రాష్ట్రంలో చిన్నారి తల్లులు!

రాష్ట్రంలో బాల్య వివాహాలు, గర్భిణుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం, తల్లిదండ్రుల అభద్రతా భావం, మూఢాచారాలవల్ల అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు.

Published : 25 Nov 2022 05:40 IST

బాల్య వివాహాల్లో ఐదో స్థానంలో ఏపీ
గర్భిణుల్లో 27 వేల మంది 15-19 ఏళ్ల మధ్య వయసు వారే

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బాల్య వివాహాలు, గర్భిణుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం, తల్లిదండ్రుల అభద్రతా భావం, మూఢాచారాలవల్ల అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. వయసు రాకముందే వివాహాలు చేయడంవల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఆ తర్వాత రక్తహీనత, పౌష్టికాహార లోపం వారిని వెంటాడుతోంది. గర్భిణులయ్యాక సమస్య ఎక్కువై తల్లీబిడ్డల ప్రాణాల మీదకు వస్తోంది. ముఖ్యంగా గర్భస్రావాలకు దారితీస్తోంది. బాల్య వివాహాల్లో జాతీయ సగటు వయసు 16.5 ఏళ్లు ఉండగా.. ఏపీలో 16.6గా ఉందని ఛైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ (కేఆర్‌వై/క్రై) అనే స్వచ్ఛంద సంస్థ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సర్వేలో తేలింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధ్యయనం-5 ప్రకారం.. బాల్య వివాహాల్లో పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, త్రిపుర, అస్సాంల తర్వాత స్థానంలో ఏపీ ఉంది.

చిత్తూరులో జిల్లాలో గరిష్ఠం

నవంబరు 5 వరకు రాష్ట్రంలో 5.17 లక్షల గర్భిణుల వివరాలు వైద్య, ఆరోగ్యశాఖ వద్ద నమోదయ్యాయి. ఇందులో 27,062 మంది (5.23%) 15-19 ఏళ్ల మధ్య వయసువారే. జిల్లాల వారీగా చూస్తే గర్భం దాల్చిన బాలికలు అత్యధికంగా చిత్తూరులో 10.13%, తిరుపతిలో 8.31%, తూర్పుగోదావరిలో 6.53% ఉన్నారు.

అకస్మాత్తు గర్భస్రావాలు 3.09%

మహిళలకు గర్భసంచి వయసుకు తగ్గట్లుగా లేకపోవడం వల్ల గర్భస్రావాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు నెలలు నిండక ముందే ప్రసవిస్తున్నారు. మరికొందరు కాన్పు సమయంలో అధిక రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళుతున్నారు. 5.17 లక్షల మంది (అన్ని రకాల వయసు వారు)లో ఇప్పటివరకు 18,999 గర్భస్రావాలు జరిగాయి. ఇందులో ఆరోగ్య రీత్యా, ఇతర కారణాలవల్ల 2,986 (0.58%), వైద్యుల సూచన మేరకు అకస్మాత్తు గర్భస్రావాలు 16,012 (3.09%) ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో తక్కువగా 0.07%, కడప జిల్లాలో అధికంగా 0.81% గర్భస్రావాలు జరిగాయి. అకస్మాత్తు గర్భస్రావాలు అధికంగా చిత్తూరు జిల్లా(4.49%), గుంటూరు జిల్లాలో (4.41%) నమోదయ్యాయి.

అత్యంత ప్రమాదకరంగా 7.91% గర్భిణులు

గర్భిణుల్లో 40,934 (7.91%) మంది గర్భిణులు అత్యంత ప్రమాదకర స్థితి(హైరిస్క్‌)లో ఉన్నారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22.34%, పార్వతీపురం మన్యం-13.40%, శ్రీకాకుళం-12.37%, విజయనగరం జిల్లాలో 11.48% మంది ఈ విభాగంలో ఉన్నారు. మహిళలకు 12-14 గ్రాముల హిమోగ్లోబిన్‌ ఉండాలి. మొదటి సారి వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణుల్లో చాలామందికి 7 నుంచి 11 గ్రాముల మధ్యే ఉంటోంది. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. బిడ్డకు బిడ్డకు మధ్య విరామం లేనందువల్ల రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts