వారం అన్నారు.. మూడేళ్లైనా వేతనం పెంచలేదు

చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. అయినా స్పందించకపోతే నేనే మీకు న్యాయం చేస్తా. భరోసా ఇస్తున్నా.  మరో ఏడాది తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తరువాత మనందరి ప్రభుత్వం

Updated : 30 Sep 2022 05:46 IST

డీఏ రికవరీని ఆపలేదు

మండిపడుతున్న వీఆర్‌ఏలు

తెదేపా హయంలో రూ.6వేల నుంచి రూ.10,500కు పెంపు

చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. అయినా స్పందించకపోతే నేనే మీకు న్యాయం చేస్తా. భరోసా ఇస్తున్నా.  మరో ఏడాది తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తరువాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వారం  వ్యవధిలోనే మీ గౌరవ వేతనాన్ని రూ15,000కు పెంచుతా. సంఘం నేతలు పెద్దన్న, కాశన్నను పిలిపిస్తా.

- విజయవాడలో 2017 మార్చి 24న అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ అన్నమాటలివి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పని చేస్తున్న 22వేల మంది వీఆర్‌ఏలు (గ్రామ సహాయకులు)తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టారు. వీరికి 2018 అక్టోబరు ముందు వరకు నెలకు రూ.6వేల గౌరవ వేతనం లభించేది. ఆనాటి తెదేపా ప్రభుత్వం రూ.6వేలుగా ఉన్న వేతనాన్ని రూ.10,500కు పెంచింది. ఈ చెల్లింపు 2018 అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో కరవు భత్యం కింద నెలకు ఇచ్చే రూ.100ను రూ.300 చేసింది. రవాణా భత్యాన్ని రూ.20నుంచి రూ.100కు పెంచింది. దీని ప్రకారం ఈ ఏడాది జనవరి వరకు చెల్లింపులు జరిగాయి.

ఉత్తర్వులు లేవని..!
డీఏ చెల్లింపుల విషయంలో వైకాపా ప్రభుత్వం మెలిక పెట్టింది. ‘డీఏ చెల్లింపు ఉత్తర్వుల్లో పేర్కొన్న గడువు 2018 జూన్‌ వరకు మాత్రమే ఉంది. పొరబాటున మీకు 2022 జనవరి వరకు చెల్లించాం. ఈ చెల్లింపులకు తగ్గట్లుగా ఉత్తర్వులు లేనందున తీసుకున్న డీఏను తిరిగి చెల్లించాలి’ అని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ట్రెజరీ అధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపారు. పాత ఉత్తర్వులను అనుసరించి వీఆర్‌ఏలకు 2020 జనవరి వరకు డీఏ రూపంలో సుమారు రూ.10వేలు అందాయి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తేనే వేతనాల చెల్లింపులు ఉంటాయని జిల్లాల అధికారులు వీఆర్‌ఏలపై ఒత్తిడి తెచ్చారు. డీఏ రికవరీ ఆపాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేనందున, వేతనాలు ఆగిపోతాయన్న భయంతో వీఆర్‌ఏలు రికవరీకి అంగీకరించారు. ఈ మేరకు ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కలిపి రూ.6 వేలు చొప్పున చెల్లించారు. మిగిలిన రూ.4వేలను చెల్లించాల్సి ఉంది. అక్టోబరు వేతనం పొందాలంటే ముందుగా ఈ బకాయి చెల్లించాలని అధికారులు వీఆర్‌ఏలపై ఒత్తిడి తెస్తున్నారు.

దృష్టిపెట్టేవారు లేరు
కరవు భత్యం చెల్లింపునకు ఉత్తర్వులు లేవని ప్రభుత్వం పేర్కొంటుండటం విడ్డూరంగా ఉందని వీఆర్‌ఏలు మండిపడుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వీఆర్‌ఏలకు చెల్లించే డీఏలను ఆపడం ఎందుకు అన్న దానిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఉన్నత స్థాయిలో సమీక్ష జరిగితే వెంటనే పరిష్కారమయ్యే సమస్యపై ఏ స్థాయిలోనూ పట్టించుకోకపోవడంతో వీఆర్‌ఏలు తీవ్రంగా నష్టపోతున్నారు.

రూపాయి కూడా పెంచలేదు!
తమ కనీస వేతనం రూ.26వేలు చేయాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ చేస్తున్నారు. తమకు రూ.6వేల వేతనం ఉన్నప్పుడు వీఆర్‌ఏలకు జగన్‌ రూ.15,000 (అదనంగా రూ.9వేలు) ఇస్తామని చెప్పారు. ఆ మేరకు చూసినా రూ.10,500కు రూ.19,500 చెల్లించాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వం వీరి వేతనాన్ని 2018లో రూ.6వేల నుంచి రూ.10,500కు పెంచినప్పటికీ...అధికారంలోకి వచ్చిన తరవాత ముఖ్యమంత్రి జగన్‌ ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచలేదు. ఉత్తర్వులు లేవన్న కుంటిసాకుతో చెల్లించిన డీఏని రికవరీ చేస్తుండటం పట్ల వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు పెద్దన్న, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని