అన్న క్యాంటీన్‌ వద్ద టెంటు తొలగింపు

తెదేపా బొబ్బిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బేబినాయన జన్మదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల కిందట బొబ్బిలి పట్టణంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, అన్న క్యాంటీన్‌ వద్ద టెంటు తొలగింపు వివాదాస్పదమైంది.

Published : 28 Jun 2022 05:33 IST

ఎండలో ఇబ్బందిపడ్డ పేదలు

బొబ్బిలి, న్యూస్‌టుడే: తెదేపా బొబ్బిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బేబినాయన జన్మదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల కిందట బొబ్బిలి పట్టణంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, అన్న క్యాంటీన్‌ వద్ద టెంటు తొలగింపు వివాదాస్పదమైంది. పురపాలక అధికారులు సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్సు కూడలిలో ఫ్లెక్సీలను తొలగిస్తుండగా తెదేపా కార్యకర్తలు, నాయకులు చేరుకుని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని, జన్మదిన వేడుకలు జరిగి మూడ్రోజులు దాటినందున తొలగిస్తున్నామని పుర అధికారులు చెప్పారు. అయితే పట్టణంలోని అన్నింటినీ తొలగించాలని, కక్ష గట్టి తెదేపా నాయకుడివి తొలగించడం అన్యాయమని పురపాలక పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వరప్రసాద్‌, ఆర్‌ఐ సురేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు వెనుదిరిగారు. అదేవిధంగా అన్న క్యాంటీన్‌ భవనం ప్రధాన గేటు వద్ద మొబైల్‌ వాహనంలో తెదేపా నాయకులు పేదలకు భోజనాలు పెడుతున్నారు. రహదారి పక్కన టెంటు వేసి వడ్డిస్తున్నారు. దీన్ని కూడా తొలగించడంతో ఆరుబయటే పేదలు భోజనాలు చేయాల్సి వచ్చింది. కొంత మంది రోడ్డు, కాలువల పక్కన కూర్చొని భోజనాలు చేశారు. అధికారుల తీరుపై తెదేపా నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిబంధనల మేరకు ఫ్లెక్సీలు, టెంట్లు తొలగించామని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని పురపాలక కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని