విలీన వేదన!

రకరకాల కారణాలతో పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులను బడులకు, విద్యకు దూరం చేస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ప్రపంచ బ్యాంకు ఆంక్షలు.. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం పిల్లల అవసరాలు, వారి సమస్యలను గాలికి వదిలేస్తోంది.

Updated : 04 Oct 2022 07:02 IST

ఈ ఏడాది 1,73,416 మంది విద్యార్థులు బడులకు దూరం
రవాణా సౌకర్యం లేదని చదువు మానేసినవారు 7,500 మంది

కరకాల కారణాలతో పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులను బడులకు, విద్యకు దూరం చేస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ప్రపంచ బ్యాంకు ఆంక్షలు.. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం పిల్లల అవసరాలు, వారి సమస్యలను గాలికి వదిలేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 1,73,416 మంది విద్యార్థులు బడి మానేశారని, వీరిని తిరిగి చేర్పించేలా చూడాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఇటీవల లేఖ రాశారు. వారిలో 1-5 తరగతుల వారు 66,205 మంది, ఉన్నత పాఠశాలల వారు 1,07,211 మంది ఉన్నారు. పాఠశాల దూరంగా ఉన్నందున రవాణా సౌకర్యం లేక 7,789 మంది బడి మానేశారని విద్యాశాఖే పేర్కొంది. వీరిలో ఒకటి నుంచి పదో తరగతి వారు ఉన్నారు.

ఎమ్మెల్యేల నుంచీ వ్యతిరేకత!  

గతేడాది 3,627 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను 250 మీటర్ల దూరంలోని 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు.

ఈ ఏడాది 5,250 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. ఇవికాకుండా ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి పిల్లల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రావడంతో 649 బడులను మినహాయించారు. దూరం పెరిగి దాదాపు 5,000 మంది బడి మానేస్తున్నా ప్రభుత్వం విలీనం ఎందుకు చేస్తోంది? మానవ వనరులపై చేసే ఖర్చు తగ్గించాలన్న ప్రపంచ బ్యాంకు నిబంధన కోసమేనా? ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి, పోస్టులు మిగుల్చుకునేందుకా? అనేది చర్చనీయాంశమైంది.

మూడు నెలలుగా నిరసనలు..

తరగతుల విలీనంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పలుచోట్ల ఆందోళనలు చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మూడు నెలలుగా నిరసన తెలుపుతున్నారు. మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను 7 కిలోమీటర్ల దూరంలోని బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. విలీనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పిల్లలు ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 3.50 లక్షల వరకు తగ్గింది. 1-5 తరగతుల్లో బడి మానేస్తున్న వారు లేరని కేంద్ర సమగ్ర శిక్ష అభియాన్‌కు అధికారులు నివేదికలు ఇస్తున్నారు. కానీ, ఈ ఏడాది 66 వేల మంది ప్రాథమిక స్థాయిలోనే చదువుకు దూరమయ్యారు.

మధ్యాహ్న భోజనం బాగోలేదని..

పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, మెనూలోనూ మార్పులు చేశామని ముఖ్యమంత్రి జగన్‌ గొప్పగా చెబుతుండగా.. భోజనం సరిగాలేక 17 మంది చదువు ఆపేసినట్లు విద్యాశాఖ గణాంకాల్లో పేర్కొంది.

బాల్య వివాహాల వల్ల కొందరు బడికి దూరమయ్యారు. 6-10 తరగతి స్థాయిలో 781 మందికి పెళ్లిళ్లు అయినట్లు విద్యాశాఖ పేర్కొంది.

సీజనల్‌ వలసల కారణంగా 49,099 మంది బడి మానేశారు. విచిత్రమేమిటంటే వీరిలో సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గృహాలకు చెందిన వారు 1,144 మంది ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. తల్లిదండ్రులు వలసలు వెళ్తే వసతి గృహంలో ఉన్న విద్యార్థులు ఎందుకు వెళ్లిపోతారనేది ప్రశ్న.


ఒక్క విద్యార్థి కోసం నడిచిన రైలు..

పాన్‌లో అదొక మారుమూల ద్వీపం.. హక్వైడో ఉత్తర ద్వీపంలోని కమీ-షిరాటకి రైల్వేస్టేషన్లో ఒకే ఒక్క ప్రయాణికురాలి కోసం రైలు రోజుకు రెండుసార్లు ఆగుతూ ఉండేది. ఆ అమ్మాయి ఒక హైస్కూలు విద్యార్థి. ఒకసారి ఆమెను బడికి తీసుకువెళ్లడానికి.. మరోసారి పాఠశాల ముగిశాక ఆమె ఇంటికి వెళ్లడానికి!

మారుమూల ప్రాంతం కావడంతో చాన్నాళ్లుగా ఆ స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ఒకదశలో సర్వీసులు నిలిపివేద్దామని రైల్వే నిర్ణయించుకుంది. కానీ ఒక విద్యార్థి రోజూ బడికి వెళ్లి రావడం కోసం ఈ రైలును ఉపయోగించుకుంటోందని.. అదొక్కటే అమెకున్న రవాణా సదుపాయమని గుర్తించిన అధికారులు ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆ స్టేషనుకు రైలు నడపాలని నిర్ణయించి అలాగే కొనసాగించారు. అంతేకాదు.. ఆమె బడి వేళలకు అనుగుణంగా రైలు సమయాన్ని మార్చారు కూడా. మూడేళ్ల పాటు ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేవరకు ఇదే కొనసాగించారు.

ఇదీ.. ఆ దేశంలో విద్యకు ఇచ్చే ప్రాధాన్యం. ఇదీ నాగరిక సమాజ లక్షణం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని