Movie Ticket Rates: అనిశ్చితి తొలగింది

సినిమా టికెట్ల ధరలపై అనిశ్చితికి శుభం కార్డు పడిందని... వారం, పది రోజుల్లోనే శుభవార్త వింటారని తెలుగు సినీ ప్రముఖులు ప్రకటించారు. సీఎం జగన్‌తో చాలా సుహృద్భావ, సానుకూల వాతావరణంలో చర్చలు

Updated : 11 Feb 2022 04:23 IST

వారం, పది రోజుల్లోనే శుభవార్త వింటారు
సీఎంతో చర్చల అనంతరం సినీ ప్రముఖులు

ఈనాడు, అమరావతి: సినిమా టికెట్ల ధరలపై అనిశ్చితికి శుభం కార్డు పడిందని... వారం, పది రోజుల్లోనే శుభవార్త వింటారని తెలుగు సినీ ప్రముఖులు ప్రకటించారు. సీఎం జగన్‌తో చాలా సుహృద్భావ, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని వెల్లడించారు. గత అయిదారు నెలలుగా నెలకొన్న గందరగోళానికి ఉపశమనం లభించిందని వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ సందర్భంలోనూ, అది ముగిసిన తర్వాత సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, ఆర్‌.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు విలేకర్లతో మాట్లాడారు. చర్చలకు పిలిచినందుకు ముఖ్యమంత్రికి, త్వరితగతిన సమస్య పరిష్కారమయ్యేలా చొరవ చూపినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలని తెలిపారు. చర్చలకు మార్గం సుగమం చేశారంటూ మిగిలిన సినీ ప్రముఖులు చిరంజీవికి ధన్యవాదాలు చెప్పారు.


ఎవరెవరు ఏమన్నారో వారి మాటల్లోనే...

ఈ నెల మూడో వారంలోగా ఉత్తర్వులు

సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన అనిశ్చిత వాతావరణానికి శుభం కార్డు పడింది. దీనిపై కమిటీ తుది ముసాయిదా నివేదిక న్యాయబద్ధంగా ఉంది. సీఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఈ నెల మూడో వారంలోగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తెలుగు సినిమాను, తెలుగుతనాన్ని కాపాడే దిశలో జగన్‌ ఉన్నారు. ఆయన పరిశ్రమ వైపు చల్లని చూపు చూడాలి. ప్రేక్షకులకు, పరిశ్రమకు లాభదాయకంగా, ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం తీసుకున్న నిర్ణయం సంతృప్తి కలిగించింది. చిన్న సినిమాలు రోజుకు అయిదు షోలు ప్రదర్శించుకునేందుకు ఆమోదం తెలిపారు. భారీ బడ్జెట్‌ సినిమాలకు ఇచ్చే వెసులుబాట్లపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలోనూ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, విశాఖపట్నంలో చిత్రీకరణలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలు చూశాక మాకు సంతృప్తి కలిగింది.

- చిరంజీవి


పరిశ్రమకు పెద్ద ఉపశమనం

యిదారు నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ గందరగోళంలో ఉంది. ఈ రోజు పరిశ్రమకు పెద్ద ఉపశమనం లభించింది. సీఎంతో చర్చలు చాలా బాగా జరిగాయి. వారం, పది రోజుల్లో అందరూ శుభవార్త వింటారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్యనున్న గ్యాప్‌ ఈ తరహా చర్చల వల్ల తొలగిపోతుంది.

- మహేశ్‌బాబు


ఓర్పుగా విన్నారు

సినిమా పరిశ్రమ కష్టాలన్నీ సీఎంకు తెలుసు. ఎంతో ఓర్పుతో అందరి అభిప్రాయాలు విన్నారు. పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అగాథం ఉందనే భ్రమ ఇప్పటివరకూ ఉండేది. అది తొలగిపోయింది. ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో చిరంజీవి ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకొచ్చారు. ఆయన పరిశ్రమ పెద్ద అన్న విషయాన్ని ఆయన చర్యలే నిరూపించాయి.

- ఎస్‌.ఎస్‌.రాజమౌళి


సానుకూలంగా చర్చలు

ర్చలు చాలా సానుకూలంగా జరిగాయి. అయిదారు నెలల నుంచి గందరగోళ స్థితిలో ఉన్నాం.

- ప్రభాస్‌


ఐసీయూలో రోగిలా చిన్న సినిమా పరిస్థితి

తెలుగు రాష్ట్రాల్లో సగటు సినిమా మనుగడే కష్టమైపోయింది. ఐసీయూలో రోగిలా చిన్న సినిమా పరిస్థితి తయారైపోయింది. భారీ సినిమాలు విడుదలైనప్పుడు అన్ని థియేటర్లలోనూ వాటినే ప్రదర్శిస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లేదు. అడుక్కునే పరిస్థితి వచ్చింది. దాన్ని రక్షించాలని ముఖ్యమంత్రికి విన్నవించాం. తగిన చర్యలు తీసుకుంటామని, పరిశ్రమలోనూ అంతర్గతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నంది అవార్డులపైనా ప్రభుత్వం దృష్టిసారించాలి. ప్రభుత్వం ఇకపై చర్చలకు పిలిచేటప్పుడు నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌నూ ఆహ్వానించాలి.

- ఆర్‌.నారాయణ మూర్తి


పరిశ్రమకు మేలు చేస్తే గుండెల్లో నిలిచిపోతారు

తంలో సినిమాలు 50, 100 రోజులు ఆడేవి. పరిశ్రమలో వేలమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. పరిశ్రమకు మంచిచేస్తే వారి గుండెల్లో మీరు నిలిచిపోతారు.

- అలీ


చిన్న సినిమాలకు తోడుగా నిలబడండి

చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు. దానివల్ల సినిమా చచ్చిపోయింది. వాటికి మీరు తోడుగా నిలబడండి. కేరళలో చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేస్తారు.

- పోసాని కృష్ణమురళి


అందరూ సంతృప్తి చెందేలా సీఎం సమాధానం

చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్‌, మహేష్‌బాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు మాట్లాడిన ప్రతి ఒక్క అంశాన్నీ ముఖ్యమంత్రి విన్నారు. వారు సంతృప్తి చెందేలా సమాధానం చెప్పారు. చిన్న సినిమాలకు స్థానం ఉండేలా చూడాలని, పండగల సీజన్‌, పెద్ద సినిమాల విడుదల సందర్భాల్లోనూ చిన్న సినిమాల విడుదలకు అవకాశమిచ్చేలా చూడాలని పరిశ్రమ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. విశాఖపట్నంలోనూ పెద్ద ఎత్తున షూటింగులు చేయాలని కోరారు. ఆ దిశగా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రూపొందిస్తామని, దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం వారితో చెప్పారు. మేము ఫిల్మ్‌ఛాంబర్‌ను విస్మరించలేదు. టికెట్ల రేట్ల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యులుగా వారినే నియమించాం. ఆ కమిటీ ప్రతిపాదనల్నే ఈ రోజు చర్చించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చిరంజీవి అవిరళ కృషి చేశారు.

-పేర్ని నాని, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని