తాడేపల్లిగూడెం నిట్‌ డైరెక్టర్‌పై సీబీఐ కేసు

నిట్‌ డైరెక్టర్‌గా అధికారిక దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలో అనర్హులను నియమించారంటూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌-ఏపీ డైరెక్టర్‌

Published : 24 Feb 2022 03:58 IST

అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు

ఈనాడు, అమరావతి: నిట్‌ డైరెక్టర్‌గా అధికారిక దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలో అనర్హులను నియమించారంటూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌-ఏపీ డైరెక్టర్‌ సీఎస్పీ రావుపై సీబీఐ రెండు కేసులు నమోదుచేసింది. వివిధ పోస్టుల్లో చేరేందుకు అనర్హులైనా... నియమితులై అనుచిత లబ్ధి పొందారంటూ... పీఆర్‌వో, లైజనింగ్‌ అధికారి రామ్‌ప్రసాద్‌, సూపరింటెండెంట్లు చెక్కలపల్లి అన్నపూర్ణ, కప్పక గోపాలకృష్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ వి.వి.సురేష్‌బాబు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరేష్‌కుమార్‌లను నిందితులుగా చేర్చింది. ‘తాడేపల్లిగూడెం నిట్‌కు పీఆర్‌వో పోస్టు మంజూరుకాలేదు. అయినా నియమించారు. సూపరింటెండెంట్‌/జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో చేరేవారి వయసు 30 ఏళ్లు దాటకూడదు. కానీ అన్నపూర్ణ, గోపాలకృష్ణ, సురేష్‌బాబుకు నిబంధనలకు విరుద్ధంగా వయోపరిమితి సడలింపు ఇచ్చారు. సీఎస్పీ రావు పూర్వ విద్యార్థి అయిన వీరేష్‌కుమార్‌కు వయోపరిమితి సడలింపు ఇచ్చి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమించారు. తర్వాత అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారు. ఇలాంటి చర్యల ద్వారా అధికారిక దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడ్డారు’ అని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది.

లంచాల్ని వేరే ఖాతాల్లో వేయించి...

నిట్‌కు క్యాటరింగ్‌ సర్వీస్‌ చేసే ఎస్‌ఎస్‌ క్యాటరర్స్‌ సంస్థ నుంచి లంచాలు తీసుకున్నారని సీబీఐ మరో కేసు నమోదుచేసింది. ‘సీఎస్పీ రావు వరంగల్‌లో పనిచేసేటప్పుడు ఎన్‌.విష్ణుమూర్తి అనే వ్యక్తికి పీహెచ్‌డీ గైడ్‌గా వ్యవహరించారు. ఆయన నుంచి రూ.1.50 లక్షల నగదు, ట్రెడ్‌ మిల్లు లంచంగా పొందారు. ఎస్‌ఎస్‌ క్యాటరర్స్‌ సంస్థ ప్రతినిధి నేరెళ్ల సుబ్రమణ్యం.. సీఎస్పీ రావు ఆదేశాల మేరకు విష్ణుమూర్తి స్నేహితుడి భార్య ఖాతాలో రూ.2.04 లక్షలు జమచేశారు. ఆ సొమ్మును తెలంగాణలోని కాజీపేటలో ఉండే సీఎస్పీ రావు భార్యకు అందజేసేవారు. నాగాలాండ్‌లోని నిట్‌లో అసొసియేట్‌ ప్రొఫెసర్‌ ధనలక్ష్మి... నిట్‌, పుదుచ్చేరిలో పోస్టింగు పొందడానికి సీఎస్పీ రావుకు రూ.5.55 లక్షలు చెల్లించారు’ అంటూ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది.

కాజీపేటలో ఇల్లు సీజ్‌

సీఎస్పీ రావుకు తెలంగాణలోని వరంగల్‌లో ఉన్న ఇంటిని సీబీఐ అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట రహమత్‌నగర్‌లోని ఆయన నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆరాతీయగా సీఎస్పీ రావు భార్య డాక్టర్‌ పద్మజ ఇంట్లో లేరని, తాడేపల్లిగూడెం వెళ్లారని డ్రైవర్‌ బాలాజీ తెలిపారు. అధికారులు ఇంటి షట్టరును సీజ్‌చేసి నోటీసులు అంటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని