విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. ‘మహిళలపై అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. ఆయన చేసింది  ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.

కమిటీ నిర్ణయాలు ఇలా...
రాజధానిపై సీఎం జగన్‌ వ్యవహార శైలితో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందని తెదేపా వ్యూహ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోవడంతోపాటు... రాష్ట్ర ఆదాయానికి పెద్దయెత్తున గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలు, అవినీతి, వివేకా హత్య వ్యవహారం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్షనేతను లక్ష్యంగా చేసుకొని, వ్యక్తిత్వహననానికి దిగుతున్నారని అభిప్రాయపడింది. జగన్‌ ఉన్మాద చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంతో సీఎం విఫలమయ్యారని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏరియల్‌ రివ్యూ చేసి చేతులు దులిపేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా అప్రమత్తం కాలేదని, ఫలితంగానే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని విమర్శించింది.

ఓటీఎస్‌కు డబ్బు చెల్లించొద్దు
* వివిధ పథకాల కింద నిర్మించిన గృహాలకు సంబంధించిన రుణాల్ని ఓటీఎస్‌ కింద పేదలెవరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓటీఎస్‌ ద్వారా వైకాపా ప్రభుత్వం ఆదాయం పొందాలనుకోవడం దుర్మార్గపు చర్య. ఓటీఎస్‌ కింద పేద కుటుంబాలపై ఈ భారం పడకుండా అవగాహన కల్పించాలి.

* వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్టీజీఎస్‌ను సరిగా వినియోగించుకోలేదు. తెదేపా బృందాలు బాధితులకు అండగా నిలవాలి.

* స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.3,594 కోట్ల నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లించి దుర్వినియోగం చేయడం చట్ట విరుద్ధం. ఇది అధికార వికేంద్రీకరణకు గండి కొట్టడమే.

* మాజీ మంత్రి వివేకానందరెడ్డిని.. ఆయన అల్లుడే చంపించాడని కట్టుకథలు అల్లిస్తూ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ దుర్మార్గాన్ని ఎండగట్టాలి.

* కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక విషయంలో వైకాపా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. కోరం(తగిన ఆధిక్యం) ఉన్నా ఎన్నిక నిలిపివేయడం దుర్మార్గం.  సమావేశంలో శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని