Andhra News: రాజధాని రైతులపై పోలీసు జులుం

అన్నం పెట్టే రైతన్నకు అవమానం.. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పరాభవం.. న్యాయం కోసం పోరాడుతున్న అన్నదాతపై రాజకీయ దన్నుతో పోలీసులు ప్రతాపం చూపించారు.

Updated : 22 Oct 2022 06:50 IST

తాళ్లు అడ్డుపెట్టి.. రైతులను వెనక్కి నెట్టి..

గుర్తింపు కార్డులు చూపాలని ఒత్తిళ్లు

పలువురు మహిళలకు గాయాలు

హైకోర్టు ఆదేశాలంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్తత

ఓ వైపు మంత్రి నిరసనకు అనుమతి.. మరో వైపు కర్షకులపై ప్రతాపం

40వ రోజు పాదయాత్ర రక్తసిక్తం

ఈనాడు, కాకినాడ- రాయవరం, రామచంద్రపురం, మండపేట గ్రామీణం: అన్నం పెట్టే రైతన్నకు అవమానం.. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పరాభవం.. న్యాయం కోసం పోరాడుతున్న అన్నదాతపై రాజకీయ దన్నుతో పోలీసులు ప్రతాపం చూపించారు. ముందుకు కదలకుండా తాళ్లు అడ్డుపెట్టి ఆపేసి, వెనక్కి నెట్టేసి బరబరా ఈడ్చేశారు. పోలీసు జులుం ప్రదర్శించారు. ఒక మంత్రి, వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మరో ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పాదయాత్ర సాగుతుండడంతో అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వైకాపా అడ్డంకులు, నిరసనలను మనోబలంతో అధిగమిస్తూ ముందుకు సాగిన రాజధాని రైతుల మహాపాదయాత్ర 40వ రోజు శుక్రవారం పోలీసు బల ప్రదర్శనతో రక్తసిక్తమైంది. పాదయాత్ర రామచంద్రపురంలోకి వెళ్లే క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. 600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలన్న న్యాయస్థానం తీర్పు వెలువడిన కాసేపటికే పోలీసులు ఆంక్షల జులుం ప్రదర్శించారు. యాత్ర వెంట ఉన్న వాహనాలన్నింటినీ దారి మళ్లించారు. యాత్రలోకి రాకూడదని, గుర్తింపు    కార్డులు ఉన్నవారే పాల్గొనాలని, మిగిలినవారిని అనుమతించబోమని ఆంక్షలు విధించారు. మద్దతుదారులనూ వెనక్కి పంపించారు. కొందరు గుర్తింపు కార్డులు చూపారు. మరికొందరు చేతిసంచుల్లో కార్డులున్నాయని చెప్పారు. ఇంకొందరు కార్డులే ఇవ్వలేదని పేర్కొన్నారు. రేపటి యాత్ర నుంచి చూపిస్తామని బతిమాలినా పోలీసులు వినలేదు. దీంతో వాతావరణం వేడెక్కింది. యాత్రను అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.

మహిళలు, వృద్ధులని చూడకుండా తాళ్లు అడ్డుపెట్టి నెట్టేయడంతో పలువురు కిందపడి గాయపడ్డారు. పలువురిని ఈడ్చి పక్కన పడేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ దాడిలో తుళ్లూరుకు చెందిన జొన్నలగడ్డ అన్నపూర్ణ ముఖంపై రక్త గాయాలయ్యాయి. ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో రైతులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. మొన్న రాజమహేంద్రవరంలో వైకాపా ఎంపీ రాళ్లు, చెప్పులతో కొట్టిస్తే.. ఇప్పుడు రైతులను కొట్టడానికి జగన్‌ పోలీసులను పంపారా? అంటూ మండిపడ్డారు. అమరావతి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి, కోకన్వీనర్‌ గద్దె తిరుపతిరావు ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. లాఠీలు అడ్డంపెట్టి వారినీ తోసేశారు. నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి మాపైనే దాడికి దిగుతారా? అంటూ రైతులు అక్కడే బైఠాయించారు. పోలీసులు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వారికి మద్దతుగా స్థానికులు, రాజకీయ పక్షాలు, ముస్లింలు నిరసనకు దిగారు. ఆందోళన గంటన్నరపాటు ఉద్ధృతంగా సాగింది. పోలీసులు వెనక్కి తగ్గడంతో ఆ తరువాత యాత్ర రామచంద్రపురం వైపు కదిలింది. శనివారం నుంచి 600 మంది గుర్తింపు కార్డుల పరిశీలన పూర్తయ్యాకే యాత్ర ప్రారంభించాలని రైతు ఐకాసకు పోలీసులు తేల్చి చెప్పారు. సంఘీభావం తెలిపేవారు పాదయాత్రలో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. రామచంద్రపురంలో యేసు ప్రేమాలయం చర్చిలో ప్రార్థనలు చేసి ఆశీర్వదిస్తామంటూ చర్చి పెద్దలు రైతులను ఆహ్వానించారు. యాత్రలో భాగంగా చర్చిలోకి వెళ్లేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ సీఐ శ్రీనివాస్‌ అభ్యంతరం చెప్పారు. దీంతో రైతులు మరోమారు వాగ్వాదానికి దిగారు. ఎదురుతిరిగి కొద్దిమంది రైతులు లోనికి వెళ్లి ప్రార్థనలు చేశారు. మైక్‌కు అనుమతి లేదని కళాజాత బృందాన్ని, ట్రాక్టర్ల, ఎడ్లబళ్ల ప్రదర్శనలను ఊరిబయటే పోలీసులు ఆపేశారు.

రథంపైనా ప్రతాపం 

యాత్రను అడ్డుకున్న పోలీసులు వెంకటేశుడి దివ్య రథం ముందుకు కదలకుండా కాసేపు కట్టడి చేశారు. వాహనంపైకి ఎక్కి తాళాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. స్వామి జోలికి వచ్చిన సీఎంతోపాటు వైకాపా నాయకులెవరూ బాగుపడరంటూ మహిళలు ఈ సందర్భంగా శాపనార్థాలు పెట్టారు. మరోవైపు రథం ఉన్న ట్రాక్టర్‌పైకి బూట్లతో ఎక్కేందుకు పోలీసులు ప్రయత్నించడంతో మహిళలు అడ్డుకున్నారు.


గొంతు నొక్కి.. చెయ్యి మెలిపెట్టి నెట్టేశారు 

- జమ్ముల అన్నపూర్ణ, తుళ్లూరు

పోలీసులు అటుఇటు తోసేసి, పీక మీద రెండు చేతులు పెట్టి మాట రానీయకుండా నెట్టేశారు. నాపై నలుగురు పడ్డారు. 70 ఏళ్ల వృద్ధురాలినని కూడా చూడకుండా రక్తంకారేలా గాయపరిచారు. ఇదెక్కడి న్యాయం? అడుగడుగునా అడ్డుకోవడం ఎందుకు? పోలీసులకు చెప్పి రైతులందరినీ చంపేయండి. మీకు అడ్డే ఉండదు.


మా మీద ప్రతాపమా? 

- కొమ్మినేని వరలక్ష్మి, మహిళా రైతు 

రాజధాని కోసం పోరాడితే ఆడవాళ్లని చూడకుండా చీరలు లాగారు. మెడలో గొలుసు లాగారు. ఒక్కొక్కరిపై 20 కేసులు పెట్టారు. మొన్న చెప్పులు, రాళ్లు వేయిస్తారా? ఇప్పుడు పోలీసులతో దాడి చేయిస్తారా? యాత్రకు ఆటంకం కలిగించవద్దని కోర్టు చెప్పినా మా మీద ప్రతాపమా? మహిళలపై పోలీసులు దాడి చేస్తే మహిళా హోంమినిస్టర్‌ ఏం చేస్తున్నారు?


గుర్తింపు కార్డులున్న వారికే అనుమతి 

- బాలచంద్రారెడ్డి, డీఎస్పీ, రామచంద్రపురం 

రైతు మహాయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనడానికి అనుమతి ఉంది. రైతులు 150 మంది వరకు పాల్గొంటున్నారు. మిగిలిన వారంతా రాజకీయ పక్షాలవారు, బయటివారు ఉంటున్నారు. నాలుగు వాహనాలకు అనుమతి ఉంటే 50కిపైనే వస్తున్నాయి. ఇవన్నీ అడ్డుకుంటున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నాం. గుర్తింపు కార్డులున్న రైతులకే యాత్రలో అనుమతిస్తాం.


ఐకాస నేతలపై పోలీసు దాడి అన్యాయం 

- పెద్దాపురంలో విలేకరులతో మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 

పోలీసులు చేయి చేసుకోవడం ఎంతవరకు న్యాయం? పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి ఏకపక్షంగా పని చేస్తోంది. రైతులు పాదయాత్ర చేస్తుంటే పోలీసులకు బాధేంటి? అమరావతే రాజధాని అన్న సంగతి ముఖ్యమంత్రి జగన్‌కు తెలిసీ కావాలని మూడు రాజధానులను తెరపైకి తెచ్చి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారు.


అమాత్యుడికి అనుమతి.. రైతులపై ఆంక్షలు

మహాపాదయాత్ర రామచంద్రపురంలోకి చేరే కొద్దిసేపటి ముందు మున్సిపల్‌ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ తమ శ్రేణులతో కలిసి నల్లబెలూన్లతో అమరావతికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పోలీసులు ఆంక్షలు విధించి రామచంద్రపురంలో యాత్ర వెళ్లే మార్గంలో మధ్యాహ్నం రెండింటినుంచి సాయంత్రం వరకు దుకాణాలు మూయించారు. ఆ మార్గంలో రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. రైతులకు పోటీగా ఆ మార్గంలో ఇతరులు నిరసన తెలపొద్దని కోర్టు చెప్పినా అధికారులు మంత్రి కార్యక్రమానికి భద్రత కల్పించడం గమనార్హం.


మండుటెండల్లో చైతన్యధార

ఈనాడు, రాజమహేంద్రవరం- న్యూస్‌టుడే, అనపర్తి, అనపర్తి గ్రామీణం: దీపావళి ముందే వచ్చేసింది.. ఊరూరా ఉత్సాహం వెల్లివిరిసింది. రాజధాని రైతులు చేపట్టిన అమరావతి-అరసవల్లి మహాపాదయాత్ర దారి పొడవునా బాణాసంచా కాలుస్తూ ఊరూవాడా సంఘీభావం తెలిపింది. రాజధాని కోసం భూములిచ్చి దగాపడ్డ రైతుల కల సాకారమై వారి బతుకుల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం నుంచి యాత్ర మొదలై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. పసలపూడిలో భోజన విరామం అనంతరం రామచంద్రపురానికి పయనమైంది. రాయవరం మండలం సోమేశ్వరంలో రైతుల పాదాలను స్థానికులు పాలతో కడిగారు. కోలాటాలు, గరగ నృత్యాలు, కర్రసాములు, తీన్మార్‌ వాయిద్యాల నడుమ వేలాదిగా ప్రజలు, పార్టీలు, ప్రజాసంఘాలు రైతుల వెంట నడిచాయి. యాత్రలో పాల్గొని తెదేపా నేతలు నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు, ఆదిరెడ్డి వాసు, వి.వి.వి.చౌదరి, గంటి హరీష్‌ మాధుర్‌, జనసేన, ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.


కోర్టు ఉత్తర్వులు రాకముందే పోలీసుల జులుం 

అమరాతి ఐకాస కోకన్వీనర్‌ తిరుపతిరావు

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, రామచంద్రపురం: కోర్టు ఉత్తర్వులు రాకముందే రామచంద్రపురం వద్ద ఇష్టానుసారంగా రైతులను నిర్బంధించి పోలీసులు భయభ్రాంతుల్ని చేశారని అమరావతి ఐకాస కోకన్వీనర్‌ గద్దె తిరుపతిరావు ఆరోపించారు. అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులపై కేసు వేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. శుక్రవారం పాదయాత్ర ముగిశాక మీడియాతో ఆయన మాట్లాడారు. దుర్భాషలాడుతూ డీఎస్పీ మాధవరెడ్డి రైతులపట్ల ప్రవర్తించిన తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆరోపించారు. అధికారిలా కాకుండా ఆయన వైకాపా కార్యకర్తలా ప్రవర్తించారని విమర్శించారు. న్యాయస్థానం ఆదేశించినట్లు శాంతిభద్రతలు పరిరక్షించకుండా రైతులపై జులుం ప్రదర్శించడమేంటని ప్రశ్నించారు. చొక్కాలు పట్టుకుని మూతులపై పిడిగుద్దులేమిటని, మేమేమైనా రౌడీలమా? అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను గౌరవిస్తామని.. న్యాయస్థానాలన్నా, న్యాయమూర్తులన్నా మాకు దేవస్థానాలు, దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. మహాపాదయాత్రలో దేవుడి రథంపైకి పోలీసులు బూట్లతో ఎక్కారని అమరావతి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి ఆరోపించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తామని, నిబంధనలను పరిశీలించి పోలీసులు చెబుతున్న అభ్యంతరాలపై అప్పీలుకు వెళతామని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని