భూ హక్కు పత్రాల్లో తొలగని తప్పులు?

భూహక్కు పత్రాల్లో తప్పులు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో బుధవారం నుంచి రాష్ట్రప్రభుత్వం భూహక్కు పత్రాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించింది.

Published : 24 Nov 2022 04:14 IST

సరిదిద్దే వరకూ పంపిణీ వాయిదా

ఈనాడు, అమరావతి: భూహక్కు పత్రాల్లో తప్పులు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో బుధవారం నుంచి రాష్ట్రప్రభుత్వం భూహక్కు పత్రాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించింది. జిల్లాలకు చేరిన కొత్త పత్రాల్లో తప్పులు లేనివాటిని ముందుగా పంపిణీ చేయాలని, తప్పులున్నవాటిని సరిదిద్దిన తర్వాత పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో వీటిని పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రీ-సర్వే పూర్తయిన ఓ గ్రామంలో 40%, మరో గ్రామంలో 60% వరకు భూ హక్కు పత్రాల్లో తప్పులు దొర్లినట్లు తెలిసింది. పేర్లలో తప్పులతో పాటు ఫొటోలూ మారినట్లు తెలిసింది. కొన్ని పత్రాల్లో విస్తీర్ణంలోనూ తేడాలొచ్చాయి. ఆధార్‌ నంబర్లూ తప్పుగా పడ్డాయి. మరో రెండు, మూడు జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లు తెలిసింది. శ్రీకాకుళంలో సీఎం జగన్‌ లాంఛనంగా హక్కుపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించినా.. రైతులకు నేరుగా ఇచ్చే ప్రక్రియ మొదలుకాలేదు. రీ-సర్వే పూర్తయిన 1,835 గ్రామాల్లో సుమారు 8 లక్షల మందికి తొలివిడత కింద హక్కుపత్రాల పంపిణీ జరిగేలా జిల్లాలకు వివరాలు వెళ్లాయి. యజమానులను సిద్ధం చేయడం, వారికి సమాచారం ఇవ్వడం అధికారులకు ఇబ్బందిగా మారింది. గతనెల తొలివారంలోనే ఈ పత్రాలు అందించాలనుకున్నారు. తప్పులు దొర్లడంతో పంపిణీ వాయిదా వేశారు. అప్పటి నుంచి ఇటీవల వరకు సరిదిద్దే పనులు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని