ఎన్టీఆర్‌ పేరు మార్పు బిల్లును గవర్నర్‌ నిలిపేయాలి

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించడం దుర్మార్గమని, దీనికి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం తీసుకువచ్చిన పేరు మార్పిడి

Updated : 26 Sep 2022 05:51 IST

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించడం దుర్మార్గమని, దీనికి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం తీసుకువచ్చిన పేరు మార్పిడి బిల్లును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలనే డిమాండ్‌తో ఏఐఎస్‌ఎఫ్‌- ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ పేరు తీసేయడాన్ని ఎవరూ సమర్థించరని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని, అందుకే దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టామని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం త్యాగాలు చేసినవారు, వివిధ రంగాల్లో నిష్ణాతులను కాదని.. రాష్ట్రంలో 55 పథకాలకు వైఎస్‌ఆర్‌ పేర్లు, మరో 20 పథకాలకు జగన్‌ పేర్లు పెట్టారని ధ్వజమెత్తారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనతోపాటు సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ చేసిన విజ్ఞప్తి మేరకు కడప జిల్లా గండికోట ప్రాజెక్టుకు ఈశ్వరరెడ్డి, ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేర్లు పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం విదేశీ విద్యాదీవెన పథకానికి అంబేడ్కర్‌ పేరు తొలగించి జగన్‌ పేరు పెట్టుకున్నారని ఇంతకంటే నీచమైన పని ఇంకేమైనా ఉందా అని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పోతిన రామారావు, సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రమణ, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, ఐఎంఏ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్‌ రషిక్‌ సాంగ్వీ, ఎన్టీఆర్‌ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్‌ కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని