TDP Mahanadu: మహా జనసంద్రం

తెలుగు దేశం పార్టీ రెండు రోజుల మహానాడులో భాగంగా శనివారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన మహాసభలో అశేష జనవాహిని జయజయ ధ్వానాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నికల యుద్ధభేరి మోగించారు. ప్రభుత్వంపై పోరాటానికి,

Updated : 29 May 2022 10:22 IST

తెదేపా మహానాడుకు తరలివచ్చిన ప్రజానీకం
చంద్రబాబు నినదిస్తే.. గళం కలిపిన లక్షల మంది
నిర్బంధాలు, ప్రతికూల పరిస్థితులు అన్నీ బేఖాతర్‌
బస్సులు ఇవ్వకున్నా.. రానివ్వకపోయినా ఆగలేదు
మండే ఎండలోనూ ఆద్యంతం తరగని ఉత్సాహం
మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

జనం... జనం... రోడ్ల మీద జనం... ప్రాంగణమంతా జనం... కనుచూపు మేరలో కడలి తరంగాల్లా ఎటు చూసినా లక్షల్లో జనం. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం వద్ద నిర్వహించిన మహానాడు సభకు తెదేపా కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు ఒక ప్రభంజనంలా తరలివచ్చారు. కట్టలు తెగిన వరదలా పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో కదలివచ్చారు.


మీరంతా తాడోపేడో తేల్చుకోవాలని వచ్చారు.. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఇంటికి పంపుదామా అన్న ఉత్సాహంతో వచ్చారు. చైతన్యం, పట్టుదల, కసితో పోరాటంలో పాలుపంచుకోవడానికి ముందుకొచ్చారు..
ఉన్మాదుల పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు కదలివచ్చారు.  

- మహానాడుకు వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు


ఎంత ఇబ్బంది పెడితే అంత రాటుదేలతా.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడను.. బుల్లెట్‌లా దూసుకెళతా..

- వైకాపా ప్రభుత్వానికి చంద్రబాబు హెచ్చరిక


తెలుగు దేశం పార్టీ రెండు రోజుల మహానాడులో భాగంగా శనివారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన మహాసభలో అశేష జనవాహిని జయజయ ధ్వానాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నికల యుద్ధభేరి మోగించారు. ప్రభుత్వంపై పోరాటానికి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కదనరంగంలోకి దూకేందుకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ సమరశంఖం పూరించారు. ‘క్విట్‌ జగన్‌-సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ఆయన నినదిస్తే, కొన్ని లక్షల మంది గళం కలిపారు. ఇదే స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తామని ప్రకటించి, పార్టీశ్రేణుల్లో ఆయన మరింత సమరోత్సాహాన్ని నింపారు. చంద్రబాబు వేదిక మీదకు వచ్చినప్పుడు ఐదారు నిమిషాలు సభా ప్రాంగణమంతా కేకలు, నినాదాలు, ఈలలతో హోరెత్తిపోయింది. మళ్లీ మీరే సీఎం... అంటూ ప్రజలు పెద్దఎత్తున నినదించారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడూ అదేస్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్పందించారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత ఇంత భారీస్థాయిలో ఒక రాజకీయపార్టీ సభ జరగడం, ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ ఇచ్చిన పిలుపుతో కొన్ని లక్షల మంది తరలిరావడం ఇదే మొదటిసారి. తెదేపా చరిత్రలో ఎన్నో మహానాడులు, భారీ సభలూ జరిగినా, అనేక నిర్బంధాలు, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ప్రవాహంలా జనం తరలిరావడం ఈ సభ ప్రత్యేకతని తెదేపా నాయకులు చెబుతున్నారు.

అడ్డంకులను అధిగమించి..

తెదేపా సభకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు వెళ్లేందుకు బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ నిరాకరించింది. స్కూల్‌ బస్సులు ఇవ్వకుండా యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం బెదిరించింది. వీటికితోడు మండే ఎండలు, వడగాలులు... ఇలాంటి ఇబ్బందులేవీ ప్రజల్ని నిరోధించలేకపోయాయి. లారీలు, ట్రాక్టర్లు, కార్లు ఇలా... ఏ వాహనం కుదిరితే దానిలో సొంత ఖర్చులు పెట్టుకుని మరీ తరలివచ్చారు. ‘పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నాయకుల ప్రసంగాలు మాకు కొత్తేమీ కాదు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో మేం అనేక అరాచకాలు ఎదుర్కొన్నాం. వేధింపులు, బెదిరింపులే భరించాం. స్థానికసంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ సాగించిన దురాగతాలకు అంతే లేదు. అందుకే ఆ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు, వచ్చే ఎన్నికల్లో తెదేపాను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలనే తరలివచ్చాం’ అని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కార్యకర్త పేర్కొన్నారు. ‘ఈ మూడేళ్లలో ప్రభుత్వం వేయని భారం లేదు. పెంచని ఛార్జీలు లేవు. ఈ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పేందుకే ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించి, ఏ వాహనం దొరికితే దానిలో వచ్చాం’ అని అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఒక మహిళ తెలిపారు.

ఉదయం 7 గంటలకే వేల సంఖ్యలో రాక

తెదేపా మహాసభ సాయంత్రం 4 గంటల తర్వాత మొదలవుతుందని తెలిసినా ఉదయం 7 గంటలకే సమావేశ ప్రాంగణానికి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ఆ సమయానికే 20 వేల మందికిపైగా రావడంతో ట్రాఫిక్‌కు అవరోధం ఏర్పడింది. అందరూ మధ్యాహ్నం తర్వాత వస్తారన్న ఉద్దేశంతో, అప్పటికి సిద్ధమయ్యేలా భోజన ఏర్పాట్లు చేసుకుంటున్న పార్టీ నాయకులు జనస్పందన చూసి అప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. వీలైనంత త్వరగా వారికి భోజన ప్యాకెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల సమయానికే 50-60 వేల మంది వచ్చేశారు. మధ్యాహ్నం 2-3 గంటల సమయానికి ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంది.

చాన్నాళ్ల తర్వాత మళ్లీ లారీలు, ట్రాక్టర్లలో...

దాదాపు 10-15 ఏళ్ల తర్వాత జనం మళ్లీ లారీలు, ట్రాక్టర్లలో తరలిరావడం తెదేపా మహానాడు సందర్భంగా కనిపించింది. ద్విచక్రవాహనాలైతే అసాధారణ సంఖ్యలో వచ్చాయి. తొలిరోజు కార్యక్రమానికి వచ్చినవారిలో చాలామంది బహిరంగసభలో కూడా పాల్గొనే వెళ్లాలన్న పట్టుదలతో ఉండిపోయారు. సుదూర ప్రాంతాలవారు శుక్రవారం రాత్రే ఒంగోలు చేరుకున్నారు. కొందరు శనివారం ఉదయం నుంచి రావడం ప్రారంభించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు అన్న తేడాలేకుండా అన్ని వర్గాలవారూ రెట్టించిన ఉత్సాహంతో కదిలివచ్చారు. పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణను పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల అవరోధాలు సృష్టించడంతో కొన్ని కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో చాలామంది 5-6 కి.మీ.ల నుంచి కాలినడకనే వచ్చారు.


వెల్లువెత్తిన ఉత్సాహం

సాధారణంగా రాజకీయ సభలంటే పెద్దసంఖ్యలో జనాన్ని తరలించడం, నాయకుల ప్రసంగాలు మొదలవగానే వారు తిరుగుముఖం పట్టడం వంటి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ మహానాడు అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారుల ఉత్సాహానికి అద్దం పట్టింది. యువత పెద్ద ఎత్తున తరలివచ్చి.. బారికేడ్లు తోసుకుని మరీ సభాప్రాంగణంలో ప్రవేశించారు. సభ జరుగుతున్నప్పుడు సౌండ్‌ బాక్స్‌లు, లైటింగ్‌ వ్యవస్థల మీదకు ఎక్కి కేరింతలు కొట్టారు. వాటిపై నుంచి దిగాలని పార్టీ నాయకులు చెప్పినా వారు వినకపోవడంతో... స్వయంగా చంద్రబాబు వారికి నచ్చజెప్పాల్సి వచ్చింది. చంద్రబాబు, బాలకృష్ణ వేదికపైకి రాగానే సమావేశ ప్రాంగణం హోరెత్తింది. చంద్రబాబు సహా ముఖ్యనాయకుల ప్రసంగాల్లో ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా విమర్శలు చేసినప్పుడు.. కార్యకర్తలు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. రాత్రి 8.30కు సభ ముగిసేవరకు కూడా ప్రాంగణంలో జనం అదే ఉత్సాహంతో ఉన్నారు. సభ ముగిశాకే అందరూ తిరుగుముఖం పట్టారు.


మండే ఎండలు కాదని..

శుక్రవారం మహానాడు తొలిరోజు కార్యక్రమాలకు జర్మన్‌ హ్యాంగర్‌ను ఏర్పాటుచేశారు. దానిలో 12వేల మందికి కుర్చీలు వేయగా... 60-70 వేలమంది వచ్చారు. శనివారం బహిరంగ సభ కోసం వేదికను అలాగే ఉంచేసి, జర్మన్‌ హ్యాంగర్‌ను చాలావరకు తొలగించారు. సభా ప్రాంగణానికి ఉదయానికే పెద్దసంఖ్యలో చేరుకున్న ప్రజలు.. ఎండ తీవ్రత పెరిగేసరికి అక్కడున్న షామియానాలు, రోడ్ల పక్కన చెట్ల కింద, బడ్డీకొట్ల దగ్గరా నీడలో సేదతీరారు. కొందరైతే కొన్ని గంటలపాటు ఎండలోనే గడిపారు. మధ్యాహ్నం 4 గంటలకు సభ మొదలయ్యేసరికి ప్రాంగణమంతా లక్షల మందితో నిండిపోయింది.  కనుచూపు మేరలో ఇసుక వేసినా రాలనంత జనం కనిపించారు. ఆవరణలో ఎక్కడికక్కడ ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్క్రీన్ల సాయంతో.. కుర్చీలపైనా, నేల మీదా కూర్చుని ఆద్యంతం సభను వీక్షించారు.


ప్రసంగాల్లో గాఢత..

చంద్రబాబు సహా సమావేశంలో పాల్గొన్న నాయకుల ప్రసంగాలు ఆవేశంగా, ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా ఘాటైన విమర్శలతో సాగాయి. ఈసారి చాలామంది సీనియర్లు ప్రసంగాలకు దూరంగా ఉన్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు పయ్యావుల కేశవ్‌ సభను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు, అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లు కొందరే మాట్లాడారు. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి పెద్ద స్పందన లభించింది. పార్టీ ప్రధానకార్యదర్శి లోకేశ్‌ కాసేపు మాట్లాడేసరికి గొంతుకు ఇబ్బంది ఏర్పడటంతో ప్రసంగం కొనసాగించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40% టికెట్లు ఇస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతగా పార్టీ యువనాయకుడు నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో సభా ప్రాంగణంలో చంద్రబాబు, లోకేశ్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.


వైకాపా పతనం ప్రారంభం
- సత్యవతి మాదాల, మురళీదేవి, చిరుమామిళ్ల లావణ్య,  తెదేపా మహిళా నేతలు, విజయవాడ

మహానాడు వేదికగా వైకాపా రాజకీయ పతనం ప్రారంభమైంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగించినా... ఎండా, వానలను లెక్క చేయకుండా మహానాడుకు తరలివచ్చాం. రానున్న ఎన్నికల్లో తెలుగు మహిళల సత్తా చూపిస్తాం. మేమంతా ఆడపులులుగా మారి ప్రభుత్వ పతనాన్ని శాసిస్తాం.


పోలీసులు అడ్డుకున్నారు
- మిరియాల శ్రీకాంత్‌, చింతపల్లి కాలేషా, దాచేపల్లి, గురజాల నియోజకవర్గం

దాచేపల్లి, రొంపిచర్ల నుంచి మహానాడుకు బయల్దేరాం. నకరికల్లు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ పత్రాలు చూపాం. అయినా వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వస్తున్నామని చెప్పడంతో మమ్మల్ని విడిచిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని