బలవంతంగా దారి ఏర్పాటు చేస్తున్నారని రైతుల ఆత్మహత్యాయత్నం

పొలంలో లేని దారిని వైకాపా నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

Published : 02 Dec 2022 02:53 IST

వైకాపా ప్రోద్బలంతో పోలీసులు, అధికారుల దౌర్జన్యం
పొక్లెయిన్‌తో రైతులను తోసేసే ప్రయత్నం

ఉరవకొండ,న్యూస్‌టుడే: పొలంలో లేని దారిని వైకాపా నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల తండా వద్ద చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం మేరకు.. ఉరవకొండ మండలం రాకెట్లలో సర్వేనంబర్‌ 623లో పలువురు రైతులకు 53 ఎకరాల పొలం ఉంది. వాటి వెనకాల ఉన్న పొలాలకు ఆ సర్వే నంబరు మీదుగా దారిని వదలాలంటూ గత ఇరవై రోజులుగా అధికారపార్టీ నాయకులు రెవెన్యూ అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారు. అందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారు. గత నెల రెండో వారంలో అధికారులు పర్యటించి మరో సర్వే నంబరులో మార్గం ఉన్నట్లు గుర్తించారు. అందులో రాకపోకలు సాగించాలని రైతులకు సూచించారు. అయితే ఆ దారిని కొందరు అకస్మాత్తుగా మూయించారు. 623 సర్వే నంబరులోనే దారిని వదలాలంటూ అధికార పార్టీ అండతో కొందరు బుధవారం రాత్రి రాద్ధాంతం చేశారు. అంతటితో ఆగకుండా గురువారం పొక్లెయిన్‌తో రైతులకు చెందిన పట్టా భూమిలో దారిని వదలాలంటూ అధికార పార్టీ నాయకులు రెవెన్యూ, పోలీసు అధికారులతో తరలివచ్చారు. వారిని బాధిత రైతులు అడ్డుకున్నారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు రైతులను పొక్లెయిన్‌తో ఈడ్చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో యంత్రం తగిలి పలువురు కింద పడిపోయారు. పోలీసులు బాధిత రైతులపై చేయి చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన శ్యామలమ్మ, రామస్వామినాయక్‌ అనే రైతులు పురుగు మందు తాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న వారిని పోలీసులు తమ వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలిస్తుండగా బాధిత కుటుంబీకులు అడ్డుకొని తిరిగి ఉరవకొండ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తమకు అన్యాయం జరుగుతున్నపుడు ప్రాణాలు ఉండి ఏం చేయాలంటూ బాధితులు పోలీసులతో వాదించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐ హరినాథ్‌ పోలీసు సిబ్బంది సాయంతో బాధిత రైతులను అనంతపురం తరలిస్తుండగా బంధువులు అడ్డుపడ్డారు. వారిని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకే తాము పొలం వద్ద బందోబస్తు కల్పించామని, ఎవరి పైనా దౌర్జన్యం చేయలేదని సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని